ఈ గింజలు తింటున్నారా?

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే, సమతులాహారం తినాలి. వీటిల్లో నట్స్‌, సీడ్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని నేరుగా తిన్నా, సలాడ్లలో, కూరల్లో పొడిలా చల్లుకున్నా బోలెడు ప్రయోజనాలు? అవేంటో తెలుసుకుందామా!

Published : 21 Feb 2024 01:42 IST

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే, సమతులాహారం తినాలి. వీటిల్లో నట్స్‌, సీడ్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని నేరుగా తిన్నా, సలాడ్లలో, కూరల్లో పొడిలా చల్లుకున్నా బోలెడు ప్రయోజనాలు? అవేంటో తెలుసుకుందామా!

గుమ్మడి గింజలు: వీటిల్లో ఎ, బి, సి, ఇ విటమిన్‌లతో పాటు ఫైబర్‌, ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌, అమైనో ఆమ్లాలు, ఫినోలిక్‌ సమ్మేళనాలూ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే, వీటిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఈ గుమ్మడి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధినిరోధక శక్తినీ; కాలేయం, మూత్రాశయం, పేగు, కీళ్ల పనితీరునూ మెరుగుపరుస్తాయి. ఒత్తిడినీ అదుపులో ఉంచుతాయి. కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీరాన్ని కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పుని ఇవి తగ్గించగలుగుతున్నాయని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అయితే, ఇందులో కెలొరీల మోతాదూ ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవడం మేలు.

జనపనార విత్తనాలు: ఈ గింజల్లో ఫైటోకెమికల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ మెండుగా ఉంటాయి. వీటిని పొడిగా, నానబెట్టుకుని తినొచ్చు. ఇవి తినడంవల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌ని అడ్డుకునే సుగుణాలూ ఇందులో ఉన్నాయట. అంతేకాదు, జనపనార విత్తనాల్లో ఉండే ఒలిటోరిసిడ్‌ హృదయస్పందన రేటుని సమన్వయ పరుస్తుంది.  వీటిలోని అధిక ప్రొటీన్‌ ఆకలిని అదుపు చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

చియా సీడ్స్‌: మహిళల్లో అనారోగ్యానికి అధికబరువు ఓ కారణం. చియాగింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకుంటే కడుపు నిండిన భావన కలిగి అతి ఆకలి అదుపులో ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా క్యాన్సర్‌తో పోరాడే శక్తినిచ్చే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపునీ, క్యాన్సర్‌ కణాల వృద్ధినీ అడ్డుకుంటాయి.

అవిసె గింజలు: ఈ గింజల్లోని పోషకాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అండాశయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇందులోని ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్లూ...గుండె ఆరోగ్యాన్నీ, సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ విత్తనాల్లో ఉండే ఫోలేట్‌, మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ ఉత్పత్తిని సమతుల్యం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం నెలసరి సమయంలో వచ్చే మూడ్‌ స్వింగ్స్‌ను, ఈఎమ్‌ఎస్‌ లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది. ఇందులోని ఫైటో కెమికల్స్‌ రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్