ఆశ్రమ పిల్లలకోసం.. ఊరూరూ తిరిగి.. కూలి చేసి!

ఎవరూలేని వాళ్లకోసం... అయిన వాళ్లని వదులుకోవడం అంటే మాటలా? అలాంటి ఓ తండ్రికి బిడ్డగా వెళ్లింది శ్యామల! ఆయన ఆశయాలు అర్థం చేసుకుంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకి నిలువెత్తు ధైర్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని బెహరా మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహకురాలు శ్యామలాకుమారి స్ఫూర్తి కథ ఇది...

Updated : 08 Jul 2022 06:57 IST

ఎవరూలేని వాళ్లకోసం... అయిన వాళ్లని వదులుకోవడం అంటే మాటలా? అలాంటి ఓ తండ్రికి బిడ్డగా వెళ్లింది శ్యామల! ఆయన ఆశయాలు అర్థం చేసుకుంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకి నిలువెత్తు ధైర్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని బెహరా మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహకురాలు శ్యామలాకుమారి స్ఫూర్తి కథ ఇది...

జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయి మిగిలిన సమయాన్ని సేవ కోసం కేటాయించే వాళ్ల గురించి విని ఉంటారు. ఆర్థికంగా కాస్తంత వెసులుబాటు ఉండి సేవ చేయాలని తాపత్రయపడే వాళ్ల గురించీ వినుంటారు. శ్యామల దారి ఇందుకు పూర్తిగా భిన్నం. చిన్నతనం నుంచీ తన జీవితాన్ని సేవాపథంవైపే నడిపించారామె. ‘శ్రీకాకుళంలోని జోగిపాడు అనే మారుమూల గ్రామం మా సొంతూరు. వ్యవసాయ కుటుంబం మాది. నాన్నకి శేఖర్‌ అని ప్రాణ స్నేహితుడున్నారు. ఇద్దరూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. శేఖర్‌ అంకుల్‌ రాజమండ్రిలో.. మానసిక వికలాంగుల కోసం నడిపే ఓ బడిని చూసి, అలాంటిది ఉత్తరాంధ్రలోనూ ఉంటే బాగుంటుందనుకున్నారు. 1990లో తన ఇంటిపేరుతో ‘బెహరా మనో వికాస కేంద్రం’ ఏర్పాటు చేశారు. కానీ ఈ బడి.. వాళ్ల కుటుంబంలో విభేదాలకి కారణం అయ్యింది. దాంతో ఆయన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయారు. శేఖర్‌ అంకుల్‌ని అలా చూడలేక నన్ను ఆయనకి దత్తత ఇచ్చారు మా నాన్న. నా పదోతరగతి సెలవలప్పుడు ఆశ్రమానికి వెళ్లాను. మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఆ పిల్లలు అకారణంగా ఏడుస్తారు. ఉన్నట్టుండి గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా పైనుంచి కిందకి దూకేస్తుంటారు. మొదట్లో ఇవన్నీ చూసి భయపడ్డా. తర్వాత జాలిపడ్డాను. కారణం వాళ్లకి ఆకలేస్తే చెప్పలేరు. మనమే వాళ్ల ఆకలి తెలుసుకుని అన్నం పెట్టాలి. కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెబితే వాళ్లకు చదువులు చెప్పడమూ తేలికే. అందుకే ఇంటర్‌ కాగానే మరో కెరియర్‌ గురించి ఆలోచించకుండా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశా. ఇక ఈ జీవితం ఆ పిల్లల కోసమే అనుకున్నా’ అంటారు శ్యామల.

మూతపడకూడదని...

