పండగలో పడి.. డైట్‌ మరిచారా!

పండగల్లో, పూజల్లో పనితో తిండి వేళలు మారిపోతాయి. ఆకలికి ఏదో ఒకటి తినేస్తాం. కుటుంబమంతా ఒక చోట చేరితే కబుర్లలో పడి తెలియకుండానే ఎక్కువ లాగిస్తాం.

Updated : 07 Oct 2022 09:02 IST

పండగల్లో, పూజల్లో పనితో తిండి వేళలు మారిపోతాయి. ఆకలికి ఏదో ఒకటి తినేస్తాం. కుటుంబమంతా ఒక చోట చేరితే కబుర్లలో పడి తెలియకుండానే ఎక్కువ లాగిస్తాం. ఇలా ఒంట్లో చేరిన అదనపు కెలోరీలను తగ్గించేయాలా..

* పిండి వంటలంటేనే నూనెతో నిండినవి. కొవ్వు చేరడమే కాదు.. శరీరమూ డీహైడ్రేట్‌ అవుతుంది. వారం పాటు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీటిని తప్పక తాగండి. సాదానీరు తాగలేకపోతుంటే కీర, పుదీనా, నిమ్మరసం, తేనె కలిపి ఉంచుకోండి. రోజంతా తాగితే సరి. శరీరం తేలిగ్గా ఉంటుంది. పోషకాలూ అందుతాయి.

* ఉదయాన్నే టీ, కాఫీల స్థానంలో గ్రీన్‌ టీని చేర్చుకోండి. చెడు కొలెస్ట్రాల్‌కి చెక్‌ పెట్టడమే కాదు, బరువునీ అదుపులో ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లూ అందుతాయి. వీటితోపాటు విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నారింజ, అనాస, కివీ, నిమ్మలను ఉదయాన్నే తీసుకోండి. ఆహారంలోనూ తాజా కూరగాయలు, ఆకుకూరలను చేర్చుకుంటే ఇన్‌ఫ్లమేషన్నూ తప్పించుకోవచ్చు. అరుగుదల తగ్గడం, కడుపుబ్బరం వంటివీ తప్పుతాయి.

* పండగ హడావుడిలో వ్యాయామమెక్కడ గుర్తుంటుంది. అలాగని ఆ నిర్లక్ష్యాన్నే కొనసాగించొద్దు. రోజూ చేసే వ్యాయామానికి కొన్నిరోజులు పది నిమిషాల చొప్పున సమయం పెంచుకోండి. కఠిన వ్యాయామాలే చేయాలనేమీ లేదు. చిన్న స్ట్రెచ్‌లు, నెమ్మదిగా చేసే పరుగు, నడకనీ ఎంచుకోవచ్చు. వ్యాయామం ఆరోగ్యమే కాదు.. చర్మాన్ని మెరిసేలానూ చేస్తుంది.

* నెలలపాటు ఆరోగ్యకరమైనవి తింటూ ఒక్కసారిగా కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థకీ భారమే. దాని ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలి. పెరుగు, పులిసిన పదార్థాలకు ఎక్కువ చోటివ్వండి. ఇది ఆరోగ్యకరమైన బాక్టీరియాను అభివృద్ధి చేస్తే, అవి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్