అగ్నిపర్వతం మీదుగా హెలికాప్టర్‌ నడిపా!

పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలన్నది ఆమె కల. అందుకోసం హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వాలనుకుంది. ఇంట్లో వాళ్లు వారించారు.. తోటి వాళ్లు చేయలేవన్నారు.. మన దేశంలో నేర్చుకునే అవకాశం లేదు.. ఇవేవీ తనను ఆపలేక పోయాయి. ప్రతి దశలోనూ తానేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌ తను. పురుషాధిక్య రంగంలో తను సాధించాల్సింది ఇంకా ఉందంటున్న ఈ వైజాగ్‌ అమ్మాయి వసుంధరతో తన కలల ప్రయాణాన్ని పంచుకుందిలా...

Updated : 28 Jun 2022 06:45 IST

పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలన్నది ఆమె కల. అందుకోసం హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వాలనుకుంది. ఇంట్లో వాళ్లు వారించారు.. తోటి వాళ్లు చేయలేవన్నారు.. మన దేశంలో నేర్చుకునే అవకాశం లేదు.. ఇవేవీ తనను ఆపలేక పోయాయి. ప్రతి దశలోనూ తానేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌ తను. పురుషాధిక్య రంగంలో తను సాధించాల్సింది ఇంకా ఉందంటున్న ఈ వైజాగ్‌ అమ్మాయి వసుంధరతో తన కలల ప్రయాణాన్ని పంచుకుందిలా...

అయిదేళ్ల తర్వాత ఈ మధ్యే మన దేశానికొచ్చా. ఫ్రీలాన్సర్‌గా మా సంస్థలోని ఇతర పైలట్లకూ శిక్షణ, స్కూల్‌ కరిక్యులమ్‌ విషయంలో సలహాలిస్తున్నా. కేవలం ప్రయాణికులను చేర్చడం నాకిష్టం లేదు. వస్తువులను చేరవేయడం, ఆపదలో సత్వర సాయం, వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌.. ఇలా భిన్నమైన వాటిని ప్రయత్నించాలన్నది నా కల. మన దేశంలో ఇది ఆర్మీ వాళ్లకే సాధ్యం. అందుకే విదేశాల్లో ప్రయత్నిస్తున్నా. కానీ ఏ దేశానికి వెళ్లినా టెస్ట్‌లు రాసి లైసెన్సులు పొందాలి. ఇప్పుడా పనిలోనే ఉన్నా. వివిధ దేశాల్లో పనిచేయాలి, భిన్న సంస్థల హెలికాప్టర్‌లు నడిపి క్రితి ఎక్కడైనా చేయగలదనే స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. నా స్నేహితులు ‘చిన్నప్పుడు అందరం ఎన్నో చేయాలనుకున్నాం. నువ్వు మాత్రం చేసి చూపించావ్‌. మాకు నువ్వే స్ఫూర్తి’ అంటోంటే ఆనందంగా ఉంది.

అమ్మాయిలు ఒప్పించలేమని ఆగిపోతుంటారు. కానీ అసలు యుద్ధం మీకు మీతోనే. మీ ఆలోచనపై మీరు దృఢంగా ఉంటే ఎవరెన్ని చెప్పినా దాన్ని మార్చలేరు. ఆ స్థితికి చేరుకోండి. అప్పుడు అందరూ మిమ్మల్ని నమ్ముతారు. ఎవరితోనూ పోల్చుకోవద్దు. నిన్నటి కంటే నేను మెరుగయ్యానా లేదా అన్నదానిపై దృష్టిపెట్టండి.

చిన్నతనం నుంచీ పైలట్‌ కావాలనే! ఇంట్లో అదే చెప్పా. అమ్మాయిని, పైగా ఏకైక సంతానం.. అమ్మానాన్నలకి నచ్చలేదు. ‘ముందు డిగ్రీ చెయ్‌. పైలట్‌ అయ్యి, తీరా నచ్చలేదనుకో అప్పుడు ఇబ్బంది ఉండద’న్నారు నాన్న. సమంజసమే అనిపించి బిట్స్‌- గోవా నుంచి ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌లో డ్యూయల్‌ డిగ్రీ చేశా. తర్వాత ‘ఉద్యోగానుభవమూ ఉంటే మంచిది కదా’ అన్నారు. బెంగళూరులో ఏడాది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, మరో ఏడాది ఒక స్టార్టప్‌లో మొబైల్‌ అడ్వర్టైజింగ్‌లో పనిచేశా. ఇవేవీ నాకు సరిపడవని అర్థమైంది. ఈసారి నచ్చజెప్పబోతే ససేమిరా అన్నా. ఉద్యోగానికి విరామమిచ్చి కొన్నాళ్లు పారాగ్లైడింగ్‌ చేశా. చాలా ప్రదేశాలు తిరిగా, కొత్తవాళ్లను కలిశా. పైలట్‌ కెరియర్‌పై పరిశోధన చేశా. ఒంటరిగా కొత్త ప్రదేశాల్లో ఉండగలను, నాకిదే సరైంది అనిపించింది. మాది విశాఖపట్నం. నాన్న జి.బుచ్చిరాజు డాక్టర్‌. అమ్మ మంజుల సైకాలజిస్ట్‌గా చేశారు.

