ఆరోగ్యంగా.. తిందాం!

రోజురోజుకీ అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలకూ మినహాయింపు లేదు. ఇందుకు ముఖ్య కారణం పంటలకు వాడుతున్న ఎరువులూ పురుగుమందులే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Published : 07 Feb 2023 00:25 IST

రోజురోజుకీ అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలకూ మినహాయింపు లేదు. ఇందుకు ముఖ్య కారణం పంటలకు వాడుతున్న ఎరువులూ పురుగుమందులే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో వడ్లు పండించలేకపోయినా కాయగూరల వరకూ మనం పెంచుకోవచ్చు. ఆర్గానిక్‌ పంటలతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కిచెన్‌ గార్డెన్‌ కష్టమైన వ్యవహారమేమీ కాదు, కింది జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

* మొక్కలకు సూర్యరరశ్మి ముఖ్యం కనుక నీడ లేని ప్రాంతంలో మొక్కలు నాటుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం తగినన్ని నీళ్లు పోయాలి. నెలకొకసారి అయినా మొదళ్లలో మట్టిని గుల్లచేయాలి. కుండీల్లో పెంచేట్లయితే చిన్నవాటికి పది అంగుళాలు, పెద్దవాటికి 18 అంగుళాలవి ఎంచుకోవాలి. వృక్ష, తీగ జాతులకు నీళ్ల తొట్టి లాంటి పెద్దవి అనుకూలం. లేదంటే ఎదగకుండా అణగారిపోతాయి.

* బెండ, వంగ, మిర్చి, బీర, సొర, దోస, కాకర, దొండ, చిక్కుడు, గోరుచిక్కుడు, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర.. అన్నిటికీ చోటు కల్పించొచ్చు. మనకి సరిపోవడమే కాదు, అప్పుడప్పుడూ మనవాళ్లకీ ఇవ్వొచ్చు. వీటితో కాస్త ధైర్యం వచ్చిందంటే కంద, పెండలం లాంటి దుంప కూరలనూ వృద్ధి చేయొచ్చు.

* కాయగూరలకు తోడు మల్లె, మందారం, కనకాంబరం, గులాబి, లిల్లీ లాంటి పూల మొక్కలను నాటితే ఆ అందం అలరిస్తుంది. ఆ సువాసనలు మాధుర్యాలను పంచుతాయి.

* మధ్యమధ్యలో కరివేపాకు, పుదీన, తులసి, సబ్జా, తమలపాకు లాంటి పరిమళభరిత మొక్కలుంటే ఔషధాలను అందిస్తాయి. చీడపీడలను కొంతవరకూ నివారిస్తాయి కూడా.

* ఎరువులకు బదులు ఇంట్లో వడకట్టిన టీపొడి, కూరగాయల వ్యర్థాలు, ఉల్లిపొట్టు, పండ్ల తొక్కలను, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వేపాకు పొడిని ఉపయోగించడం మేలు. ఈ చిన్ని తోటతో అందం, ఆనందం, ఆరోగ్యం కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్