వేలమంది ఆకలి తీరుస్తోందీ బామ్మ...

ఉషాగుప్తా వయసు 88. పేదల ఆకలి తీర్చడంలో ఈమెకు వయసు అడ్డు కాలేదు. కరోనా కోరలకు చిక్కి భర్త చనిపోతే, అంత వేదనలోనూ నిరుపేదల గురించి ఆలోచించారీమె. తనకు తెలిసిన పచ్చళ్ల తయారీతోనే చిరు వ్యాపారాన్ని ప్రారంభించి,

Updated : 25 Mar 2022 05:49 IST

ఉషాగుప్తా వయసు 88. పేదల ఆకలి తీర్చడంలో ఈమెకు వయసు అడ్డు కాలేదు. కరోనా కోరలకు చిక్కి భర్త చనిపోతే, అంత వేదనలోనూ నిరుపేదల గురించి ఆలోచించారీమె. తనకు తెలిసిన పచ్చళ్ల తయారీతోనే చిరు వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ ఆదాయంతో పేదలకు సాయం చేస్తున్నారు. ఇంత పెద్ద వయసులోనూ.. సేవలందిస్తున్న బామ్మ స్ఫూర్తి కథనం తెలుసుకుందాం.

తేడాది కరోనా రావడంతో ఉషాగుప్తా, ఆమె భర్త రాజ్‌ కుమార్‌ ఆసుపత్రిలో చేరారు. రెండువారాలున్నా చికిత్స ఫలించక భర్త కన్ను మూస్తే, కొవిడ్‌ను గెలిచి ఉష ఇంటికి చేరుకున్నారు. భర్తను కోల్పోయిన వేదన ఆమెను చాలా కుంగదీసింది. అదే సమయంలో ఎందరో పేదలు ఈ వైరస్‌కు గురవడంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులెదుర్కోవడం చూశారీమె. ఆ విపత్కర సమయంలో అందరూ తమకు చేతనైన సాయం చేయడాన్ని గమనించారు. తనూ ఏదైనా చేయాలనుకున్నారు. వీళ్లది దిల్లీ. పచ్చళ్లు పెట్టడంలో చుట్టపక్కాల్లో ఈమెకు మంచి పేరుంది. రుచికరమైన పచ్చళ్ల తయారీనే వ్యాపారంగా ఎందుకు మలచకూడదని ఆలోచించారీమె. మనవరాలు డాక్టర్‌ రాధికతో చర్చించారు. ఉష ఆలోచన ఇంట్లో అందరికీ నచ్చింది. అలా వారి ప్రోత్సాహంతో ‘పికిల్డ్‌ విత్‌ లవ్‌’ ప్రారంభించారీ బామ్మ. రకరకాల ఊరగాయలు, రోటి పచ్చళ్లు చేయడం మొదలుపెట్టి, వాటిని ముందుగా తెలిసినవాళ్లకు అందజేశారు. అలా విక్రయించగా వచ్చే నిధులను పేదల సంక్షేమానికి వినియోగించడానికి అని వాళ్లందరితో చెప్పే వారు. దాంతో అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తూ ఉష ఆలోచనకు తమ వంతు సహకారాన్నివ్వడం మొదలు పెట్టారు. క్రమేపీ సోషల్‌మీడియాలో ఉష పచ్చళ్ల రుచి అందరికీ తెలిసింది. దాంతో విక్రయాలు పెరిగాయి. అలా వచ్చే ఆదాయాన్ని కొవిడ్‌ బాధిత పేద కుటుంబాలకు విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారీమె.

మొదటి నెలలోనే..

ప్రారంభించిన నెలలోపే తాను తయారుచేసిన పచ్చళ్లకు ఆర్డర్లు రావడం మొదలయ్యాయి అంటారు ఉష. ‘ఓ వైపు మావారు దూరమయ్యారు. మరోవైపు చాలామంది ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. కొందరికైనా నా వంతు సాయం అందించాలనిపించింది. అలా మొదలుపెట్టిందే ‘పికిల్డ్‌ విత్‌ లవ్‌’. అంతకు ముందే నాకూ కరోనా వచ్చి తగ్గింది. శరీరం అంతగా సహకరించేది కాదు. శక్తి తక్కువగా ఉండేది. అయినా ఏదో ఒకటి చేయాలనే తపన ముందు నా వయసు, శక్తి వంటివేమీ గుర్తు రాలేదు. అలా ప్రారంభించిన ఈ చిరు వ్యాపారం అతి తక్కువ రోజుల్లోనే విజయవంతమైంది. మొదటి నెలలో 200 ఆర్డర్లు వచ్చాయి. పచ్చళ్ల తయారీతోపాటు పలురకాల మసాలాలను కూడా చేర్చా. తాజా కూర గాయలు, పచ్చళ్ల దినుసుల ఎంపికలో నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం... ఇలా ప్రతి అంశంపైనా శ్రద్ధ పెడతా. అందుకే వీటిని రుచి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ కొంటున్నారు. పచ్చళ్లను నింపే సీసాలు, లేబుల్స్‌ అన్నీ మా మనవరాలు చూసుకుంటుంది. అలాగే వచ్చే ఆర్డర్లను నాకు చేరవేస్తుంది. ‘మనసుకు నచ్చింది వెంటనే చేయాలి, అయితే అది పక్కాగా పూర్తిచేయాలి’ అని మావారు తరచూ అనేవారు. ఇప్పుడు తను నాతో లేకపోయినా ఆయన చెప్పిన ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలున్నాయి. ఈ సాయంలో ఆయన కూడా నా వెంటే ఉన్నారని మనసుకు అనిపిస్తుంది. గతేడాది నుంచి చూస్తే ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. వీటిద్వారా వచ్చే లాభాల్ని పేదల కోసం పనిచేసే ఎన్జీవోలకు విరాళంగా అందిస్తున్నా. అలాగే రోడ్ల మీద ఉండే నిర్వాసితులకూ ఆహారాన్ని అందేలా ఏర్పాటు చేస్తున్నా. ఏడాదిన్నరలో దాదాపు 65 వేలమంది ఆకలి తీర్చగలిగా. రూ.2 లక్షలకు పైగా నగదును విరాళంగా అందించా’ అంటోన్న ఈ బామ్మ కృషి స్ఫూర్తిదాయకంగా ఉంది కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్