అమ్మ మనసులో.. అలజడెందుకు?

ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పాల ప్యాకెట్ను కబోర్డులో పెట్టేస్తాం. వంటగదిలో సర్దాల్సిన పప్పు దినుసుల్ని ఫ్రిజ్‌లో ఉంచుతాం. గదిలోకి వెళ్లి ‘ఎందుకొచ్చాం’ అనుకుంటాం.

Published : 01 Dec 2023 01:51 IST

ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పాల ప్యాకెట్ను కబోర్డులో పెట్టేస్తాం. వంటగదిలో సర్దాల్సిన పప్పు దినుసుల్ని ఫ్రిజ్‌లో ఉంచుతాం. గదిలోకి వెళ్లి ‘ఎందుకొచ్చాం’ అనుకుంటాం. ఇలా మీకూ ఎప్పుడైనా జరిగిందా..! కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఈ లక్షణాలన్నీ ప్రసవం తరువాత చాలామంది మహిళలను పలకరిస్తుంటాయి. ఈ పరిస్థితినే మామ్స్‌ బ్రెయిన్‌ అంటారు. నిత్యం ఇలా జరుగుతుంటే ఇబ్బంది కదా! దీన్ని తగ్గించుకోడానికి నిపుణులిచ్చే సలహాలేంటంటే..

పోషకాహారంతో చెక్‌

గర్భిణిగా ఉన్నప్పుడే కాదు.. ప్రసవం తరువాత కూడా సమతులాహారం తీసుకోవడం తప్పనిసరి. పోషకాహారలోపం ఉన్నా ప్రసవమయ్యాక ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల్లో మతిమరుపునకు దారితీస్తుంది. కొందరు బాలింతగా ఉన్నప్పుడు పథ్యం పేరుతో తినాల్సినవి తినరు. అలా చేయటం సరికాదు. ఆకు కూరలు, పాలు, పండ్లు, పప్పుధాన్యాలు వంటివన్నీ ఉండేలా చూసుకోండి.

ఒత్తిడి తగ్గించుకుంటేనే

ఉద్యోగినులైతే బిడ్డతో పాటు, ఉద్యోగం, ఇంటి బాధ్యతలనూ చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక చాలామంది ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలూ ఎదుర్కొంటారు. ఒత్తిడి తగ్గించుకోడానికి నడక, తేలికపాటి వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేయండి. ప్రతి పనికీ ముందుగానే ప్రణాళిక వేసుకోండి. అన్ని పనులూ మీరే చేసుకోవాలనుకోకుండా కుటుంబ సభ్యులకీ చెప్పండి. అప్పుడే పనుల ఒత్తిడి మనపై పూర్తిగా పడకుండా ఉంటుంది.  

మెదడుకి మేత

గర్భంతో ఉన్నప్పుడు మనలో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ వంటి హార్మోనుల స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ప్రసవం తర్వాత అవి ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శారీరక మార్పులే కాదు మెదడులో ప్రతిస్పందనలు, విశ్లేషణా సామర్థ్యాలను నియంత్రించే ‘గ్రే మ్యాటర్‌’ కొంతమేర కృశించిపోతుంది. దానివల్ల కూడా మతిమరుపు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి.. పజిల్స్‌ పరిష్కరించడం, బోర్డు గేమ్స్‌ ఆడటం వంటివి చేయండి. దీనివల్ల మెదడులోని నరాలు స్టిమ్యులేట్‌ అయ్యి, కాగ్నిటివ్‌ ఎబిలిటీ పెరుగుతుంది.

కంటి నిండా నిద్ర

బిడ్డ సంరక్షణ, పాలు పట్టడం, రాత్రుళ్లూ మేల్కోవటం వంటివి మనకు నిద్రను తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఈ ప్రభావం మనలో ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తిపై పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే బిడ్డ నిద్రపోయే సమయంలోనే మనమూ నిద్ర పోవాలి. అలాచేస్తేనే నిద్రలేమి ఉండదు. జీవక్రియలు సరిగా ఉంటాయి. మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్