ఆమె తోటలో 600 రకాల విరులు..

అక్కడ అడుగుపెడితే చాలు.. వందలరకాల వర్ణభరిత గడ్డి గులాబీలు పలకరిస్తాయి. రంగురంగుల అడీ…నియం పూలు సహా మొత్తం 600 రకాల పూల మొక్కలని పెంచుతోంది. అభిరుచిగా ప్రారంభించిన తోట పెంపకం ఆమెను చిరువ్యాపారిగా మార్చింది.

Published : 24 Apr 2022 00:13 IST

అక్కడ అడుగుపెడితే చాలు.. వందలరకాల వర్ణభరిత గడ్డి గులాబీలు పలకరిస్తాయి. రంగురంగుల అడీ…నియం పూలు సహా మొత్తం 600 రకాల పూల మొక్కలని పెంచుతోంది. అభిరుచిగా ప్రారంభించిన తోట పెంపకం ఆమెను చిరువ్యాపారిగా మార్చింది. కేవలం వీటి ద్వారానే నెలకు రూ.లక్ష దాకా ఆదాయాన్ని అందుకుంటోన్న 49 ఏళ్ల అంజూకార్తిక ఇప్పుడు మరికొందరు మహిళలకు మార్గదర్శకురాలిగానూ మారింది..

అంజూ పెంచుతున్న తోట గురించి తెలిసినవారందరూ ఆశ్చర్యపోతుంటారు. కేరళకు చెందిన ఈమె ఇంటి ముందు, వెనుక, మిద్దెపై ఎక్కడ చూసినా పూల మొక్కలే ఉంటాయి. చిన్నప్పటి నుంచి తనకు మొక్కలంటే ప్రాణం. టేబుల్‌ రోజ్‌ (నాచుమొక్కలు) పెంచి, అవి పూలు పూస్తే మురిసిపోయేది. పదో తరగతిలోకి వచ్చేసరికి ఆ ఆసక్తి మరింత పెరిగి మరిన్ని రకాలను పెంచడం మొదలుపెట్టింది. రకరకాల రంగుల టేబుల్‌రోజ్‌లను సేకరించి నాటేది. అలా తన 15 ఏళ్లప్పుడు ప్రారంభమైందీ తోట పెంపకం.

అడీనియం పూలను...

టేబుల్‌రోజ్‌ తర్వాత తన మనసును దోచుకున్నవి అడీనియం పూలే అంటుంది కార్తిక. ‘ఈ పూల వర్ణాలు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. అలా ఈ జాతి మొక్కలనూ సేకరించడం మొదలుపెట్టా. చిన్నప్పుడు అభిరుచిగా ఉండే ఈ తోట పెంపకం ఇప్పుడు అందరూ నా గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లింది. మొదట మిద్దె తోటలో మొదలుపెట్టి, స్థలాభావంతో ఇంటి వెనుక, ముందు 10 సెంట్ల స్థలంలోనూ పెంచడం ప్రారంభించా. ఇప్పుడీ రెండు జాతుల్లో మొత్తం 600 రకాలను పండిస్తున్నా. వీటిని ‘గ్రీన్‌ ఫ్లోరా’ పేరుతో విక్రయించే స్థాయికీ ఎదిగా. గార్డెనింగ్‌ గ్రూపులో నాలాంటివారి పరిచయం దొరికింది. మనదేశంలోనే కాకుండా థాయ్‌లాండ్‌, బ్రెజిల్‌ వంటి దేశాల్లో లభ్యమయ్యే మరిన్ని రకాల టేబుల్‌ రోజెస్‌ గురించే తెలుసుకోగలిగా. ఫేస్‌బుక్‌ ద్వారా చెన్నై, పుణెలోని వ్యాపారులను కలిసి ఆయా దేశాల రకాలనూ సేకరించా. వీటి కొమ్మలను కలిపి నాటడంతో మరిన్ని రకాల వర్ణాలు, డిజైన్లు రూపొందించగలిగా. ఉదయం పది గంటలకు విరిసే ఈ పూలు సాయంత్రానికి వడలిపోతాయి. ఆర్డరు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాకింగ్‌ చేస్తుంటా. మొత్తం ఇవి 200 రకాలున్నాయి. వీటిలో ఒక పువ్వు ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. అయితే అడీనియం (ఎడారి జాతి) పూల గురించి తెలుసుకున్న తర్వాత వీటి విత్తనాలను సేకరించి నాటా. అలా ఇప్పటివరకు ఇవి 400 రకాల్లో 2000 మొక్కలున్నాయి. ఈ పూలు అందంతోపాటు మూడు వారాల పాటు వడలకుండా ఉంటాయి. ఇవి వామన వృక్షాలుగా ఎదుగుతాయి. ఈ పూల ధర రూ.250 నుంచి రూ.3,000 వరకు పలుకుతుంది. ఫేస్‌బుక్‌ లేదా ఫోన్‌ ద్వారా వినియోగదారుల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. కొందరు కొరియర్‌ ద్వారా పూలతోపాటు ఈ మొక్కల కొమ్మలు, విత్తనాలు, నారుకూ ఆర్డర్లు ఇస్తుంటారు. నెలకు రూ.లక్ష వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నా. వీటితోపాటు అలోకాసియా, ఫిలోడెండ్రాన్‌, సింగోనియం, బెగోనియా, ఆగ్లోనెమా వంటి ఇండోర్‌ప్లాంట్స్‌నూ పెంచుతున్నా. దాదాపు సేంద్రియ ఎరువులనే వినియోగిస్తా. తోట పెంపకంపై ఆసక్తి ఉన్న వారు నావద్దకు వచ్చి సలహాలు, సూచనలు తీసుకుంటారు’ అని చెబుతోంది అంజూకార్తిక. ఆసక్తిని స్వయంకృషితో, శ్రమతో విజయవంతమైన వ్యాపారంగా మలచుకున్న అంజూ అభినందనీయురాలు కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్