నడకతో ఆల్జీమర్స్‌ పసిగట్టొచ్చు...!

ఆల్జీమర్స్‌... మలి వయసులో వేధించే సమస్య. అయితే దీని బారిన పడే మహిళల సంఖ్యా ఎక్కువే. దీన్ని ముందుగా కనిపెట్టలేక అనేక ఇబ్బందులనెదుర్కొంటూ ఉంటారు. సరైన సమయంలో చికిత్సా అందడం లేదు.

Published : 29 Mar 2024 02:16 IST

ఆల్జీమర్స్‌... మలి వయసులో వేధించే సమస్య. అయితే దీని బారిన పడే మహిళల సంఖ్యా ఎక్కువే. దీన్ని ముందుగా కనిపెట్టలేక అనేక ఇబ్బందులనెదుర్కొంటూ ఉంటారు. సరైన సమయంలో చికిత్సా అందడం లేదు. అయితే ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనం ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం చూపుతోంది. నడకనుబట్టి, మెదడు పనితీరులోని మార్పులను తొలిదశలోనే కనిపెట్టొచ్చని చెబుతోంది. అందుకోసం వయసు పైబడిన వారిని ఎంచుకున్నారు. ఆరోగ్యవంతులూ, మైల్డ్‌ కాగ్నిటివ్‌ ఇంపైర్‌మెంట్‌ (ఎమ్‌సీఐ) ఉన్నవారినీ రెండు గ్రూపులుగా తీసుకున్నారు. వాళ్లను సూటి, వంకర టింకర దారుల్లో నడవమని చెప్పారు. అలా నడిచినప్పుడు డెప్త్‌ కెమెరా సాయంతో శరీర కదలికలనూ, మెదడు అందించే సిగ్నల్స్‌నూ పరిశీలించారు. ఆ సమయంలో వంకర దారిలో నడిచినప్పుడు అసమానతలు ఉండడాన్ని గుర్తించారట. క్లినికల్‌ పరీక్షల్లో సాధారణంగా నడక, బ్యాలెన్స్‌ టెస్టులు స్ట్రెయిట్‌ వాకింగ్‌ ఆధారంగా చేస్తారు. అయితే అది తేలిక పని. కాబట్టి వంకర దారిలో నడిపించి పరీక్షించడం మంచి ఫలితాలనిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఎందుకంటే వంకర టింకర మార్గంలో నడవడానికి ఎక్కువ కాగ్నిటివ్‌, మోటార్‌ నైపుణ్యాలు అవసరమవుతాయి. వెంటనే దిశను మార్చుకోవడం, సరిగా బ్యాలెన్స్‌ చేసుకోవడం ఉంటేనే సాధ్యమవుతుంది. కాగ్నిటివ్‌ ఇంపైర్‌మెంట్‌ ఉన్నవారికి ఆల్జీమర్స్‌, డిమెన్షియా లాంటివి వచ్చే అవకాశం అధికంగా ఉంటుందట. సాధారణంగా కాగ్నిటివ్‌, బ్రెయిన్‌ ఇమేజింగ్‌, న్యూరలాజికల్‌ పరీక్షల ద్వారా ఆల్జీమర్స్‌ను నిర్ధరిస్తారు. అయితే దానికి ఎక్కువ సమయం పట్టడంతోపాటు, ఖర్చు కూడా ఎక్కువే.. కాబట్టి డెప్త్‌ కెమెరా సాయంతో, వంకర టింకర దారిలో నడిపించే పద్ధతి వల్ల వ్యాధిని త్వరగా గుర్తించడమే కాక, నిర్ధరణ పరీక్షల ఖర్చూ తగ్గించొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్