ఏడాదిలో.. అయిదు!

పైలట్‌ అదీ హెలికాప్టర్‌ పైలట్‌ అవుతానన్నా. విమానాల్లో టేకాఫ్‌, ల్యాండింగ్‌ కష్టం. అయితే ఆటోపైలట్‌ అవకాశముంటుంది. హెలికాప్టర్లలో ఆ వీలుండదు. ప్రతి సెకనూ దీక్షతో ఉండాలి. దీంతో ఇంకాస్త భయపడ్డారు. నా పట్టుదల చూసి ఆర్నెల్లకు దిగొచ్చారు. మన దగ్గర హెలికాప్టర్‌ పైలట్‌ శిక్షణ ప్రైవేటుగా అందించే సంస్థల్లేవప్పుడు. నాకేమో సివిలియన్‌ పైలట్‌ అవ్వాలని! దీంతో 2016లో అమెరికాలోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్‌ అకాడమీలో చేరా. మొదట్నుంచీ మంచి విద్యార్థిని. థియరీ సరే కానీ ప్రాక్టికల్‌గా విఫలమవుతుండేదాన్ని. విదేశాల్లో చదువు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ రెంటికీ ప్రాధాన్యమిస్తారు. మిగతావాళ్లు చకచకా చేసేసేవారు. నన్ను చూసి ‘అమ్మాయిలకు ఇదంత సులువు కాదు, మీ దేశం వెళ్లి వేరే ఏదైనా ప్రయత్నించొచ్చు కదా’ అనేవారు. ఇది పురుషాధిక్య రంగం. అక్కడేమో నేనొక్కదాన్నే. మానసికంగా అలసిపోయేదాన్ని. అయినా ‘ఏం ఫర్లేదు, మళ్లీ మళ్లీ ప్రయత్నించు. ఇవన్నీ చాలా చిన్న సమస్యలు, జీవితంలో ఇంకా ఎదుర్కోవాల’ని నన్ను నేను మోటివేట్‌ చేసుకునేదాన్ని. ప్రైవేట్‌, కమర్షియల్‌, ఇన్‌స్ట్రక్టర్‌ లైసెన్స్‌లు, ఇన్‌స్ట్రుమెంట్‌ రేటింగ్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సులు చేశా. కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు పట్టే దాన్ని ఏడాదిలో పూర్తిచేసి నా పనితోనే సమాధానమిచ్చా. దీంతో నేను చేరిన సంస్థే ఉద్యోగావకాశమిచ్చింది. గత ఏడాది ప్రైవేట్‌ యాడ్‌ ఆన్‌ ఏరోప్లేన్‌ రేటింగ్‌ చేశా. దీంతో చిన్న ప్లేన్స్‌నీ నడపొచ్చు.

అగ్నిపర్వతం మీదుగా..

అసిస్టెంట్‌ చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ స్థాయికి ఎదిగా. మా సంస్థ మూడు ద్వీపాల్లో స్కూలింగ్‌తోపాటు టూరిజం, కమర్షియల్‌.. వంటి వివిధ సేవలందించేది. విద్యార్థులకు నేర్పించడంతోపాటు అన్ని విభాగాల్లో పనీ చేశా. నాకెప్పట్నుంచో ఎక్కువ దూరం హెలికాప్టర్‌ నడపాలని కోరిక. మా బాస్‌ ఫ్లోరిడాలో ఓ హెలికాప్టర్‌ కొన్నారు. దాన్ని నేనే స్వయంగా తీసుకొచ్చా. క్రిస్మస్‌ సమయం.. కొత్త హెలికాప్టర్‌. మంచు, వాతావరణం ఏమీ బాలేదు. ప్రమా దాలకు ఆస్కారమెక్కువ. అయినా విజయవంతంగా ఏడు రోజుల్లో తీసుకొచ్చా. హవాయికి దగ్గర్లో అగ్నిపర్వతం నుంచి లావా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. 2018లో అగ్నిపర్వతం పేలింది. లావా ఉప్పొంగుతోంటే రాత్రి పూట హెలికాప్టర్‌లో దగ్గరగా వెళ్లి చూసొచ్చా. ఇవి మర్చిపోని అనుభవాలు. సవాళ్లూ ఎక్కువే. పొరబాటు అని చెప్పలేం కానీ.. తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పు. ఇలా ప్రమాదాల్లో తోటివాళ్లు చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితి మనకూ ఎదురవ్వచ్చు అన్న ఆలోచన భయపెడుతుంది. కానీ దాన్నీ పాఠాలుగా చేసుకుంటా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్