మెనోపాజ్‌కు సిద్ధమవండి!

45-55 ఏళ్ల వయసును మహిళల్లో ముఖ్యమైన దశగా చెబుతారు. నెలసరి ఆగిపోవడం, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం..

Updated : 25 Mar 2023 16:56 IST

45-55 ఏళ్ల వయసును మహిళల్లో ముఖ్యమైన దశగా చెబుతారు. నెలసరి ఆగిపోవడం, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం.. లాంటి సమస్యలెన్నో! మెనోపాజ్‌గా చెప్పే ఈ దశను సమర్థంగా ఎదుర్కోవాలంటే...

* బరువు.. ఈ సమయంలో మెటబాలిజం నెమ్మదిస్తుంది. అందుకే త్వరగా బరువు పెరుగుతారు. ఆర్థరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌ వంటివి అదనం. అందుకే ముందు నుంచే బరువుపై దృష్టిపెట్టండి. 40కి దగ్గరపడుతున్నప్పుడే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. తక్కువ కొవ్వు, సమతులంగా కార్బోహైడ్రేట్లు, ఎక్కువ పీచు, ప్రొటీన్లు ఆహారంలో భాగమవ్వాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, పప్పుధాన్యాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉండేవాటిని తప్పక తీసుకోవాలి.

* వ్యాయామం.. దీన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. రోజూ అరగంట నడక, యోగా, డ్యాన్స్‌.. ఇలా నచ్చిన వాటిలో ఏవైనా రెండు చేస్తే మేలు. కటి సంబంధిత ఎక్సర్‌సైజ్‌లనూ చేర్చుకోవాలి.

* క్యాల్షియం.. ఈ సమయంలో శరీరంలో క్యాల్షియం తగ్గుతుంది. పాలు, పాల పదార్థాలు, గుడ్డును రోజూ తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లనీ తీసుకోవచ్చు. విటమిన్‌ డి లోపం ఎక్కువగా కనిపించే సమయమిది. రోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండటం అలవాటు చేసుకోండి.

* భావోద్వేగాలపై పట్టు.. మెనోపాజ్‌లో మూడ్‌స్వింగ్స్‌ ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడే ఆనందం, అంతలోనే చిరాకు.. చిన్నవాటికే ఏడ్చేయడం.. వంటి వాటికి ఆస్కారమెక్కువ. మానసిక ఆరోగ్యాన్నీ పట్టించుకోండి. రోజూ కొంతసేపు ధ్యానం చేయడం, కొత్త భాష, హాబీ ప్రయత్నించడం వంటివి చేస్తే మేలు. ఒత్తిడీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీలైనంతగా దాన్ని దరిచేరకుండా చూసుకోవాలి. టీవీ, మొబైల్‌ను ముఖ్యంగా రాత్రుల్లో దూరంగా ఉంచాలి. ఆరు దాటాక టీ, కాఫీలను తీసుకోవద్దు.

* సిద్ధం చేయండి.. శరీరంలో మార్పులను భర్త, పిల్లలతో పంచుకోండి. అప్పుడే మీరేం ఎదుర్కొంటున్నారన్నది వాళ్లకీ అర్థమవుతుంది. మీలో మీరు బాధపడటంలో ప్రయోజనం ఉండదు. మీ మూడ్‌ను తేలిక పరచడానికి వాళ్లేం చేయాలో సూచిస్తే ఇంకా మంచిది. వాళ్ల సాయంతో ఈ దశను సులువుగా దాటగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్