మెదడుకు స్వీట్‌ స్పాట్‌ 7 గంటలు..

వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు ఆరోగ్యంపై నిద్రపోయే సమయం ప్రభావాన్ని చూపిస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. నాలుగు పదులు నిండేసరికి సరిగ్గా ఏడు గంటల నిద్ర మెదడును నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొంది.

Published : 28 Oct 2022 00:34 IST

అధ్యయనం

వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు ఆరోగ్యంపై నిద్రపోయే సమయం ప్రభావాన్ని చూపిస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. నాలుగు పదులు నిండేసరికి సరిగ్గా ఏడు గంటల నిద్ర మెదడును నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొంది. కేంబ్రిడ్జి, ఫుడాన్‌ విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనలో ఇంకా ఏం తేలిందంటే..

ఏడు గంటలకన్నా తక్కువగా, ఎనిమిది గంటలకన్నా ఎక్కువగా నిద్రను పరిగణనలోకి తీసుకుంటే ఈ రెంటి మధ్యలో ఆరోగ్యకరమైన స్వీట్‌ స్పాట్‌ 7 గంటల నిద్రగా పరిశోధకులు గుర్తించారు. లండన్‌ బయోబ్యాంకు నుంచి 38-73 ఏళ్ల మధ్య ఉన్న 5 లక్షల మంది డాటాను తీసుకొన్నారు. ఇందులో నిద్ర పోయే సమయం నుంచి మానసికారోగ్యానికి సంబంధించిన అంశాల వరకూ వారు చెప్పిన సమాధానాలున్నాయి. వీరిలో 40 వేలమందివి మెదడు స్కాన్స్‌, జెనిటిక్‌ డాటాను కూడా సేకరించి పరిశీలించారు. అతి తక్కువ సమయం నిద్రపోయే వారి మెదడులో కొన్నిరకాల మార్పులను గుర్తించారు. సరిగ్గా ఏడు గంటల నిద్ర ఉన్నవారి మానసికారోగ్యాన్ని పరిశీలించాక, నిద్ర సమయం, వేళలు తదితర అంశాలన్నీ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు భావించారు. 8 గంటలకన్నా ఎక్కువ నిద్ర, అలాగే నిద్రలేమి వంటివి డిమెన్షియా, అల్జీమర్‌ వంటి వ్యాధులకు కారణం అవుతున్నట్లు తెలిసింది. మెదడులోని ఎమిలాయిడ్‌ ప్రొటీన్ల ఉత్పత్తిలో నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుండటంతో అతి తక్కువ సమయం నిద్రపోయే వారిలో పలు అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. మానసిక రుగ్మతలకు గురి కావడంలో నిద్రలేమి పాత్రా ప్రధానంగా ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

నిర్ణీత సమయం... ప్రయోజనాలెన్నో..

ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా ఏడు గంటల నిద్రలో ప్రయోజనాలెన్నో ఉన్నాయి. మానసికారోగ్యంతోపాటు వీరి మెదడు చురుగ్గా పనిచేస్తోంది. రోజూ 7 గంటల నిద్రను పాటిస్తున్న వారిలో మెండైన జ్ఞాపకశక్తి, ఎలాంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించగల నైపుణ్యాలు కనిపించాయి. ఆదమరిచి నిద్రపోయినప్పుడు మెదడులోని టాక్సిన్లు బయటకు పంపే ప్రక్రియ సక్రమంగా జరిగి, మెదడు ఆరోగ్యంగా ఉంటోంది. ఇందుకోసం రోజూ నిర్ణీత సమయంలో నిద్ర అలవరుచుకోవాలంటున్నారు పరిశోధకులు. నిద్రకు ముందు ఫోన్‌కు దూరంగా ఉండాలని, డిన్నర్‌లో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని రాత్రి ఏడులోపే తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరని, నిద్ర పోయే ముందు పుస్తకపఠనం, మనసుకు నచ్చిన సంగీతం వినడం వంటివన్నీ స్వీట్‌ స్పాట్‌ ఏడు గంటల నిద్రను అందిస్తాయని చెబుతున్నారు.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్