రైతుల కోసం.. యాప్‌!

డాక్టరై సేవ చేయాలనుకుంది. కుదర్లేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో రైతులకైనా సాయం చేద్దామనుకొని ఆ విద్యనభ్యసించింది. పరిశోధనలతోపాటు వారి సౌలభ్యానికి యాప్‌నీ రూపొందించింది వావిలపల్లి

Updated : 27 Apr 2022 04:20 IST

డాక్టరై సేవ చేయాలనుకుంది. కుదర్లేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో రైతులకైనా సాయం చేద్దామనుకొని ఆ విద్యనభ్యసించింది. పరిశోధనలతోపాటు వారి సౌలభ్యానికి యాప్‌నీ రూపొందించింది వావిలపల్లి దీప్తి. ఇంకా ఎన్నో వినూత్న ఆవిష్కరణలూ తీసుకొస్తోంది.

దీప్తిది శ్రీకాకుళం జిల్లా తమ్మినాయుడు పేట. నాన్న గణపతిరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ సరోజినమ్మ. ముగ్గురు అమ్మాయిల్లో తనే చిన్న. చదువంతా శ్రీకాకుళంలోనే. తన ఊరి నుంచి అక్కడికి ఒక్కటే బస్‌ ఉండేది. అదెళ్లిపోతే ఇక కాలినడకే. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంది. డాక్టరై నలుగురికీ సేవ చేయడమామె కల. కానీ సీటు రాలేదు. వ్యవసాయాధారిత కుటుంబం. రైతులకు సాయం చేయడమూ సేవే కదా అనుకుంది. అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేసింది. తర్వాత తాడేపల్లిగూడెంలోని ఉద్యానవర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరింది. దీన్నో ఉద్యోగంగానే చూడాలనుకోలేదామె. అందుకే నిరంతరం పరిశోధనలు చేస్తోంది. ఫలితమే 37 పరిశోధన పత్రాలు, 34 ప్రత్యేక వ్యాసాలూ, 21 సాంకేతిక నివేదికలూ. వర్సిటీ కమ్యూనిటీ రేడియో, ఉద్యాన వర్సిటీ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహణ బాధ్యతా తీసుకుంది. ఇవన్నీ ఒకెత్తు.. వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రోద్బలంతో రూపొందించిన ‘ఉద్యాన పంటల ఇ-సమాచారం’ యాప్‌ మరొకెత్తు. కూరగాయలు, పండ్ల రైతుల కోసం 32 రకాల పంటల వివరాలు, చీడపీడల నివారణ తదితర సమాచారాన్ని దీనిలో పొందుపరిచింది. రైతులు తమ సందేహాలను ఎక్కడి నుంచైనా తీర్చుకునే అవకాశముండాలన్నది ఆమె ఉద్దేశం. వారికోసం వర్చువల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఉద్యాన వర్సిటీ మ్యూజియంలో పంటలకు సంబంధించిన ‘దర్పణి’లో సమాచారాన్ని జోడించడం వంటివెన్నో చేసింది. ఆమె సేవల్ని గుర్తించి.. ఘజియాబాద్‌కు చెందిన సొసైటీ ఫర్‌ హార్టీకల్చర్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ సంస్థ ‘ఔట్స్టాండింగ్‌ విమెన్‌ హార్టీకల్చర్‌ సైంటిస్ట్‌’ పురస్కారానికి ఎంపిక చేసింది. దీప్తి భర్త పశువైద్యుడు. వీరికో బాబు. రైతులకు వీలైనంత సాయం అందించడమే లక్ష్యమనే దీప్తి.. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహంతోనే వృత్తిపరంగా రాణించగలుగుతున్నానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్