చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతోంది!

బాల్యం అంటే ఆటపాటలూ, చదువులూ సరదాలూ... ఇలాంటివెన్నో. కానీ తెలిసీ తెలియక చేసిన పొరపాట్లు.. ఆ బాలల జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ‘పసితనంలోనే చీకట్లు కమ్ముకుంటే వారి భవిష్యత్తు ఏంకాను...’ అని ఆలోచించారు చేకూరి సునీత.

Updated : 29 Apr 2022 05:10 IST

బాల్యం అంటే ఆటపాటలూ, చదువులూ సరదాలూ... ఇలాంటివెన్నో. కానీ తెలిసీ తెలియక చేసిన పొరపాట్లు.. ఆ బాలల జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ‘పసితనంలోనే చీకట్లు కమ్ముకుంటే వారి భవిష్యత్తు ఏంకాను...’ అని ఆలోచించారు చేకూరి సునీత. అలాంటి పిల్లలకు దిశానిర్దేశం చేసి తిరిగి సాధారణ జీవితంలో అడుగుపెట్టేలా చేస్తున్నారు. ‘జువనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌’ సభ్యురాలిగా కృషి చేస్తున్న ఆవిడ స్ఫూర్తి ప్రయాణం ఇదీ...

విశాఖ సెంట్రల్‌ జైల్‌కు దగ్గర్లోనే ఉంటుంది జిల్లా బాలుర జువనైల్‌ హోమ్‌. వివిధ కేసుల్లో దొరికిన పిల్లల్ని విచారణ నిమిత్తం ఉంచుతారక్కడ. తను ప్రారంభించిన ‘ఆసరా ఛారిటబుల్‌ సొసైటీ’ సేవల్లో భాగంగా నాలుగేళ్ల కిందట అక్కడకు వెళ్లారు చేకూరి సునీత. 10-15 ఏళ్ల మధ్య వాళ్లు 50 మంది వరకూ ఉన్నారు. మత్తు పదార్థాలు కలిగి ఉన్నారన్న నేరం మీద వచ్చిన వాళ్లే 90 శాతం. ఎవరో ఆ పొట్లం తెమ్మని చెబితేనో, డబ్బు కోసం ఆశపడో చేశామనేది వాళ్ల సమాధానం. క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల వచ్చినవాళ్లూ ఉన్నారక్కడ. ప్రధాన గేటు విరిగిపోవడంతో పిల్లలెవర్నీ గదుల్లోంచి బయటకు అడుగుపెట్టనీయని పరిస్థితిని చూసిన సునీత.. వెంటనే దాతలతో మాట్లాడి రూ.1.3 లక్షల విరాళంతో గేటు నిర్మించారు. ఆపైన చిన్నారుల చదువులకూ, ఆటలకూ ఏర్పాట్లు చేశారు. డ్రాయింగ్‌ బుక్స్‌, యాక్టివిటీ కిట్స్‌ లాంటివీ తెప్పించారు. పిల్లల్లో అపరాధ భావం పోగొట్టి, మార్పు తేవడానికి ప్రయత్నిస్తారామె. ‘వాళ్ల ఆలోచనల్ని మార్చకపోతే మళ్లీ అదేదారిలో వెళ్తారు. అందుకే మంచి చెడ్డల గురించి చెబుతాం. జీవితం ఇంకా చాలా ఉందంటూ సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తాం’ అని చెప్పే సునీత.. పిల్లలు ఈ రకంగా తయారవడంలో తల్లిదండ్రుల పాత్రా ఉందంటారు. ‘ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో పడి చాలామంది పిల్లలకు సమయం కేటాయించడంలేదు. ఇక్కడ పేద పిల్లలే కాదు, ధనిక కుటుంబాల వాళ్లూ ఉంటున్నారు’ అనేది ఆమె మాట.

జువనైల్‌ హోమ్‌, జైలు నుంచి బయటకు వచ్చిన వారిని సమాజం చిన్న చూపు చూడటం గమనించి అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండేలా తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులతో మాట్లాడతారు. చదువుకి, ఉపాధికి ఆసరా ఇస్తారు. రాజు (పేరు మార్చాం) అనే యువకుడు హత్యాయత్నం కేసులో టీనేజ్‌లోనే జైలుకి వెళ్లాడు. ‘చదువుకుని నా జీవితాన్ని బాగు చేసుకోవాలి..’ అనే మార్పు అతడిలో రావడం చూసి ‘ఆసరా’ తరఫున ఎమ్మే చేయించి ఒక సంస్థలో అకౌంటెంట్‌గా ఉద్యోగమూ ఇప్పించారు.

ఉద్యోగం వదిలి సేవలోకి...

సునీత పుట్టి పెరిగింది విజయవాడలో. తర్వాత విశాఖలో స్థిరపడి ఎస్‌బీఐలో స్పెషల్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. భర్త గోపీకృష్ణ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగంలో అడిషనల్‌ కమిషనర్‌. వీరికో అబ్బాయి.. ఐటీ కంపెనీలో మేనేజర్‌. సునీతకు గ్రంథాలయాల్లో పిల్లలకు నీతి కథలు, వృద్ధాశ్రమాల్లో పురాణాలు చెబుతుండటం మొదటి నుంచీ అలవాటు. క్యాన్సర్‌ కారణంగా ఆవిడ చెల్లి చనిపోయారు. దాంతో ఇక సమాజసేవకే అంకితమివ్వాలని నిర్ణయించున్నారు సునీత. 14 ఏళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగ విరమణ చేసి 2014లో ‘ఆసరా ఛారిటబుల్‌ సొసైటీ’ని ప్రారంభించారు. ‘అవసరం ఎక్కడో ఆసరా అక్కడ’ అంటూ.. పిల్లలూ, మహిళలూ, వృద్ధులూ... ఇలా ఎందరికో సాయపడుతున్నారు. కంచరపాలెంలో రైల్వే బ్రిడ్జి కింద ఆకతాయిలుగా తిరుగుతోన్న 150 మంది పిల్లలకు బడి ఏర్పాటు చేసి వాలంటీర్లతో చదువు చెప్పించి వాళ్లంతా బడిబాట పట్టేలా చేశారామె. ‘విశాఖ చిల్డ్రన్స్‌ క్లబ్‌’తో కలిసి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సైన్స్‌ ఫెయిర్లు, వేసవి శిక్షణ శిబిరాలూ నిర్వహిస్తుంటారు. 350 మంది మహిళలకి టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఏటా చలికాలంలో అరకు ప్రాంతంలో వందలమంది వృద్ధులకు కంబళ్లనీ అందిస్తుంటారు. కొవిడ్‌ సమయంలో వందలమందికి రేషన్‌ సరకులిచ్చారు. ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లనీ అందించారు.

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా విశాఖ బాలుర జువనైల్‌ హోమ్‌లో గతేడాది నుంచి ‘జువనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌’లో సభ్యురాలిగా ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారమూ, దాతల మద్దతు ఉండటంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పే సునీత.. ‘బాలల బాగు అంటే దేశం బాగు. వారికి సేవ చేయడంలోనే నాకెంతో సంతృప్తి’ అంటారు.

- టి.శారద, ఈనాడు జర్నలిజం స్కూలు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్