చక్కనమ్మకు చల్లదనాన్ని అందించేస్తాయి!

ఎండ అప్పుడే భగభగలాడిపోతుంది. మారిన వాతావరణానికి తగ్గట్లుగా మన జీవనశైలిలోనూ మార్పులు తెచ్చుకోవాలి. లేదంటే ట్యాన్‌, జిడ్డు వంటి చిక్కులతో పాటు డీహైడ్రేషన్‌, అలసట వంటివాటికీ గురి కావాల్సి ఉంటుంది.

Updated : 07 Apr 2024 08:17 IST

ఎండ అప్పుడే భగభగలాడిపోతుంది. మారిన వాతావరణానికి తగ్గట్లుగా మన జీవనశైలిలోనూ మార్పులు తెచ్చుకోవాలి. లేదంటే ట్యాన్‌, జిడ్డు వంటి చిక్కులతో పాటు డీహైడ్రేషన్‌, అలసట వంటివాటికీ గురి కావాల్సి ఉంటుంది.

ఆహారం

వాతావరణం వేడెక్కేకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. అది డీహైడ్రేషన్‌కు దారి తీయొచ్చు. పీచు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. బార్లీ, సబ్జా, కొబ్బరినీళ్లూ, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఏసీల చల్లదనంలో గడిపేసినా, దాహంగా ఉన్నా లేకపోయినా ఈ కాలంలో నీళ్లను తీసుకోవాలి. అలానే అధిక మసాలా పదార్థాలూ, బయటి ఆహారానికీ వీలైనంత దూరంగా ఉండాలి.

వ్యాయామం

శరీరం సౌకర్యవంతంగా ఉండాలన్నా, ఇతరత్రా అనారోగ్యాలకు దూరంగా ఉండాలన్నా... దైనందిన జీవితంలో వ్యాయామానికి స్థానం తప్పక ఇవ్వాలి. ఇందుకోసం రోజూ ఉదయమో, సాయంత్రమో కచ్చితంగా ఓ అరగంట పాటు నడవాలి. కనీసం ఓ రెండు మూడు నెలలైనా యోగా తరగతులకు హాజరుకండి. ఆపై ఇంట్లోనే సాధన చేసినా ఇబ్బంది ఉండదు. కసరత్తులు చేయడం వల్ల ఒంట్లోని మలినాలు చెమట రూపంలో బయటికి వెళ్తాయి. ఫలితంగా శ్వాసక్రియ సక్రమంగా జరుగుతుంది.

ఆహార్యం

ఈ కాలంలో ఎండ ప్రభావానికి మొదట గురయ్యేది చర్మమే. అందుకే, వేడిగాలులూ, అతినీలలోహిత కిరణాలు వంటి వాటిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా ఎస్‌పీఎఫ్‌ 30 కంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ని రాసుకోవాలి. జిడ్డుగా అనిపించకుండా ఆయిల్‌ఫ్రీ రకాల్ని వాడితే సరి. అయితే దీన్ని రోజుకోసారి రాసుకుని వదిలేయకుండా పగలు లైట్ల మధ్య పని చేసేవారూ రాసుకోవాలి. అప్పుడే దీని ప్రభావం కనిపిస్తుంది.

ఫ్యాబ్రిక్‌- రంగులు

శరీరం వేడిని తట్టుకోవాలంటే వేసుకునే దుస్తులూ, వాటి రంగుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో పాలిస్టర్‌, సిల్క్‌... వంటివాటి జోలికి పోవద్దు. చేనేత రకాలైన కాటన్‌, ఖాదీ, లినెన్‌ వంటివి గాలి తగిలేలా చేయడమే కాదు... చల్లదనాన్నీ అందిస్తాయి. ముదురు వర్ణాలు వేడిని ఇట్టే గ్రహిస్తాయి. బదులుగా లైట్‌, పేస్టల్‌ కలర్స్‌ మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్