ఆశ్రమాన్ని నడిపించడం కోసం శేఖర్‌, శ్యామల తండ్రి సత్యం వారి ఆస్తుల్ని అమ్మారు. ఇక అమ్మడానికి ఏమీ లేక ఆ ఆశ్రమం మూతపడే స్థితికి వెళ్లింది. అప్పుడే దాని నిర్వహణ బాధ్యతను శ్యామల తీసుకున్నారు. ‘గొప్ప ఆశయంతో నాన్న ప్రారంభించిన ఆ ఆశ్రమం మూతపడకూడదనుకున్నా. ఊరూవాడా తిరిగి అందరి సాయమూ అడిగా. మానవత్వం ఉన్న కొందరు సాయం చేశారు. అప్పటికి మా ఆశ్రమం ఓ అద్దె ఇంట్లో ఉండేది. పిల్లలు భవనాన్ని పాడు చేస్తున్నారని యజమాని ఖాళీ చేయించారు. ఆ సమయంలో ప్రభుత్వం 15 సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందించి పిల్లల్ని ఆదుకుంది. మరోవైపు దాతలు ఇసుక, సిమెంటు, ఇటుక ఇలా అన్నీ సమకూర్చారు. కానీ కూలీలకు ఇచ్చేందుకు కూడా మా దగ్గర డబ్బులేక మేమే కూలీలుగా మారి ఈ భవనాన్ని నిర్మించాం. పద్నాలుగేళ్లుగా మా ఆశ్రమం ఈ భవనంలోనే నడుస్తోంది. మావారు విజయభాస్కర్‌ కూడా నా ఆశయాన్ని అర్థం చేసుకుని తోడుగా నిలిచారు. ఆయన ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాన్ని పిల్లల కోసం కేటాయిస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. వాళ్లూ ఈ పిల్లలతో సమయం గడుపుతారు. అంతా బాగున్నా నా మనసులో ఓ బాధ ఉండేది. ఇంత మందికి ఇంత చేసిన శేఖర్‌ అంకుల్‌ జీవితం మనుపటిలా ఉంటే బాగుండేది కదా అని. అందుకే ఆ దంపతుల్ని మళ్లీ ఒకటి చేశాం. ప్రస్తుతం మా ఆశ్రమంలో సేవ చేయడానికి ఆ అమ్మ కూడా తోడయ్యారు. మేమంతా కలిసే పిల్లల బాగోగులు చూసుకుంటున్నాం’ అంటున్నారు శ్యామల.

స్వయం ఉపాధిలో శిక్షణ అందిస్తూ..

ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 40 మంది అబ్బాయిలు, 28 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో 32 మంది అనాథలు. 24 మంది డేస్కాలర్స్‌ కూడా ఉన్నారు. పిల్లలు ఆకలి, దాహం, కాలకృత్యాలు వంటి వాటి గురించి తమంతట తాము చెప్పేలా వారికి శ్యామలే స్వయంగా స్పీచ్‌ థెరపీ ఇస్తారు. తర్వాత అక్షరాల్ని గుర్తుపట్టేలా శిక్షణ ఇస్తారు. నాలుగో తరగతి వరకూ పాఠాలు చెప్పి.. అక్కడి నుంచి స్వయం ఉపాధి నైపుణ్యాలని అందిస్తారు. ఇలా సుమారు పది మంది స్వయం ఉపాధి నైపుణ్యాల్ని అందిపుచ్చుకున్నారు. కొందరు కంప్యూటర్‌ శిక్షణా తీసుకున్నారు. వీరు అందిస్తున్న సేవలకుగానూ 2005లో నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా జాతీయ యువజన అవార్డుని అందుకున్నారు. పారాలింపిక్స్‌లో ఈ ఆశ్రమానికి చెందిన వసుంధర అనే అమ్మాయి స్వర్ణం గెలిచింది. ‘అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే భవనంలో వేర్వేరుగా వసతి కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి పిల్లలకు శారీరక కదలికల కోసం ఆటలు, వ్యాయామం తప్పనిసరి. దీనికోసం స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే పిల్లలకు మేలు చేసినట్టువుతుంది’ అంటారు శ్యామల.

- రుత్తల ప్రవీణ్‌ కుమార్‌, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్