సోషల్‌మీడియా డిటాక్స్‌ తప్పదు..

రాధిక అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటుంది. రాత్రి పోస్ట్‌ చేసిన తన ఫొటోలకు లైక్స్‌, కామెంట్స్‌ ఎన్ని ఉంటాయనే ఆత్రుత ఆమెను పరగడుపునే ఫోన్‌కు అలవాటయ్యేలా చేసింది.

Updated : 11 Oct 2022 08:36 IST

రాధిక అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటుంది. రాత్రి పోస్ట్‌ చేసిన తన ఫొటోలకు లైక్స్‌, కామెంట్స్‌ ఎన్ని ఉంటాయనే ఆత్రుత ఆమెను పరగడుపునే ఫోన్‌కు అలవాటయ్యేలా చేసింది. ఇది క్రమంగా పలురకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. సోషల్‌ మీడియాకంటూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవడమే దీనికి పరిష్కారం అంటున్నారు. 

దయం నిద్రలేవడానికి ఫోన్‌లో కాకుండా గడియారంలో అలారం ఉండాలి. నిద్రలేచిన వెంటనే ఫోన్‌ చేతిలోకి తీసుకోనక్కర్లేదు. కిటికీ లేదా బాల్కనీ నుంచి సూర్యోదయాన్ని చూస్తూ కప్పు గ్రీన్‌టీ లేదా వేడి కాఫీ తీసుకుంటే మనసంతా ఉల్లాసంగా మారుతుంది. పావుగంట వ్యాయామానికి కేటాయించుకొని చిన్న చిన్న స్ట్రెచ్‌లు, లేదా కాసేపు నడక శారీరకంగా కొత్త శక్తి వచ్చినట్లుంటుంది. ఉత్సాహంగా రోజును ప్రారంభించి, ఇంట్లో, ఆఫీస్‌లో ఆ రోజు చేయాల్సిన పనులు, బాధ్యతలను పూర్తిచేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. 

తొలగించి..

ఫోన్‌లో కాలక్షేపానికి వినియోగించే అనవసరమైన యాప్స్‌ను తొలగించడం మంచిది. లేదంటే కాస్తంత సమయం దొరికినా ఫోన్‌లోకి వెళ్లిపోయే అలవాటు మానలేరు. ముందుగా యాప్స్‌ తొలగిస్తే సోషల్‌మీడియాపై ఏకాగ్రత తగ్గుతుంది. ఫిట్‌నెస్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కలిగించే ప్రయోజనకరమైన కొన్నింటిని మాత్రం ఎంపిక చేసి, మిగతావాటిని తొలగించాలి. ఈ యాప్స్‌ను వీక్షించడానికి రోజులో ఎంతోకొంత నిర్ణీత సమయాన్ని మాత్రమే కేటాయించుకోవాలి. 

బదులుగా..

రోజులో ఎన్ని గంటలు ఫోన్‌కు వృథా చేస్తున్నామో గుర్తించాలి. మన విలువైన సమయాన్నే కాదు, శరీరంలోని శక్తినీ హరించి మానసిక ఒత్తిడిని పెంచే సోషల్‌మీడియాను పక్కనపెట్టి, ఏదైనా కొత్త అలవాటు లేదా యాక్టివిటీకి ఆ టైంను బదిలీ చేయాలి. కొత్త భాష నేర్చుకోవడం, కెరియర్‌ కోసం ఏదైనా కోర్సు చేయడం, తోటపని, మనసుకు నచ్చిన పుస్తకం చదవడం వంటివి ఎంచుకుంటే కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు. సమయం విలువ గురించి అవగాహన కలిగించే పుస్తకాలు చదివితే, సోషల్‌మీడియా ప్రభావం నుంచి బయటపడొచ్చు.

కుటుంబం ..

ఈ సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తే అనుబంధాలు బలపడతాయి. ఇంటిల్లిపాదీ కలిసి సరదాగా మాట్లాడుతూ భోజనం చేయడం, ఏదైనా సమస్య ఉంటే కలిసి పరిష్కరించుకోవడం, వారాంతాల్లో పర్యటకప్రాంతాలకు వెళ్లిరావడం వంటివి మానసికానందాన్ని అందిస్తాయి. ఒంటరిగా కాకుండా అందరం కలిసి అన్న భావన మనసులో నిండుతుంది. శరీరంలో వృథాను డిటాక్స్‌ చేసేలా సోషల్‌మీడియానూ చేయగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్