విశ్వరహస్యాల్ని ఛేదిస్తున్నారు

మనం భూమ్మీద పడ్డప్పటి ఆ తొలిక్షణాలని గురించి అమ్మోనాన్నో చెబితే విని ఆనందిస్తాం. ఇక అప్పటి ఫొటోలుంటే మరీ సంతోషం. మరి మన అనంత విశ్వం ఆవిర్భావం జరిగిన నాటి చిత్రాలని చూడాలంటే? అసాధ్యం అంటారా! కాదు సాధ్యమే అని నిరూపించింది జేమ్స్‌వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌. సుమారుగా 1300 కోట్ల సంవత్సరాల క్రితం నాటి విశ్వావిర్భావ చిత్రాలని తీసి మనకు పంపింది.

Updated : 14 Jul 2022 07:47 IST

మనం భూమ్మీద పడ్డప్పటి ఆ తొలిక్షణాలని గురించి అమ్మోనాన్నో చెబితే విని ఆనందిస్తాం. ఇక అప్పటి ఫొటోలుంటే మరీ సంతోషం. మరి మన అనంత విశ్వం ఆవిర్భావం జరిగిన నాటి చిత్రాలని చూడాలంటే? అసాధ్యం అంటారా! కాదు సాధ్యమే అని నిరూపించింది జేమ్స్‌వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌. సుమారుగా 1300 కోట్ల సంవత్సరాల క్రితం నాటి విశ్వావిర్భావ చిత్రాలని తీసి మనకు పంపింది. ఈ అద్భుతం వెనుక ఎందరో మహిళా శాస్త్రవేత్తలున్నారు. వారిలో మన భారతీయులూ ఉండటం విశేషం..


వైజ్ఞానిక వారసత్వం...

అమ్మ, అమ్మమ్మ, అత్తయ్యల స్ఫూర్తితో సైన్స్‌ని ప్రేమించిన డాక్టర్‌ హషీమా హసన్‌ స్పేస్‌ సైంటిస్ట్‌గా అద్భుతాలు సాధించారు. జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌కి డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌గా భారతీయ మహిళాశక్తిని చాటుతున్నారు. ఆవిడేం చెబుతున్నారంటే...

‘నాకప్పుడు ఐదేళ్లు. అమ్మమ్మ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ పెరట్లోకి తీసుకెళ్లింది. వాళ్లంతా ఉత్సాహంగా దేనికోసమో ఎదురు చూశారు. ఆ హడావుడంతా దేనికోసమో తెలుసా? రష్యా పంపిన స్పుత్నిక్‌ శాటిలైట్‌ని ఆకాశంలో చూడ్డం కోసం. మా కుటుంబ సభ్యులకు సైన్స్‌ అంటే అంత ఇష్టం. అలా ఐదేళ్లప్పుడు మొదలయిన ఇష్టం.. ఎక్కడ వరకూ వెళ్లిందంటే ఏదైనా శాటిలైట్‌ని పంపించినప్పుడు పేపర్‌లో అది విజయవంతం అయ్యిందా లేదా? అని ఆ వార్తలన్నీ చదివేదాన్ని. ఆ తర్వాత మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన క్షణాలు నాలో నాటుకు పోయాయి. ఏదో ఒక రోజు నాసాలో అడుగుపెట్టాలన్నది నా కలగా మారిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నా స్వస్థలం. మావయ్య డాక్టర్‌ హుస్సేస్‌ జహీర్‌ సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా చేశారు. అత్తయ్య నజ్మాజహీర్‌ బయాలజిస్ట్‌. నా మీద వీళ్ల ప్రభావం ఎక్కువ. ఇక మా అమ్మ, అమ్మమ్మలకయితే నేను సైంటిస్ట్‌ని అయితీరాల్సిందే అనేంత వ్యామోహం. నాకూ సైన్స్‌ అంటే ఆసక్తే. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో డిగ్రీ చదివి బంగారు పతకాన్ని సాధించా. తర్వాత ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌లోనూ పరిశోధనల్లో పాల్గొన్నా. భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో పనిచేసిన అనుభవం జీవితంలోనే గొప్ప మలుపు. ఆ తర్వాతే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి థియరాటికల్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నా. 94లో నాసాలో అడుగుపెట్టా’ అనే హషీమా నాసా చేసిన డజనుకుపైగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. హబుల్‌ టెలిస్కోప్‌లో లోపాలని పరిష్కరించి గుర్తింపుని సాధించారు. ఆమె కృషిని గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఆస్ట్రోఫిజిక్స్‌ ఎడ్యుకేషన్‌ కమ్యూనికేషన్స్‌ లీడ్‌గా బాధ్యతలు అప్పగించింది. జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ గురించి పిల్లలకు, పాడ్‌కాస్ట్‌లు ద్వారా ప్రపంచానికి తెలియచేసేందుకు అధికారిక స్పోక్స్‌పర్సన్‌గానూ వ్యవహరించారు.


