...అందుకే పిల్లలు వద్దనుకున్నాం!

‘అందరూ నా పిల్లలే’.. అనుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. కానీ సొంత పిల్లలని వద్దునుకొనేంత త్యాగం చేయాలంటే ఎంత విశాల దృక్పథం ఉండాలి? తోటివారికి సేవ చేయడం కోసం ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న నడింపల్లి యమునాపాఠక్‌ తను అనుకున్న దారిలో ఎంతవరకూ విజయవంతమయ్యారో చూద్దాం...నన్ను, తమ్ముడిని పోషించడం కోసం అమ్మ రాణీ పద్మావతి... పడిన కష్టాలు

Updated : 15 Jul 2022 07:31 IST

‘అందరూ నా పిల్లలే’.. అనుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. కానీ సొంత పిల్లలని వద్దునుకొనేంత త్యాగం చేయాలంటే ఎంత విశాల దృక్పథం ఉండాలి? తోటివారికి సేవ చేయడం కోసం ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న నడింపల్లి యమునాపాఠక్‌ తను అనుకున్న దారిలో ఎంతవరకూ విజయవంతమయ్యారో చూద్దాం...

న్ను, తమ్ముడిని పోషించడం కోసం అమ్మ రాణీ పద్మావతి... పడిన కష్టాలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. దీనికి తోడు పదకొండేళ్ల వయసులో చదివిన భగవద్గీత నన్ను ఆధ్యాత్మిక, సేవా మార్గాలవైపు నడిపించింది. ఆ పుస్తకం నన్ను ఎంతగా మార్చిందంటే.. ఒంటిపై నగలన్నీ తీసేసి కాషాయ దుస్తులు ధరించి, సన్యాసం తీసుకుందామా అన్నంతగా. నేనెక్కడికైనా వెళ్లిపోతానేమోనని అమ్మ భయపడేది. అలా చేయలేదు కానీ పెళ్లి, పిల్లలు వద్దనుకున్నా. అమ్మ నాకిచ్చిన పాకెట్‌మనీ నుంచే కొంత తీసి... బడి నుంచి వస్తూ వస్తూ అనాథాశ్రమంలో ఉండేవారికి అరటిపండ్లు కొనిచ్చేదాన్ని. అలా ఓసారి అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు నా చేత్తో అక్కడి పిల్లలకి అన్నం తినిపిద్దామనుకుంటే అక్కడున్న ఆయా వద్దని అంది. ఎందుకు? అని అడిగితే ‘ఈరోజు మీరు తినిపిస్తారు సరే... తర్వాత వాళ్లకి ఎవరు తినిపిస్తారు? ఇలా ప్రేమకు అలవాటు పడితే కష్టం. వాళ్లు అనాథలు, అలానే పెరగాలి’ అంది. ఆ మాటల ప్రభావంతో పెళ్లేకాదు.. పిల్లలు కూడా వద్దనుకున్నా. అంతకంటే ముందు ఓ ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఇవన్నీ చూసి ఈ నిర్ణయాలకు వచ్చా. కానీ విధి మరోలా తలిచింది. మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌లో ఇంటర్మీడియెట్‌ చదివాక 19ఏళ్లప్పుడు నాకో పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లికొడుకు బిహార్‌కు చెందిన ప్రవీణ్‌ పాఠక్‌. ఆర్మీ కుటుంబానికి చెందిన వ్యక్తి. మా కుటుంబానికి ఉన్నట్టుగానే వాళ్లకీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది. అవన్నీ నచ్చినా.. చదువు, పెళ్లి, పిల్లల పట్ల నా అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పాను. వాటికి అంగీకరించడంతో... వివాహబంధంలోకి అడుగుపెట్టాను. అలా యమునా పాఠక్‌ అయ్యాను. పెళ్లి తర్వాత బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో సైకాలజీ డిగ్రీ పూర్తి చేశా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో మెడికల్‌ అండ్‌ సైకియాట్రిక్‌ సోషల్‌వర్క్‌లో పీజీ చేసి యూనివర్శిటీ టాపర్‌గా నిలిచా. ప్రస్తుతం జిరియాట్రిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా.

వాళ్లకోసం...

పాఠశాల బయట ఎవరైనా ఆకలితో ఉన్న పిల్లలు కనిపిస్తే నా టిఫిన్‌ బాక్స్‌ వాళ్లకు ఇచ్చేసేదాన్ని. పెద్దయ్యాక మాత్రం అలాంటివారిని ఎలా వదిలేయగలను? మాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని చెప్పానుకదా.. తాతయ్య డాక్టర్‌ దత్తు భూగోళ శాస్త్రవేత్తగా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరందరి ప్రభావం నాపై ఉండేది. అందుకే దుబాయిలో వ్యాపార రంగంలో స్థిరపడే అవకాశం వచ్చినా సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతో అన్నిట్నీ వదులుకొని ఇక్కడకు వచ్చేశా. విద్యా, వైద్యం, ఉపాధి, మహిళ హక్కులు, సాధికారతే లక్ష్యంగా పనిచేయాలనుకున్నా. అందుకే ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా వెంటనే అక్కడకు చేరుకోవడం వాళ్లకి దుస్తులు అవసరమైన సాయం అందించడం మొదలుపెట్టా. గ్లోబల్‌ ఏంజెల్స్‌ జై ఛారిటబుల్‌ ట్రస్టుని స్థాపించి గ్రామాలకు శుద్ధి చేసిన మంచి నీటిని అందించేదాన్ని. అసోం, నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, దిల్లీ కేంద్రంగా... హెచ్‌ఐవీ, యువ పారిశ్రామికవేత్తల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై పని చేశా. ప్రస్తుతం నేను నివసిస్తున్న మల్కాజ్‌గిరి ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ‘సాహసి’ పేరుతో మల్కాజ్‌గిరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ అందిస్తున్నా. ఐదేళ్ల కిందట ప్రారంభించి.. ఇప్పటి వరకు 8వేల మందికిపైగా శిక్షణను ఇప్పించా. ‘అభయ యజ్ఞ’ పేరుతో మల్కాజ్‌గిరిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, సంక్షేమ పాఠశాలలకు సురక్షిత మంచి నీటిని అందిస్తున్నాం. ‘సఫలం’ పేరుతో వయసుమళ్లిన వారికి ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్‌లు చేయించి కళ్లద్దాలను ఉచితంగా అందజేస్తున్నా. మహిళలకు స్వయం ఉపాధిలో ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు పోషకాహారం, మానసిక, శారీరక ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తూ పేద మహిళలకు సామూహిక సీమంతాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 700 మందికి సీమంతాలు చేశాం. ప్రతి సంవత్సరం నవంబర్‌ 17న  క్షేత్రస్థాయిలో పనిచేసే అన్నిరంగాల్లో మహిళలకు ‘సేవాదురిణి’ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. నాకు పిల్లలు లేకపోయినా... 296 మంది ఆడ పిల్లలను సొంతపిల్లలుగానే భావించి ప్రైవేటు పాఠశాలల్లో చదివించా. దళిత అమ్మాయిలకూ కన్యాదానం చేస్తున్నాం. ఇదంతా చేయడానికి.. దాతలు ఇచ్చిన విరాళాలు సహకరిస్తున్నాయి. అలాగే నేనూ, మా వారు వ్యాపారరంగంలో ఉన్నాం. ఆ ఆదాయాన్ని ఇందుకు వాడుతున్నాం. ఈ క్రమంలో ఎన్నో పురస్కారాలు వరించినా... సేవలోనే నాకు తృప్తి. 

- జ్యోతి కిరణ్‌, ఈటీవీ హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్