Published : 19/02/2023 00:17 IST

వీటితో ఆవిరి పడితే..

రాత్రి చలి, పగలేమో ఎండ.. భిన్నవాతావరణాలు.. పర్యావసానం జలుబు, దగ్గు. ఇలాంటప్పుడు సాధారణంగా వేడి నీటితో ఆవిరి పట్టడం మనకు మామూలే! అయితే ఈ సంప్రదాయ మార్గానికి ఇంకొన్నింటిని జోడించండి. త్వరిత ఉపశమనంతోపాటు అదనపు ప్రయోజనాలూ ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* పుదీనా.. ముక్కు బిగుసుకుపోయిందా? మరిగిన నీటిలో పుదీనా ఆకులు లేదా నూనె వేసి ఆవిరి పీల్చండి. దీనిలో ఉండే మెంతాల్‌ ఆ సమస్యను దూరం చేస్తుంది. జలుబు చేసినప్పుడు గొంతు నొప్పీ మామూలే కదా! ఆ సమస్యకీ ఇది చెక్‌ పెట్టేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఇవి ఆస్తమా ఉన్నవారికీ ఉపశమనం కలిగిస్తాయి.

* తులసి.. యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ.  మరగ కాచిన నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని పీలిస్తే సరి. జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటివాటికి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జ్వరం తగిలినట్లు ఉండే భావననీ దూరం చేస్తుంది. దీనిలోని అడాప్టోజెన్‌ ఒత్తిడినీ దూరం చేయగలదు.

* రోజ్‌మెరి.. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి వేగంగా జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బ్రాంకియల్‌ ఆస్తమా చికిత్సలో దీన్ని వాడతారు. ఆవిరి పట్టే నీటిలో 5 చుక్కలు రోజ్‌మెరి ఆయిల్‌ను వేసి రోజుకు మూడుసార్లు పీల్చండి. దీనిలోని యాంటీ సెప్టిక్‌ గుణాలు గొంతు గరగరని తగ్గిస్తాయి. జలుబే కాదు.. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పీ దూరం అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని