పోషకాలు అందిస్తూ... వ్యాపారవేత్తలయ్యారు!

వాళ్లలో ఎవరూ చదువుకోలేదు. ఊరుదాటిందీ తక్కువే. కానీ ఓ బృందంగా వాళ్ల క్రమశిక్షణ, నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన అధికారుల్ని ఆకట్టుకున్నాయి. ఆ లక్షణాలే లక్షలు పెట్టుబడిగా అందించి మరీ వాళ్లని వ్యాపారులుగా మార్చేలా చేశాయి. అధికారుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా

Updated : 30 Jun 2022 06:52 IST

వాళ్లలో ఎవరూ చదువుకోలేదు. ఊరుదాటిందీ తక్కువే. కానీ ఓ బృందంగా వాళ్ల క్రమశిక్షణ, నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన అధికారుల్ని ఆకట్టుకున్నాయి. ఆ లక్షణాలే లక్షలు పెట్టుబడిగా అందించి మరీ వాళ్లని వ్యాపారులుగా మార్చేలా చేశాయి. అధికారుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఓ చిన్న పల్లె నుంచే పెను మార్పుని తెస్తోందా మహిళా బృందం! ఆ మహిళలెవరు.. వాళ్లు తెస్తోన్న మార్పేమిటంటే..

గిరిజనుల్లో బాగా వెనకబడిన తెగల్లో కొలాం ఒకటి. వీరిని ఆదిమ గిరిజనులు (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌)గా పరిగణిస్తారు. వీరు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 45 వేలమంది ఉన్నారు. ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తెస్తున్నా పోషకాహారలోపం, రక్తహీనత, తక్కువ బరువు... మొదలైన సమస్యలు ఆ తండాల్లో తాండవిస్తాయి. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనుకున్నారు ఐటీడీఏ ఉట్నూరు అధికారులు. ఆ బాధ్యతను ఆసిఫాబాద్‌ మండలంలోని కౌటగూడకు చెందిన ఓ మహిళా సంఘానికి అప్పగించారు. దీన్లో మంజుల, పుష్పలత.. సహా పది మంది ఉన్నారు. కొలాం తెగకే చెందిన వీళ్లు పోడు భూముల్ని సాగు చేస్తుంటారు. వ్యవసాయ కూలీలుగానూ వెళ్తుంటారు. తమ సంఘానికి వచ్చిన రుణాలతో చిన్న దుకాణాలు నడిపే వారు ఒకరిద్దరు. మరికొందరు పశువులు కొన్నారు, వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగించడం చేసేవారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సకాలంలో వడ్డీతో సహా రుణ మొత్తాన్ని చెల్లించేవారు. వీరి ఆర్థిక క్రమశిక్షణ, శ్రమించే గుణం చూసిన అధికారులు పోషకాహార తయారీ బాధ్యతని అప్పగించాలనుకున్నారు. ఒక్కొక్కరూ రూ.50వేలు చొప్పున అయిదు లక్షలు పోగుచేసి పెట్టుబడి పెడితే ఆహార పదార్థాలు తయారుచేసే యూనిట్‌ నెలకొల్పడంలో సాయపడతామనీ, ఏడాది పొడవునా ఉపాధి పొందొచ్చన్నారు. గ్రామం, మండలం దాటి వెళ్లింది లేదు.. యంత్రాలూ, వ్యాపారాలూ.. అయ్యే పనేనా అని మొదట సందేహించారు. అధికారులే తయారీ ఉత్పత్తులు కొంటామని భరోసా ఇవ్వడం, వాటిద్వారా తమ తెగ వాళ్లకే ఆరోగ్యం మెరుగవ్వడం లాంటి విషయాలు ఆలోచింపజేశాయి. చివరకు అంగీకరించారు. కూలీ డబ్బులూ, పంట అమ్మగా వచ్చిన మొత్తం, అప్పులు చేసి.. డబ్బు తెచ్చారు.

ఇక్రిశాట్‌లో శిక్షణ...

హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో గతేడాది జులైలో చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీని నేర్చుకున్నారు. చిరుధాన్యాల్లో ఉండే  పోషకాల గురించి వివరంగా తెలుసుకున్నారు. ఆపైన ఆసిఫాబాద్‌ మండలం సాలేగూడలో ఆగస్టులో శ్రీ ఆంజనేయ డ్రైఫూట్స్‌ ఇండస్ట్రీని ప్రారంభించారు. రూ.5 లక్షలకు అదనంగా ఐటీడీఏ రూ.24 లక్షలు రుణంగా ఇవ్వడంతో ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్‌ యంత్రాలు కొనుగోలు చేసి తయారీ యూనిట్‌ని ప్రారంభించారు. ఐటీడీఏ అధికారులూ, ఇక్రిశాట్‌ పరిశోధక విద్యార్థులూ దగ్గరుండి నెలపాటు తోడ్పాటునందించారు.

జీసీసీ ముడిసరుకు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొలాం తెగకు చెందిన వారిలో దాదాపు 12 వేల మంది రక్తహీనత, బరువు తక్కువ సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు గుర్తించారు. వీరందరికీ ఈ మహిళా సంఘం చిరు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను అందిస్తోంది. గిరిజన సహకార సంస్థ ముడి సరుకులు అందించడమే కాకుండా ఇక్కడ తయారైన ఆహార పొట్లాలను కొని అంగన్వాడీ కేంద్రాలకు  అందిస్తోంది. ప్రస్తుతం స్వీట్‌మీల్‌ పొడి కేజీ రూ.100, జావార్‌ మీల్‌ పొడి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిని వేడి నీటిలో కలిపి తినేయొచ్చు. జొన్నలు, కొర్రలు, సామలు, పెసరపప్పు, శనగలు, పల్లీలతో జావార్‌ మీల్‌, మల్టీ గ్రెయిన్‌ మీల్‌ తయారుచేయగా.. జొన్నలు, కిస్మిస్‌, బాదం, బెల్లంతో స్వీట్‌ మీల్‌ తయారుచేస్తున్నారు. ఈ ఆహారం అందిస్తూ 45 రోజులకోసారి హిమోగ్లోబిన్‌ స్థాయిల్ని పరీక్షిస్తూ, పిల్లల బరువునీ ఆరా తీస్తూ వచ్చారు అధికారులు. ఏడాది తిరిగేసరికి ఈ ప్రాంతాల్లో ప్రసూతి మరణాలు 21 నుంచి 7కు తగ్గాయి. గర్భిణుల రక్తహీనత మరణాలు 18 నుంచి సున్నాకు చేరాయి. బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య 13,100 నుంచి 4100కు తగ్గింది.

రోజుకు వెయ్యి కిలోల ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌ చేస్తున్నారీ మహిళలు. ఖర్చులు పోను వాటిపైన రూ.16 వేల లాభం వస్తోంది. మరోవైపు సొంత వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఏడాదిలోనే ఒక్కొక్కరికీ రూ.1.5-2 లక్షల ఆదాయం వచ్చింది. ఒకప్పుడు కలగానే ఉన్న పిల్లల ఉన్నత చదువుల్ని ఇప్పుడు నిజం చేసుకుంటున్నారు. తాము బడి ముఖం చూడకపోయినా పిల్లల్ని నగరాల్లో ఇంజినీరింగ్‌, నర్సింగ్‌.. లాంటివీ చదివిస్తున్నారు. త్వరలో బయట వారికీ తమ ఉత్పత్తుల్ని అమ్మడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామంటున్నారు.

- చొక్కాల రమేష్‌, ఆసిఫాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్