చేయి పోయినా.. పట్టు వదల్లేదు!

తనను తాను నిరూపించుకోవాలి. తన కాళ్ల మీద తను నిలబడాలి.. ఇదీ రేణు కోరిక. భర్తకేమో తను ఇంటి పట్టునే ఉండాలి. ఆమేమో ఇంట్లో వాళ్లను ఎదురించి మరీ ఉద్యోగం సాధించింది. చేరొద్దంటే ససేమిరా అంది. తనను కాదందన్న కోపం, తనను మించి పోతుందన్న భయంతో భర్తను ఆమె

Updated : 10 Jun 2022 07:14 IST

తనను తాను నిరూపించుకోవాలి. తన కాళ్ల మీద తను నిలబడాలి.. ఇదీ రేణు కోరిక. భర్తకేమో తను ఇంటి పట్టునే ఉండాలి. ఆమేమో ఇంట్లో వాళ్లను ఎదురించి మరీ ఉద్యోగం సాధించింది. చేరొద్దంటే ససేమిరా అంది. తనను కాదందన్న కోపం, తనను మించి పోతుందన్న భయంతో భర్తను ఆమె కుడి చేయి నరికేశాడు. ‘ఆమె కలలన్నీ కల్లలైపోయాయి’ అన్నారు తెలిసిన వాళ్లంతా! మరి ఆమె?

డుగురు తోబుట్టువుల్లో ఒకరు రేణు ఖాతున్‌. దీనికితోడు పేదరికం. అయినా అన్నలతో పోటీపడి స్కూలుకి వెళ్లింది. నర్సింగ్‌లో డిప్లొమా చేసింది. వీళ్లది పశ్చిమ్‌ బంగాలోని కేతుగ్రామ్‌. చిన్నతనం నుంచీ రేణుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. కానీ ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. భర్త షేర్‌ మహమ్మద్‌ది కిరాణా దుకాణం. భార్య ఇంట్లో ఉండి, పనులు చక్కబెట్టుకోవాలన్నది తన అభిప్రాయం. రేణు తన కలను చెప్పినప్పుడు ఇదే మాట చెప్పాడు. ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోనంది. మూడేళ్ల కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగమొచ్చింది. తనదేమో చిన్న వ్యాపారం. భార్య చదువుకుంది, పైగా ఉద్యోగమంటోంది.. కొద్దిరోజులు పోతే తనను పూర్తిగా వదిలేస్తుందేమో అన్న భయం పట్టుకుంది మహమ్మద్‌కి. దీంతో ఉద్యోగానికి వెళ్లడానికి వీల్లేదన్నాడు. తనేమో వెళతానని పట్టుబట్టింది. కోపంతో దిండు ముఖం మీద అదిమిపట్టి, స్పృహ కోల్పోగానే అరచేతిని నరికేశాడు. తర్వాత దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు.

స్పృహలోకి వచ్చిన ఆమె అన్నలకు ఫోన్‌చేసి విషయం చెబితే వాళ్లు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన కలను నెరవేర్చుకోవడానికి ఇంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు వాళ్లు. కోపం, బాధ చూపించకుండా నిశ్శబ్దంగా ఉన్న ఆమెను చూసి భయపడ్డారు. కానీ రేణు మాత్రం మరుసటి రోజు నర్సుతో పేపర్లు తెప్పించుకొని ఎడమ చేత్తో ఏదో రాస్తోంది. తనేం చేస్తోందో వాళ్లకి అర్థం కాలేదు. అడిగితే ‘ఎడమ చేత్తో సాధన మొదలుపెట్టా’ అంది. అప్పటికి ఆమె చేయి పోయి రెండు రోజులే. ‘చనిపోతాననుకున్నా. పోయింది చేయే! దాన్ని తీసేసి నా కలల్ని తుంచేశానని తను (భర్త) అనుకుంటున్నాడు. అది తప్పని నేను నిరూపిస్తా. పుట్టుకతోనే చేతుల్లేని వారెందరో! వాళ్లు ధైర్యంగా బతుకుతున్నప్పుడు నేను బతకలేనా? త్వరలో స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. నా ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని కోరతా. అందుకే ఈ సాధన. మానాన్న సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నన్ను కష్టపడి చదివించాడు. ఆ కష్టాన్ని వృథాగా పోనివ్వను’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది రేణు. ‘నేరుగా సేవలు అందించలేకపోతే పై చదువులు చదివి నర్సింగ్‌ పాఠాలు అయినా చెబుతా తప్ప ఆగిపోను’ అంటోందీ 23 ఏళ్ల అమ్మాయి. ఆమె పట్టుదలకు మెచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఉద్యోగాన్ని కొనసాగించమని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇది విన్నాక రేణుకి కన్నీళ్లొచ్చాయి.. తన కల కరిగిపోనందుకు! ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎన్ని అడ్డంకులు ఎదురైనా తను చేయగలనని నిరూపిస్తానంటోంది. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్