మనసు మాట లిఖిద్దాం!

ఆడవాళ్ల మనసు సున్నితం.. చాలామంది అనే మాటే ఇది! అందుకేనేమో ఎక్కడ నవ్వుతారో, నలుగురూ ఏమనుకుంటారోనని చిన్నవే అని సర్దిచెప్పుకొని మనసులో బోలెడు సమస్యలు దాచేసుకుంటాం.

Published : 16 Feb 2023 00:58 IST

ఆడవాళ్ల మనసు సున్నితం.. చాలామంది అనే మాటే ఇది! అందుకేనేమో ఎక్కడ నవ్వుతారో, నలుగురూ ఏమనుకుంటారోనని చిన్నవే అని సర్దిచెప్పుకొని మనసులో బోలెడు సమస్యలు దాచేసుకుంటాం. అవి మెదడుపై ఎంత ఒత్తిడి పెంచుతాయో తెలుసా? దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయట. అందుకే  బయట పెట్టమంటున్నారు నిపుణులు..

* చెప్పలేకే కదా బాధంతా అంటారా? ఓ పెన్ను, కాగితం తీసుకొని కోపం, బాధ ఏదైనా రాయండి. దాని వెనుకనున్న కారణాన్నీ చేర్చండి. ఎవరైనా చూస్తారన్న భయం ఉంటే మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌లోనైనా ప్రయత్నించవచ్చు. ఇక్కడ రాత నైపుణ్యాలే అవసరం లేదు. కాబట్టి, స్వేచ్ఛగా రాసేయండి.

* ఎప్పుడూ బాధలే అయితే బోర్‌ కొట్టదూ! బాగా ఆనందం అనిపించిన విషయాల్నీ రాస్తుండండి. ఆరోజు పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీ లేదనుకోండి. రోజు మొత్తం ఎలా గడిచిందో చేర్చండి. ఒక్కలైను అయినా ఫర్లేదు. రోజూ 5 నిమిషాలు మీ మనసులోని మాటను రాతల్లో ఉంచడం తప్పనిసరి చేసుకోవాలి.

* రాయలేను.. మాటల్లోనూ చెప్పలేను అంటారా? పోనీ బొమ్మలు, కార్టూన్లు, డూడుల్స్‌.. వెతకాలే కానీ బోలెడు మార్గాలు. ఆలోచనలు ఏవైనా వాటిల్లో పెట్టేస్తే సరి. ఇది ఎవరో చూడాలని కాదు. మీ మనసును మీ ముందు ఉంచుకునే మార్గం మాత్రమే. కాబట్టి, ధైర్యంగా ప్రయత్నించేయొచ్చు.

* వాక్యాల చివర్లో మీ మనసును తెలిపే ఎమోజీలు చేర్చండి. వారం పూర్తయ్యాక వెనక్కి తిరిగి రాసినదంతా ఓసారి చూసుకుంటే మనసు ఎంత తేలికపడిందో అర్థమవుతుంది. ఏ మూలో బాధ, అసహనం మిగిలినా ఈ ఎమోజీలు మూడ్‌ని మార్చేస్తాయట.

* మనసులోని మాట వాక్యాల్లో పెట్టేప్పుడు దాన్ని ఒక క్రమంలో రాయాలి, బాధనంతా అర్థమయ్యేలా చెప్పాలని చాలా ఆలోచిస్తాం. ఇక్కడ మధ్యలో ఆపే, గేలి చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి, మనసు ఇట్టే తేలిక పడుతుంది. పైగా ఎవరికీ తెలిసే అవకాశముండదు. జడ్జ్‌ చేస్తారన్న భయం లేకుండా నిజాయతీగా రాస్తాం. దీంతో మెదడుపై ఒత్తిడి ఉండదు. మరి మనసు మాట బయట పెట్టడానికి సిద్ధమా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్