చిన్నారులకు పోషకాల జావ..

పుట్టిన పాపాయికి ఆరు నెలల వరకూ తల్లిపాలే అన్నీ. ఇక ఆ తర్వాత నుంచీ వాళ్లకు పోషకాహారం ఏం ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎన్నో ప్రశ్నలు... రకరకాల రెడీమేడ్‌ ఉత్పత్తులూ పెట్టేస్తుంటారు కొందరు తల్లులు. కానీ అవి బుజ్జాయిల ఆరోగ్యానికి మేలు చేయవు.

Published : 28 May 2024 01:52 IST

ప్రపంచ పోషకాహార దినోత్సవం సందర్భంగా...

పుట్టిన పాపాయికి ఆరు నెలల వరకూ తల్లిపాలే అన్నీ. ఇక ఆ తర్వాత నుంచీ వాళ్లకు పోషకాహారం ఏం ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎన్నో ప్రశ్నలు... రకరకాల రెడీమేడ్‌ ఉత్పత్తులూ పెట్టేస్తుంటారు కొందరు తల్లులు. కానీ అవి బుజ్జాయిల ఆరోగ్యానికి మేలు చేయవు. బదులుగా  పోషకాల సమ్మేళనం...సూపర్‌ఫుడ్‌ అయిన రాగిజావను చంటి పిల్లలకు ఇవ్వమంటున్నారు నిపుణులు. పురాతన కాలంలో విరివిగా వాడే ఈ జావ మళ్లీ ఇప్పుడు పిల్లలకు సూపర్‌ఫుడ్‌గా ఎందుకు మారిందో తెలుసుకుందాం పదండి!

  • పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే ఈ రాగిజావను పిల్లలకు తాగించడం వల్ల పొట్టకు ఏ ఇబ్బందీ కలగదు. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం రాకుండా నిరోధిస్తుంది. పైగా ఆకలీ పెరుగుతుంది. దాంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతారు.
  • ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కాల్షియం అవసరం. ఇందులో మిగతా తృణధాన్యాల కంటే 5-30రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి రాగిజావ వారికి మంచి ఎంపిక.
  • కణాల అభివృద్ధికి ప్రొటీన్‌ చాలా అవసరం. రాగిలో అధికంగా ఉండే ప్రొటీన్‌ కండపుష్టిని పెంచుతుంది. పైగా మొలకెత్తించి చేసిన రాగిపిండిలో ప్రొటీన్‌ రెండు రెట్లు అధికంగా ఉంటుంది. ఇది పిల్లల్లో పోషకాహారలేమి రాకుండా అడ్డుకుంటుంది.   
  • ఇందులోని ఐరన్‌ రక్తహీనత రాకుండా నిరోధిస్తుంది. అందుకే రోజూ తగిన మోతాదులో పిల్లలకు దీన్ని ఇవ్వమని సూచిస్తున్నారు.
  • రాగిజావలో ఉండే పోషకాలు, మంచి కొవ్వులు పిల్లలు ఆరోగ్యకరమైన బరువుతో ఎదగడానికి  సహకరిస్తాయి.
  • రాగుల్లోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ఇస్తే పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం లాంటివి రాకుండా ఉంటాయి.  
  • రాగిలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం నరాలను ప్రభావితం చేసి, మంచినిద్రను అందిస్తుంది. కాబట్టి వాళ్లు రాత్రుళ్లు బాగా నిద్రపోతారు.

ఎప్పుడు ఇవ్వొచ్చంటే...

ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో పిల్లలకు రాగిజావ అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు. చంటిపిల్లల నుంచి ఎదిగే వయసు పిల్లలందరికీ రాగిజావను ఇవ్వొచ్చు.

ఇలా చేసుకోవచ్చు...

మొదట ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని కాగనివ్వాలి. మరో చిన్న గిన్నెలో స్పూన్‌ రాగిపిండి తీసుకుని కొద్దిగా నీళ్లుపోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత కాగుతున్న నీటిలో కలిపిన పిండిని వేసుకుని, తక్కువ మంటలో ఉంచి ఉడికించుకోవాలి. జావ దగ్గరపడే వరకూ కలిపేసి దించేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్‌ వేసి కలియబెట్టాలి. చల్లారాక దాన్లో రుచి కోసం కొంచెం నెయ్యి కలిపి తినిపిస్తే సరి. అందులోనూ మొలకెత్తించి తయారుచేసిన రాగిపిండి అయితే ఇంకా మంచిది. మొలకెత్తించడం వల్ల అందులో ఉండే ప్రొటీను,్ల అమైనో ఆమ్లాల రూపంలోకి మారి తేలిగ్గా జీర్ణం అవుతుంది. మరి ఇంకేం ఎండల్లోనే కాదు, అన్ని కాలాల్లోనూ పోషకాల రారాజైన రాగిజావను పిల్లలకు అందిద్దామా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్