సాయం చేయమంటూ రోడ్లన్నీ పరిగెత్తా..

సవతి తల్లి తనపై పోసిన యాసిడ్‌ ముఖాన్ని కరిగిస్తుంటే బాధ భరించలేక సాయం కోసం రోడ్లపై పరిగెత్తింది. వేదన అనుభవిస్తూ చికిత్స కోసం ఎదురుచూసింది. ఓ ఎన్జీవో అందించిన చేయూతతో 16 సర్జరీల తర్వాత ఉద్యోగంలో చేరగలిగింది. ఆత్మస్థైర్యంతో తన

Updated : 06 Jun 2022 08:59 IST

సవతి తల్లి తనపై పోసిన యాసిడ్‌ ముఖాన్ని కరిగిస్తుంటే బాధ భరించలేక సాయం కోసం రోడ్లపై పరిగెత్తింది. వేదన అనుభవిస్తూ చికిత్స కోసం ఎదురుచూసింది. ఓ ఎన్జీవో అందించిన చేయూతతో 16 సర్జరీల తర్వాత ఉద్యోగంలో చేరగలిగింది. ఆత్మస్థైర్యంతో తన కాళ్లపై తాను నిలబడి, తోటివారిలో స్ఫూర్తి నింపుతున్న రూప కథ ఇది.

పేద కుటుంబంలో పుట్టిన రూపకు తనకొక తమ్ముడు పుట్టాడనే ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ప్రసవం తర్వాత కన్నుమూసిన అమ్మను చూసి ఏడ్వాలో, తమ్ముడిని గుండెలకు హత్తుకోవాలో తెలియలేదా చిన్నారికి. ఇద్దరు పిల్లలనెలా ఒంటరిగా సాకుతావంటూ తండ్రిపై బంధువుల ఒత్తిడి రూపకు సవతి తల్లిని తెచ్చింది. రెండో వివాహమైన తర్వాతే.. ముందు భార్యకు పిల్లలున్నారని తండ్రి చెప్పడం సవతితల్లి భరించలేక, ఆ కోపాన్ని చిన్నారులిద్దరిపై చూపించేది. దాంతో యూపీ, ముజ్‌ఫర్‌నగర్‌కు చెందిన రూప జీవితం దుర్భరమైంది.

రక్షించమంటూ..

ఇంట్లో పనంతా చేస్తేనే తమ్ముడికి, తనకు గుప్పెడన్నం దొరికేది. చదువుకోవాలనిఉన్నా స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి.ఎంత చాకిరీ చేసినా తల్లిపెట్టే హింస తగ్గలేదు.  తమ్ముడి కోసం బాధనంతా పంటిబిగువున భరించేది. 15 ఏళ్లు కూడా నిండని ఆమెను ఓ రోజు చితకబాదిందా తల్లి. తండ్రి పట్టించుకునేవాడుకాదు. ఒళ్లు తెలియని జ్వరంతో నిద్రపోతున్న రూపపై యాసిడ్‌ పోసింది. ముఖమంతా మండిపోతున్నట్లు అనిపించి కళ్లు తెరిచి చూడటానికి ప్రయత్నించినా, రెప్పలుకూడా తెరవలేనంత బాధ పడింది రూప. తీవ్రమైన బాధ. అక్కడే ఉంటే ఇంకేం చేస్తుందో అని భయపడి, ఇంట్లోంచి ఒక్కసారిగా రోడ్డులోకి పరిగెత్తింది. రక్షించమంటూ ఏడుస్తున్న రూప దగ్గరకి గ్రామస్తులెవ్వరూ రాలేదు.

సర్పంచి చేయూతతో..

ఒక్కరూ తన దగ్గరకు రాలేదు అంటుంది రూప. ‘మా గ్రామ సర్పంచికి విషయం తెలిసి వచ్చి, ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ముఖం, భుజం కాలిపోయి బాధతో ఉన్న నాకు చికిత్స అందడానికి 16 గంటలు పట్టింది. ఆసుపత్రిలోనూ నా సవతితల్లి పండ్లరసంలో విషం కలిపి చంపడానికి చూసింది. అదృష్టంకొద్దీ నేను తాగలేదు. దాంతో తప్పించుకున్నా. పోలీసులు ఆమెను జైల్లో పెట్టించినా నాలుగేళ్లలోపే తిరిగొచ్చి, నన్ను చంపడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఉంటే చంపేస్తుందని ఇల్లొదిలి పారిపోయా’ అంటుంది రూప.


స్ఫూర్తిగా మారి..

బంధువులింట్లో తలదాచుకుంటూ చికిత్స చేయించుకునేది రూప. నాలుగైదేళ్లపాటు ఓ గదికే పరిమితమై ఉండిపోయిందీమె. బయటకొస్తే కాలిన తన ముఖాన్ని చూసి ఎదుటివాళ్లు గేలి చేయడం భరించలేక, బయటకు వెళ్లాలంటే ముఖం కప్పుకొని వెళ్లేది. ఓసారి ఆసుపత్రిలో యాసిడ్‌బాధితులకు చేయూతనందించే ఛాన్వ్‌ ఫౌండేషన్‌ గురించి ఎవరో చెప్పగా తెలుసుకొని వెళ్లి వాళ్లను కలిసింది. తన పరిస్థితి చెప్పి, నీడ కల్పించాలని కోరింది. వారిచ్చిన చేయూతతో అక్కడే ఉంటూ, ‘స్టాప్‌ యాసిడ్‌ అటాక్‌’ ప్రచారంలో పాల్గొనేది. అలా తనలాంటివారందరినీ కలిసింది. ఎన్జీవో సాయంతో సర్జరీలు చేయించుకునే అవకాశాన్ని అందుకుంది. చికిత్సలతోపాటు కౌన్సెలింగ్‌ అందడంతో అప్పటివరకు కుంగుబాటులో ఉండే రూప తిరిగి ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోగలిగింది. ఎన్జీవో  చేయూతతో ఓ కేఫ్‌లో ఉద్యోగాన్నీ.. పొందగలిగింది. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడ్డా అంటుందీమె. ‘ఈ సంఘటన జరిగి 14 ఏళ్లైంది. ఇప్పటివరకు 16 సర్జరీలు కాగా, ఇంకా నాలుగైదు చేయించుకోవాల్సి ఉన్నాయి. ఈ కేఫ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయికెదిగా. ముఖ్యంగా ఇప్పుడు నా ముఖాన్ని దాచుకోవడం లేదు. ధైర్యంగా నలుగురెదుటకూ వెళ్లగలుగుతున్నా. టైలరింగ్‌ నేర్చుకున్నా. దుస్తుల డిజైనింగ్‌పై ఆసక్తి ఉంది. త్వరలో బొటిక్‌ తెరవాలని ఉంది. యాసిడ్‌బాధితుల తరఫున అందరిలో అవగాహన కలిగించే దిశగా చేస్తున్న నా కృషికి అయిదేళ్ల క్రితం ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకొని నాలాంటివారిందరిలో స్ఫూర్తి నింపగలిగా’ అని చెబుతున్న రూప కథ అందరికీ స్ఫూర్తిదాయకమే కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్