గుండెకు నేస్తం

ఎవరైనా నమ్మశక్యం కాని మాటలు చెబుతుంటే ‘చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టొద్దు’ అనేస్తాం కదూ! చెవిలో కాకుండా చేతిలో పెడితే ఎంచక్కా వండేసుకోవచ్చు.

Published : 13 Nov 2022 00:08 IST

ఎవరైనా నమ్మశక్యం కాని మాటలు చెబుతుంటే ‘చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టొద్దు’ అనేస్తాం కదూ! చెవిలో కాకుండా చేతిలో పెడితే ఎంచక్కా వండేసుకోవచ్చు. అంతే కదా మరి! చిన్నచెట్టును పోలినట్టుండే సొగసైన క్యాలీఫ్లవర్‌ రుచిలో ఆహా అనిపిస్తే, ఆరోగ్యపరంగా ఓహో అనిపిస్తుంది.

* ఇందులో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్‌, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, భాస్వరం, మాంగనీస్‌, విటమిన్లు ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

* క్యాలీఫ్లవర్‌ను ‘గుండెకు నేస్తం’ అంటారు. రక్త నాళాలు బిరుసెక్కడం, రక్తపోటు లాంటి సమస్యలను నివారిస్తుంది. రక్తం ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడుతుంది. అందువల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. తరచూ క్యాలీఫ్లవర్‌ తినేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువంటారు ఆరోగ్య నిపుణులు.

* ఊబకాయంతో బాధపడే వారికిది పసందైన ఆహారం. దీన్ని ఏ రూపంలోనైనా నిశ్చింతగా తినొచ్చు.

* క్యాలీఫ్లవర్‌లోని గ్లూకోబ్రాసిసిన్‌, గ్లూకోరాఫనిన్‌, గ్లూకోనాస్ట్రిన్‌లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

* క్యాలీఫ్లవర్‌ యాంటీ క్యాన్సర్‌, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్‌ కూడా. మధుమేహాన్ని నివారిస్తుంది.

* జ్ఞాపకశక్తికి, నరాల వ్యవస్థకు కీలకమైన కోలిన్‌ ఇందులో విస్తారంగా ఉంది. మనలో చాలామంది ‘మూడ్‌ బాలేదు’ అనడం వింటుంటాం. ఆ స్థితి నుంచి బయటపడేస్తుంది క్యాలీఫ్లవర్‌.

* క్యాలీఫ్లవర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శారీరక, మానసిక ఇబ్బందులను తొలగించి ఉత్సాహంగా ఉంచుతాయి. ఇందులోని పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

* కొందరు అసలు వయసు కంటే ఎక్కువున్నట్టు కనిపిస్తారు. క్యాలీఫ్లవర్‌ అలా కానివ్వదు. చర్మం ముడతలు పడకుండా నిగారింపుతో ఉండేట్లు చేస్తుంది.

* కె-విటమిన్‌ తక్కువైతే ఎముకలు పెళుసుబారి చిట్లడం, విరగడం తెలిసిందే. ఆస్టియో పొరాసిస్‌ బారిన పడే ప్రమాదమూ ఉంది. క్యాలీఫ్లవర్‌లో కె-విటమిన్‌ ఉన్నందున ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులోని ఇ-విటమిన్‌ కళ్ల కింది వలయాలను పోగొడుతుంది.

* క్యాలీఫ్లవర్‌తో కూర, వేపుడు అందరికీ తెలిసినవేే! దీన్ని ఎందులో చేర్చినా అదనపు రుచి వస్తుంది. క్యాలీఫ్లవర్‌ రైస్‌ బిర్యానీతో సమానమైన ఘుమాయింపుతో నోరూరిస్తుంది. క్యాలీఫ్లవర్‌ పకోడీలూ అంతే.. చిన్నా పెద్దా అందరికీ తెగ నచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్