వ్యాపారాన్ని సేవగా మలిచారు!

చిరువ్యాపారి అనూరాధ, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ నమ్రతా స్నేహితులు. పేద బాలికలు, వినికిడి లోపం ఉన్న అమ్మాయిలకు స్వయం ఉపాధి మార్గాన్ని చూపించాలనుకున్నారు. వీళ్లది చెన్నై. అనూరాధకు వంటలపై అమితాసక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె భర్త ప్రవీణ్‌ చీజ్‌ తయారీ ఆలోచన చేయమని సూచించారు. అది నచ్చడంతో ప్రవీణ్‌ ఆఫీస్‌లోని చిన్న వంట గదిలో ప్రయోగాలు ప్రారంభించారు...

Published : 25 Jun 2022 00:29 IST

ఇద్దరూ స్నేహితులు... కాకపోతే ఇద్దరివీ భిన్న రంగాలు. అయినా శారీరక లోపాలు ఉన్న పేద అమ్మాయిలకు జీవన నైపుణ్యాలు అందించాలనుకున్నారు. చీజ్‌ తయారీ నేర్చుకొని మరీ శిక్షణనిచ్చారు. చీజ్‌ తయారీలో ప్రయోగాలు చేసి, నైపుణ్యాలను సాధించి దేశవ్యాప్తంగా పంపిణీదారులయ్యారు. ‘నారీశక్తి’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న అనూరాధ కృష్ణమూర్తి, నమ్రతల స్ఫూర్తి కథనమిది.

చిరువ్యాపారి అనూరాధ, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ నమ్రతా స్నేహితులు. పేద బాలికలు, వినికిడి లోపం ఉన్న అమ్మాయిలకు స్వయం ఉపాధి మార్గాన్ని చూపించాలనుకున్నారు. వీళ్లది చెన్నై. అనూరాధకు వంటలపై అమితాసక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె భర్త ప్రవీణ్‌ చీజ్‌ తయారీ ఆలోచన చేయమని సూచించారు. అది నచ్చడంతో ప్రవీణ్‌ ఆఫీస్‌లోని చిన్న వంట గదిలో ప్రయోగాలు ప్రారంభించారు. నాణ్యమైన చీజ్‌ తయారు చేయడానికి వీరికి మూడు వారాలు పట్టింది. స్నేహితుల కుటుంబాలను పిలిచి రకరకాల సలాడ్లు, 18 రకాల చీజ్‌ కేకులు వడ్డించారు. వాటి రుచికి అందరూ ఫిదా అయ్యారు. అప్పుడు నమ్మకం వచ్చి స్థానిక రైతు బజారులో విక్రయానికి ఉంచారు. దాంతో వీరి చీజ్‌ రుచి అందరికీ తెలిసింది.  

ఆ పిలుపు మలుపైంది..

సెలబ్రటీ చెఫ్‌ కరేన్‌ ఆనంద్‌ పిలుపుతో తమ చీజ్‌కు బాగా ప్రాచుర్యం వచ్చిందంటుంది అనూరాధ. ‘కరేన్‌ నిర్వహించిన రైతుబజారుకి మాకు ఆహ్వానం అందింది. అక్కడ మా చీజ్‌ను ప్రదర్శిస్తే, ‘టేస్ట్‌ ఆఫ్‌ ది మార్కెట్‌’ అవార్డు అందుకుంది. 2016, సెప్టెంబరులో ‘కజే చీజ్‌’ పేరుతో మా ఉత్పత్తిని ప్రారంభించి, దానికి వెబ్‌సైట్‌ రూపొందించాం. ప్రయోగాలు మొదలుపెట్టి, పసుపు మొక్క ఆకు చుట్టిన మేక పాల చీజ్‌, మిర్చిపొడి చీజ్‌, మునగాకు చీజ్‌... ఇలా రకరకాలుగా చేయడం ప్రారంభించాం. మొదట తమిళనాడులో మొదలు పెట్టినా రాజస్థాన్‌లోనూ చీజ్‌ తయారీ ప్రారంభించాం. అక్కడి ఒంటెపాలతో చీజ్‌ చేసి మంచి ఫలితాలు సాధించాం. చీజ్‌తో రకరకాల స్వీట్లు, వంటకాల తయారీపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నాం’ అని చెప్పుకొస్తున్న అనూరాధ ‘కెన్‌ డూ’ బీపీఓ సంస్థ వ్యవస్థాపకురాలు. అవయవ లోపాలున్న మహిళలకు ఈ సంస్థ శిక్షణనిచ్చి ఉపాధిని అందిస్తుంటుంది.  

లాక్‌డౌన్‌లో..

‘కజే చీజ్‌ ప్రారంభించి అప్పటికి మూడేళ్లు దాటిపోవడంతో లాక్‌డౌన్‌కు ముందు ఆర్డర్లు ఎక్కువ ఉండేవి. రాత్రికి రాత్రే అన్నీ మూత పడటంతో మా వద్ద 1000కేజీల చీజ్‌ ఉండిపోయింది’ అని వివరించింది నమ్రత. ‘అయినా నిరుత్సాహ పడలేదు. వెంటనే సరుకంతా డీప్‌ ఫ్రీజర్లలో భద్రపరిచాం. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ ఆర్డర్లు భారీగా వచ్చాయి. మొత్తం సేల్‌ చేయగలిగాం. తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లో మా తయారీ యూనిట్స్‌ ఉన్నాయి. మా దగ్గర వంద మందికిపైగా మహిళలు పని చేస్తున్నారు. వీరంతా చెవిటి, మూగ వంటి లోపాలున్నవారే. వారికి శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. మారినేటెడ్‌, ఫ్లేవర్డ్‌, పాస్టోరల్‌, ఫ్రటెల్లీ, మస్టర్డ్‌, చిల్లీ, మ్యాంగో, క్యుమిన్‌ సీడ్‌ వంటి 30 రకాలకుపైగా చీజ్‌లు చేస్తున్నాం’ అని చెబుతున్న నమ్రతా పలుదేశాలు పర్యటించి అక్కడ స్థానిక చీజ్‌ తయారీ విధానాల్లో శిక్షణ తీసుకొంది. ఆ పద్ధతుల్ని ఇక్కడి యూనిట్స్‌లో మహిళలకు నేర్పుతోంది. త్వరలో ఎన్జీవోలతో కలిసి  గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న సహకార సంఘాలు ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం కృషి చేయాలనుకుంటున్న ఈ మిత్ర ద్వయం ప్రయాణం స్ఫూర్తిదాయకం కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్