వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!

మీరెప్పుడైనా వేరుశనక్కాయలు తిన్నారా? ఉడికించినవో, ముందే ఒలిచి ఉంచినవో కాదు... అప్పటికప్పుడు పెంకు పగలగొట్టుకుని...  అదేం భాగ్యం ఎన్నోసార్లు తిన్నాం అంటారా!

Published : 28 Mar 2024 01:59 IST

మీరెప్పుడైనా వేరుశనక్కాయలు తిన్నారా? ఉడికించినవో, ముందే ఒలిచి ఉంచినవో కాదు... అప్పటికప్పుడు పెంకు పగలగొట్టుకుని...  అదేం భాగ్యం ఎన్నోసార్లు తిన్నాం అంటారా! అయితే అదే కొనసాగించండి. ఎందుకంటారా!

స్నేహితులతో కలిసి అలా పార్కుకి వెళ్లినప్పుడో లేదా ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడో కాలక్షేపంగా వేరు శనక్కాయలు తినడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఆ సరదా మన పొట్ట నింపడమే కాదు, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. వేయించిన శనక్కాయల్ని పగలగొట్టుకొని ఒక్కొక్కటిగా తింటుంటే... ఆ రుచే వేరు. కాయని పగలగొట్టి, లోపల ఓ గూట్లో గుట్టుగా దాచిపెట్టినట్లుండే పప్పుని బయటకు తీస్తే, ఏదో రహస్య సంపదను తవ్వి తీసిన ఆనందం, సంతృప్తి మనందరిలోనూ కలుగుతాయి. అంతేకాదు ఆ శబ్దం మన చెవులకి ఓ మధుర సంగీతంలా వినిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కాయ ఒలవడానికి ఏకాగ్రతతో ఒకే రీతిలో పదేపదే చేసే ఆ పని, ధ్యానం ఇచ్చే ప్రయోజనాలనూ కలిగిస్తుందట. నిజానికి ఈ పని అనేక భావనల సమ్మేళనమట. ఓవైపు వేయించిన పల్లీల సువాసన ముక్కుపుటాలను స్పృశించి నోరు ఊరించేస్తుంటే, మరోవైపు గట్టిగా ఉండే దాని పెంకు తేలిగ్గా పగలకుండా అంత తొందరెందుకంటూ మనల్ని ఆపుతుంటుంది. చివరికి నీ కష్టానికి ప్రతిఫలం దక్కిందిపో...  అన్నట్టు ఆ పల్లీ రుచి అమోఘమనిపిస్తుంది. అంతేనా... వీటిని మన ఆత్మీయులతో పంచుకుని ముచ్చట్లాడుకుంటూ తింటుంటే సమయమే తెలీదు. దీనివల్ల వాళ్లతో ఒకింత సాంగత్యం పెరగడంతోపాటు నవ్వులూ పూస్తాయి. మనం తినేకొద్దీ పెరిగే ఆ ఒలిచిన పొట్టును కుప్పగా చూస్తే చాలా సాధించేశాం, పోగు చేసేశాం అన్న సంతోషం భలే ఉంటుంది కదూ! ఇంకేం ఆ ఆనందాన్ని ఎందుకు వదులుకోవడం. ఆ అలవాటు మర్చిపోతే మళ్లీ మొదలెట్టేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్