ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!

శ్రీరామనవమి... రాముడు పుట్టిన రోజుతోపాటు సీతమ్మను చేపట్టిన రోజు కూడా.  రామనవమి అనగానే కల్యాణం తర్వాత గుర్తొచ్చేది పానకమే! ఎందుకంటే రాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు తీయతీయని పానకాన్ని ఇచ్చారట.

Updated : 17 Apr 2024 00:11 IST

శ్రీరామనవమి... రాముడు పుట్టిన రోజుతోపాటు సీతమ్మను చేపట్టిన రోజు కూడా.  రామనవమి అనగానే కల్యాణం తర్వాత గుర్తొచ్చేది పానకమే! ఎందుకంటే రాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు తీయతీయని పానకాన్ని ఇచ్చారట. అది ఆయనకు చాలా నచ్చిందని... ప్రతి శ్రీరామనవమికి దాన్ని ప్రసాదంగా సమర్పించడం ఆనవాయితీగా వచ్చిందంటారు.

క మరో కారణం... రాములోరి పండగొచ్చేది చైత్రమాసంలో. ఈ మాసం నుంచే వసంత రుతువు వస్తుంది. అంటే అప్పటిదాకా వాతావరణంలో ఉన్న చల్లదనం పోయి, వేడిగాలులు మొదలవుతాయి.  మారిన వాతావరణానికి శరీరం తట్టుకోవడం కష్టమే. దీంతో అనారోగ్య సమస్యలూ మొదలవుతాయి. వాటి బారిన పడకుండా చేసే ఔషధమే పానకం. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు పూర్వికులు ఇలా ప్రసాదాల్లో వీటికి చోటిచ్చారనీ చెబుతారు. తెలుగునాటే కాదు, కన్నడ, తమిళ ప్రజలకూ ‘పానక’, ‘పానగం’ పేర్లతో ఇది ప్రసిద్ధే!

  • ఆయుర్వేదం ప్రకారం వేసవి... వాత, పిత్త సమస్యలకు కారణమవుతుంది. ఫలితమే ఆకలి లేకపోవడం, అజీర్తి వగైరా! పానకంలోని పదార్థాలు శరీరాన్ని చల్లబరిచి, జీర్ణసంబంధ సమస్యలకు చెక్‌ పెట్టడంతోపాటు ఉత్తేజాన్నీ నింపుతాయి. ఈ కాలం ఎక్కువగా కనిపించే ‘అమ్మవారు పోయడం’ అనే సమస్యకూ ఇది నివారిణి.
  • బెల్లంలోని ఖనిజాలు చెమట రూపంలో కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేస్తాయి. ఐరన్‌, మెగ్నీషియం... వంటివి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఎనీమియా బారి నుంచి కాపాడతాయి.
  • యాలకుల పొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గిస్తే... యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ కాలంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మిరియాల్లో సి, ఎ విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, కెరటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే మలినాలను బయటకు పంపిస్తాయి. వేడి కారణంగా వచ్చే జలుబు, దగ్గులను దూరం చేస్తాయి.
  • తులసి నుంచి ఎ, సి విటమిన్లు, కాల్షియం, జింక్‌, ఐరన్‌ అందుతాయి. దీని సువాసనలు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తే... యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధకతను పెంచుతాయి. వ్యాధులనూ దరిచేరనీయవు.
  • కొన్నిచోట్ల శొంఠిపొడి, నిమ్మరసాన్ని కలుపుతారు. ఇవీ రోగనిరోధకతను పెంచేవే. ఇన్ని ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి కాబట్టే... శ్రీరామరక్ష అంటూ ఇంటిల్లిపాదికీ అందజేస్తాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్