పండగ రోజుల్లో పోషకాలు..

సుమతికి భక్తి ఎక్కువ. నవరాత్రుల్లో రోజూ ఒంటిపూట ఉంటూ..  త్వరగా నీరసపడిపోతుంది. కష్టపడి ఎలాగో పూర్తి చేస్తుంది.

Updated : 30 Sep 2022 02:47 IST

సుమతికి భక్తి ఎక్కువ. నవరాత్రుల్లో రోజూ ఒంటిపూట ఉంటూ..  త్వరగా నీరసపడిపోతుంది. కష్టపడి ఎలాగో పూర్తి చేస్తుంది. అలాకాకుండా ఈ రోజుల్లోనూ పోషకాహారం తీసుకుంటే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

పండగరోజులను నీరసంగా, నిరుత్సాహంగా మార్చకూడదు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, పూజలు చేస్తూనే ఉత్సాహంగా దాండియా, బతుకమ్మ కూడా ఆడొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజంతా ఆహారానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. భోజనానికి బదులుగా టొమాటో, కీరదోస, క్యారెట్‌, ఉడికించిన ఆకు కూరలు వంటివి తీసుకుంటే మంచిది. బొప్పాయి, యాపిల్‌, జామ వంటి పండ్లను గంటకు ఒకటి తీసుకున్నా చాలు. శరీరానికి పోషకాలు అందుతాయి. నీరసం దరిచేరదు. పండ్ల రసాలకు దూరంగా ఉండటం మంచిది. వీటితో చక్కెర అధికంగా చేరే ప్రమాదం ఉంది.

పాల ఉత్పత్తులు..

పనీర్‌, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు తక్షణ శక్తినిస్తాయి. ప్రొటీన్లు, కాల్షియం అందేలా చేస్తాయి. రాత్రి సమయాల్లో అల్పాహారంగా ఒక జొన్నరొట్టె, సగ్గుబియ్యం కిచిడీ, అటుకులు లేదా మరమరాల ఉప్మా వంటివి తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. శక్తినిస్తాయి. ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగితే డీహైడ్రేషన్‌ కాదు. ఎండు ఫలాలతో కావాల్సినన్ని పోషకాలు అందుతాయి.

పీచు..

రోజులో కనీసం నాలుగైదు రకాల పండ్లను తీసుకోవాలి. ఎక్కువ పీచు ఉండేవి ఎంచుకుంటే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో మలినాలు బయటకు వెళతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. శరీరానికి తగిన శక్తి అందాలంటే కార్చోహైడ్రేట్లు కూడా చాలా అవసరం. పీచు ఎక్కువగా ఉండే గింజ ధాన్యాలు, ఆకుకూరలు, బంగాళాదుంప, చిలగడదుంప వంటివి తప్పక తీసుకోవాలి. వీటిలో పీచు ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు, బీ6, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలూ ద్వారా సి విటమిన్‌, పొటాషియం, చిలగడదుంపతో విటమిన్‌ ఏ, బీ5 అందుతాయి. సూక్ష్మపోషకాలు ఉండే గింజధాన్యాలు ప్రొటీన్లు సహా ఆరోగ్యకరమైన కొవ్వు, పీచు, ఖనిజ లవణాలను అందిస్తాయి. తామర విత్తనాల్లో ఇనుము, కాల్షియం, పీచు, ప్రొటీన్లు, మెగ్నీషియం వంటివి ఉంటాయి. దీన్ని ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే మంచిది.  

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్