తల్లులకు ఉద్యోగాలు చూపిస్తారు!

తల్లి అయ్యాక తిరిగి ఉద్యోగంలో కొనసాగేవాళ్లు దాదాపు సగం మందే. అనువైన పనివేళలు ఉంటే దాదాపు అందరు అమ్మలూ కెరియర్‌ని కొనసాగించేవారే. కానీ ఆ అవకాశం లేక పిల్లల కోసం కెరియర్‌ని త్యాగం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి కెరియర్‌, మాతృత్వం... రెండూ సాధ్యమయ్యేట్టు చేస్తున్నారు ఫ్లెక్సీబీస్‌ వ్యవస్థాపకులైన ముగ్గురు అమ్మలు.

Updated : 10 Jun 2022 12:31 IST

తల్లి అయ్యాక తిరిగి ఉద్యోగంలో కొనసాగేవాళ్లు దాదాపు సగం మందే. అనువైన పనివేళలు ఉంటే దాదాపు అందరు అమ్మలూ కెరియర్‌ని కొనసాగించేవారే. కానీ ఆ అవకాశం లేక పిల్లల కోసం కెరియర్‌ని త్యాగం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి కెరియర్‌, మాతృత్వం... రెండూ సాధ్యమయ్యేలా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు ఫ్లెక్సీబీస్‌ వ్యవస్థాపకులైన ముగ్గురు స్నేహితురాళ్లు.

దీపా నారాయణస్వామి... బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంది. అంతలోనే ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ పక్క బిడ్డ, మరో పక్క తల్లి... వీళ్లని చూసుకోవడానికి ఉద్యోగం వదులుకుందామె. అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక ఇంటి నుంచి పనిచేయడానికి వెసులుబాటు ఉండే ఉద్యోగాల కోసం చూస్తే తక్కువగా కనిపించాయి. నిజానికి తల్లి అయిన కొత్తల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యే ఇది. మాతృత్వ సెలవుల తర్వాత దాదాపు సగం మంది ఉద్యోగాలకు దూరం కావడమో, కెరియర్‌ మారడమో చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అసలే మనదేశంలో మహిళా ఉద్యోగులు తక్కువ, ఉన్న ఆ కొద్దిమందీ మధ్యలోనే కెరియర్‌కు దూరమవుతుండటంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది దీప. స్నేహితురాళ్లు- ఐఐఎమ్‌ బెంగళూరు బ్యాచ్‌మేట్స్‌ రష్మీ రామ్మోహన్‌, శ్రేయా ప్రకాశ్‌లతో తన ఆలోచన పంచుకుంది. సీఏ చేసిన దీప.. ఐటీ శిక్షణ సంస్థ ఆప్టెక్‌లో, తర్వాత కేపీఎమ్‌జీలో మేనేజింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేయగా.. అప్పటికి రష్మీ పీఅండ్‌జీలో, శ్రేయా హిందూస్థాన్‌ యూనీలీవర్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. నచ్చిన ప్రదేశం నుంచి అనువైన సమయంలో పనిచేసే వీలు కల్పిస్తే మహిళలెందరో కెరియర్‌ని తిరిగి కొనసాగిస్తారన్న దీప మాటలు వాళ్లకీ నచ్చి చేయి కలిపారు. అలా 2017లో ఫ్లెక్సీబీస్‌(flexibees)ని ప్రారంభించారు. దీని ద్వారా అనుభవజ్ఞులైన మహిళలు పార్ట్‌టైమ్‌, ప్రాజెక్టు ఆధారిత ఉద్యోగాల్ని పొందొచ్చు. వీటిని ఇంటినుంచే చేసుకోవచ్చు.

వేలమంది అభ్యర్థులు...

