ఇలా తిందాం.. చురుగ్గా ఉందాం!

శరీరంలో జీవక్రియలు మెరుగ్గా జరగకపోతే మహిళల దైనందిన జీవితంలో పలురకాల అనారోగ్యాలెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Published : 20 Feb 2023 00:09 IST

శరీరంలో జీవక్రియలు మెరుగ్గా జరగకపోతే మహిళల దైనందిన జీవితంలో పలురకాల అనారోగ్యాలెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. రోజూవారీ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను అరికట్టొచ్చని చెబుతున్నారు.

ఇంటిల్లపాదికీ ఆహారాన్ని అందించి సమయా భావంతో చాలామంది ఉద్యోగినులుసహా గృహిణులు ఆహారం తీసుకోవడంలో అలక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. తీసుకున్న ఆహారంలో సరైన పోషకాలున్నాయో లేదో పట్టించుకోరు. దీనివల్ల జీవక్రియల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. మధుమేహం, హృద్రోగాలు, అధిక బరువు వంటివి ఎదురవుతాయి. పని ఒత్తిడి ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవరుచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆహారంలో.. శరీరానికి ఆహారంద్వారా కెలొరీలు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు తదితర పోషకాలను ప్రతిరోజూ అందేలా చేయాలి. తాజా పండ్లు, కూరగాయలుసహా, గింజ ధాన్యాలు, ఆకుకూరలను తీసుకోవాలి. పోషకాలెక్కువగా, సోడియం, చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండేలా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కెలొరీలు తక్కువగా, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉండేవాటిని ఎంచుకుంటే మంచిది.

తప్పనిసరి.. గుడ్లు, చికెన్‌, పాల ఉత్పత్తులు వంటివి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా కోడిగుడ్డులోని తెల్లసొన జీవక్రియల రేటును పెంపొందిస్తుంది. ఉదయాన్నే తెల్లసొనతో మిరియాలపొడి కలిపి వేసే ఆమ్లెట్‌లోని అమినోయాసిడ్స్‌ , కాప్‌సైసిన్‌ రోజంతా జీవక్రియలను వేగవంతం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతాయి. గ్రీన్‌టీలోని బయో యాక్టివ్‌ పదార్థాలైన కెఫైన్‌ వంటివి జీవక్రియల రేటును పెంచుతాయి. అధిక బరువును తగ్గించడానికి దోహదపడతాయి. వీటితోపాటు నెయ్యిసహా ప్రొబయాటిక్స్‌, మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే పాలు, పెరుగును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

సమయానికి.. ఉపవాసం పేరుతో రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో జీవక్రియలు ప్రభావితమవుతాయి. కనీసం అయిదుగంటల్లోపు ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకి కనీసం ఏడు గ్లాసుల నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైతే  జీవక్రియల రేటు తగ్గుతుంది. అలాగే రోజుకి ఏడు గంటల నిద్ర అత్యవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్