తన పరిశోధనలు కీలకం....

జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌లో నాలుగు కీలక వ్యవస్థల్లో మిరీ (మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌) ఒకటి. దీనికి ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రశంసలు పొందారు కల్యాణి.

టెలిస్కోప్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రారెడ్‌ డిటెక్టర్లని రూపొందించడంలో పన్నెండేళ్లుగా కీలక బాధ్యతలు పోషించారు కల్యాణిసుకాత్మే. ఈవిడ స్వస్థలం ముంబయి. అమ్మానాన్నా మ్యాథ్స్‌ ప్రొఫెసర్లే అయినా తను మాత్రం ఫిజిక్స్‌ మీద ప్రేమను పెంచుకుంది. ఐఐటీ ముంబయి నుంచి బీటెక్‌ చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నారు. తర్వాత నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలో పోస్ట్‌డాక్టరల్‌ చేశారు. తన నైపుణ్యాలను గుర్తించి 2010లో మిరీ ప్రాజెక్ట్‌ బాధ్యతలను అప్పగించారు. వ్యోమనౌకల ఉపరితలాలు వేడెక్కకుండా నిరోధించడంలో ఆమె చేసిన పరిశోధనలు ఈ ప్రాజెక్టు విజయవంతానికి ఎంతో దోహదపడ్డాయి. ఈమె సేవలకు గుర్తింపుగా 2012లో నాసా నుంచి యురోపియన్‌ ఏజెన్సీ జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ పురస్కారాన్నీ అందుకున్నారు.


పేదరికాన్ని దాటి చుక్కల్ని తాకి...

జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ పనితీరుని పర్యవేక్షించే స్పేస్‌ టెలిస్కోప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి. తనకు గెలాక్సీల ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో... పేద బాలికలకు సైన్స్‌ని చేరువ చేయడమన్నా అంతే ఆసక్తి. ఈ ఆసక్తి తన జీవితం నుంచే మొదలయ్యింది అంటుందామె...

ఈ ప్రతిష్ఠాత్మక టెలిస్కోప్‌ రూపకల్పనలో... సైన్స్‌, ఆపరేషన్స్‌ బృందంలో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా. కానీ డిగ్రీలోకి వచ్చే వరకూ టెలిస్కోప్‌నే చూడలేదు. ‘మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఊళ్లో పుస్తకాల దుకాణాలు చాలా తక్కువ. ఇప్పటికీ మాకు సరైన రవాణా సదుపాయం లేదు. ఆస్ట్రానమర్‌  అవ్వాలన్నది నా చిన్ననాటి కల. కానీ అందుకు సంబంధించి చదువుదామంటే స్కూల్లో లైబ్రరీ కూడా ఉండేది కాదు. ఏడేళ్లపాటు చదవడానికి పుస్తకాలు లేవన్న బాధ నన్ను ఆలోచింపచేసింది. ఆస్ట్రానమర్‌ అవ్వాలని ఉన్నా ... డిగ్రీ అయ్యేంతవరకూ టెలిస్కోప్‌ అంటే ఎలా ఉంటుందో తెలియదు. పట్టుదలగా చదివి ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ వెళ్లాను. మా తరగతిలో 30 మంది ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో గెలాక్సీల ఆవిర్భావంపై పీహెచ్‌డీ చేశాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటేనే ఇంతవరకూ రాగలిగా. 2020లో జేమ్స్‌ వెబ్‌టీమ్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆస్ట్రానమీ (ఆరా) ఆస్ట్రానమర్‌గా అడుగుపెట్టాను. ఈ టెలిస్కోప్‌ కోసం పనిచేస్తూనే... నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై విడిగా పరిశోధనలు చేస్తున్నా. వీలు దొరికినప్పుడల్లా బిహార్‌ వంటి ప్రాంతాల్లోని ఆడపిల్లలకు సైన్స్‌ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటాను. నిజానికి లండన్‌ వంటి ప్రాంతాల్లోనూ సైన్స్‌లో రాణించే ఆడపిల్లలు తక్కువే. అందుకే అక్కడా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటా’ అంటోంది నిమిష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్