పట్టుదల ముందు.. ఆటంకాలు చిన్నవే!

మహిళలు ప్రేమాభిమానాలకే కాదు.. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలే. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించగల సత్తా వారిది.  కానీ పారిశ్రామిక రంగం అనేక సవాళ్లతో కూడినది. వాటిని అధిగమించి, ముందుకు సాగేలా మహిళలకు చేయూతనిస్తున్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాతీయాధ్యక్షురాలు డీవీవీ లక్ష్మీవాణి. నేడు ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం.

Published : 27 Jun 2022 06:14 IST

మహిళలు ప్రేమాభిమానాలకే కాదు.. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలే. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించగల సత్తా వారిది.  కానీ పారిశ్రామిక రంగం అనేక సవాళ్లతో కూడినది. వాటిని అధిగమించి, ముందుకు సాగేలా మహిళలకు చేయూతనిస్తున్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాతీయాధ్యక్షురాలు డీవీవీ లక్ష్మీవాణి. నేడు ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం. ఆ సందర్భంగా ఈ రంగంలో మహిళలకున్న అవకాశాల గురించి తన ఆలోచనల్ని వసుంధరతో పంచుకున్నారిలా...

దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇందులో మహిళల శాతం 40కి పైనే. నిరక్షరాస్యులే కాదు, చదువుకున్న వాళ్లు సైతం వంటింటికే    పరిమితమవుతున్నారు. వీళ్లందరికీ ఉపాధి దొరకాలంటే పరిశ్రమలే మార్గం. ఎందుకంటే పారిశ్రామిక రంగం స్వయం ఉపాధిని కల్పించడంతోపాటు    ఇతరులకు ఉద్యోగావకాశాలు చూపుతుంది. తక్కువ పెట్టుబడితో అడుగుపెట్టాలనుకునేవారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంతో ఉపయుక్తం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారుల్లో మహిళలు 15 శాతమే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. నగరాలూ, పట్టణాలే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచీ ఇటువైపు వస్తున్నారు. ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి.

ఎదురయ్యే సవాళ్లు..

పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే కుటుంబం నుంచి వంద శాతం ప్రోత్సాహం ఉండాలి. చాలామంది మహిళలకు ఇదే తొలి అడ్డంకి. ఆపైన అనుమతులు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్‌లోనూ ఇబ్బందులున్నాయి. కానీ, అవగాహనతో వీటిని అధిగమించవచ్చు. యువతరం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామిక రంగంలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తోంది. వీరికి కుటుంబాలు సైతం మద్దతిస్తున్నాయి. ప్రభుత్వాలూ మహిళల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నాయి. పారిశ్రామికరంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా మహిళలు ఎంతగానో నష్టపోయారు. బ్యాంకులు, ప్రభుత్వాల నుంచి సాయం అందలేదు. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

శిక్షణ శిబిరాలతో..

ఒకరిద్దరితో సమాజంలో మార్పు తీసుకురాలేం. అందుకే పారిశ్రామికవేత్తగా కుదురుకున్నాక మరింత మంది మహిళలను ఈ రంగంలోకి  ఆహ్వానించా. ఇటువైపు రావడానికి ఎన్నో సందేహాలు వ్యక్తంచేసేవారు. ఆ క్రమంలోనే ఉచిత శిక్షణ శిబిరాలను ప్రారంభించా. జ్యూట్‌ బ్యాగులు, చేనేత, జౌళి, ఉన్ని దుస్తులు, బొమ్మలు, కృత్రిమ నగల తయారీతో మొదలుపెట్టి.. ఆహారశుద్ధి, పారిశ్రామిక శిక్షణ, యానిమేషన్‌, వెబ్‌డిజైనింగ్‌, మల్టీమీడియా, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌... ఇలా 30 వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నాం. అందుకోసం వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోం. కొన్ని పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. పరిశ్రమల స్థాపనపై వృత్తి నిపుణులతోపాటు అధికారులు వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వ్యాపార విస్తరణ, అభివృద్ధి, పెట్టుబడులు, అనుమతులు, యంత్రాలు, ఉత్పత్తులు, క్రయవిక్రయాలపైనా మార్గనిర్దేశం చేస్తున్నాం. మేం శిక్షణ ఇచ్చిన వారిలో నాలుగు లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. వారిద్వారా 20 లక్షల మందికి ఉపాధి అందుతోంది. పెట్టుబడులు, రుణాలు, అనుమతులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా. స్వయంగా అధికారుల వద్దకు వెళ్లి మాట్లాడి పరిష్కరిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు వెళ్లి స్థలాల కేటాయింపును కోరుతున్నాం. కేంద్రమంత్రి నారాయణరాణెను కలిసి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని కోరా. ఇది కేంద్రం పరిశీలనలో ఉంది.


విద్యార్థిదశలోనే వ్యాపారం..

నాన్న విజయభాస్కర్‌రావు డాక్టర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశాఖ సంచాలకుడిగా పనిచేశారు. పదోతరగతి పూర్తయ్యాక వ్యాపారిగా  మారాలనుకున్నా. జ్యూట్‌బ్యాగ్‌లపై ఆసక్తితో ఇంటర్‌ తర్వాత నాన్నను ఒప్పించి... తయారీ యంత్రాలను కొనుగోలు చేశా. మరోవైపు చదువు కొనసాగించి సామాజిక శాస్త్రంలో పీజీ, అమెరికాలోని వెస్ట్‌బూక్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందా. హైదరాబాద్‌, విజయనగరం, నోయిడాల్లో మూడు జౌళి పరిశ్రమలను స్థాపించి నిర్వహిస్తున్నా. 2012లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంఘం (వీఎండ్‌) స్థాపించా. దీనిద్వారా పన్నెండు రాష్ట్రాల్లోని 50 కేంద్రాలద్వారా శిక్షణ ఇస్తున్నాం. మహిళా చైతన్య పారిశ్రామిక పత్రికను నిర్వహిస్తున్నా. నా సంపాదనలో దాదాపు 20 శాతం శిక్షణ కేంద్రాలకు వెచ్చిస్తున్నా. ఈ ప్రయాణంలో మావారు డీవీ రావు సహకారమూ ఉంది.


మార్పు రావాలంటే

ధైర్యేసాహసే లక్ష్మి.. అన్నారు. ఇక్కడా కష్టనష్టాలుంటాయి. తట్టుకుని నిలబడితే లాభాలబాట పడతారు. మహిళలు తమకు లభించే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ ప్రోత్సాహం పెరగాలి. సాధారణ రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వాలి. సబ్సిడీలు పెంచాలి. పాఠశాల స్థాయిలోనే బాలికలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే కృషి జరగాలి. విదేశాల్లో పారిశ్రామికరంగంలో పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నారు. మన దగ్గరా ఆ పరిస్థితి రావాలి. 

 - ఆకారపు మల్లేశం, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్