ఉద్యోగ ప్రకటన, ఇంటర్వ్యూ, అభ్యర్థుల నేపథ్యం పరిశీలన.. కంపెనీలు వీటికెంతో సమయం కేటాయించాలి. వాటి శ్రమని 90 శాతానికి తగ్గిస్తుంది ఫ్లెక్సీబీస్‌. యాప్‌ సాయంతో అభ్యర్థుల వివరాల్ని వారి పని వేళలు, నైపుణ్యాలూ, అనుభవం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వడపోత తర్వాత కొద్దిమందితో కూడిన జాబితాను కంపెనీలకి పంపుతుంది. అందులోంచి ఆయా కంపెనీలు సులభంగా ఎంపిక చేసుకోగలుగుతాయి. దాంతో కంపెనీలూ ఖాళీల వివరాల్ని వీరికి తెలుపుతుంటాయి. వీరి యాప్‌/వెబ్‌సైట్‌లో 40 వేల మంది నిపుణులు వివరాలు నమోదు చేసుకోవడం విశేషం. 25-40 ఏళ్ల మధ్యవారే వీళ్లలో ఎక్కువ. దరఖాస్తు చేసినవాళ్లకి ఫ్లెక్సీబీస్‌ ప్రతినిధులు మొదట ఇంటర్వ్యూ చేశాకే ఉద్యోగావకాశాలు చూపిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఎంపిక కాని వారికి నైపుణ్యాభివృద్ధికి ఏం చేయాలో సూచిస్తారు. కింబర్లీ క్లార్క్‌, టాటా హౌసింగ్‌, 91స్ప్రింగ్‌బోర్డ్‌... మొదలైన 450 విఖ్యాత సంస్థలు వీరి సేవల్ని వినియోగించుకుంటున్నాయి. దీనిద్వారా ఇప్పటివరకూ లక్షకు పైగా పని దినాల్ని అందించామంటారు దీప.

సంస్థ ఉద్యోగులూ అక్కణ్నుంచే..

కంపెనీ సీఈఓ శ్రేయ ఇండియా నుంచి సీఓఓ రష్మీ, సీటీఓ(చీఫ్‌ టాలెంట్‌ ఆఫీసర్‌)దీప.. సింగపూర్‌ నుంచి పనిచేస్తారు. ఈ సంస్థ ఉద్యోగులూ ఇంటినుంచే పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ విధానంలో పనిచేస్తారు. ఫ్లెక్సీబీస్‌ ఉద్యోగావకాశాలు చూపించే వాళ్లలో 70 శాతం అమ్మలే ఉంటున్నారు. సేల్స్‌, మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, టెక్నాలజీ, హెచ్‌.ఆర్‌, కంటెంట్‌ రైటింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌.. దాదాపు ప్రతి విభాగంలోనూ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇండియాతోపాటు సింగపూర్‌, యూఏఈ, యూకే, అమెరికా సంస్థలూ ఉద్యోగుల కోసం వీరిని సంప్రదిస్తాయి.


పెళ్లి, పిల్లల తర్వాత తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాల్ని మహిళలు పొందలేకపోతున్నారు. దాంతో సమాజంలో వారికి గౌరవమూ తగ్గుతుంది. మానసికంగానూ డీలా పడతారు. వాళ్లు పూర్వ అనుభవంతో తిరిగి కెరియర్‌ కొనసాగించేలా ఫ్లెక్సీబీస్‌ సాయపడుతుంది. విరామం తర్వాత ఉద్యోగం సంపాదించడంలో ఉండే సవాళ్లు, పనిలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడం గురించి అభ్యర్థులకు మొదటే చెబుతాం. అవసరమైతే మార్గనిర్దేశం చేస్తాం. ఉద్యోగం చేయని మహిళలతో పోల్చితే ఉద్యోగంలో చేసేవాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. మాద్వారా ఉద్యోగం పొందినవాళ్లు వారి కుటుంబానికి 25-40 శాతం అదనపు ఆదాయం తెస్తున్నారు. దీంతో కుటుంబంలో వారి మాటకి విలువ పెరుగుతోంది. వేలమందికి ఆ దిశగా అవకాశాలు కల్పించడం మాకెంతో గర్వంగా ఉంది’ అని చెబుతారు దీప.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్