నాన్న మరణం ఆలోచింపజేసింది...

తండ్రికి సోకిన క్యాన్సర్‌కు రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలూ కారణమని తెలుసుకుంది తను.  తన తండ్రిలా మరెవరూ  వాటి బారిన పడకుండా ఉండాలని నిర్ణయించుకుంది. సేంద్రియ ఉత్పత్తులను చేసి విక్రయించడం మొదలుపెట్టింది. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికెదిగిందీమె.

Updated : 15 Jul 2022 09:11 IST

తండ్రికి సోకిన క్యాన్సర్‌కు రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలూ కారణమని తెలుసుకుంది తను.  తన తండ్రిలా మరెవరూ  వాటి బారిన పడకుండా ఉండాలని నిర్ణయించుకుంది. సేంద్రియ ఉత్పత్తులను చేసి విక్రయించడం మొదలుపెట్టింది. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికెదిగిందీమె. ఇంటర్‌ మాత్రమే చదివిన ఫ్రాన్సీ జోషిమోన్‌ స్ఫూర్తి కథనమిది.

ఫ్రాన్సీ వాళ్లది కేరళలోని త్రిశూర్‌ జిల్లా కరళాం గ్రామం. తండ్రి చిరు వ్యాపారి. ఇంటర్‌ వరకే చదువుకున్న ఈమె తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. నాలుగేళ్లక్రితం అకస్మాత్తుగా ఆయనకు సుస్తీ చేసింది. పరీక్షల్లో క్యాన్సర్‌గా తేలింది. కారణాలేమై ఉంటాయని వైద్యులను అడిగితే, తీసుకున్న ఆహారం, కూరగాయల సాగులో వినియోగించిన రసాయనాలు వంటివన్నీ కావొచ్చన్నారు. ఇవన్నీ ఆయనలో రోగనిరోధక శక్తిని పూర్తిగా నశించిపోయేలా చేశాయన్నారు. చికిత్సతో పాటు సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారాన్ని తండ్రికి అందించడం మొదలు పెట్టింది ఫ్రాన్సీ. అయినా క్యాన్సర్‌ ముదిరిపోయింది. కొద్ది రోజులకే చనిపోయాడాయన.

పోషక విలువలుండేలా..

తండ్రి దూరమయ్యాడనే వేదన ఫ్రాన్సీని ఆలోచనలో పడేసింది. రసాయనాలు, పురుగుల మందుల వాడకం పెరిగిన నేపథ్యంలో సహజసిద్ధ పంటలే కరవయ్యాయని బాధపడింది ఫ్రాన్సీ. ‘నాన్న చనిపోయాక... ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలనిపించింది. అనారోగ్యాలను తెచ్చిపెట్టే రసాయనాలతో కూడిన ఆహారానికి బదులుగా పోషక విలువలుండే సేంద్రియ పదార్థాల్ని అందించాలనిపించింది. నేను ఇంటర్‌ వరకే చదువుకున్నా. అందుకే నా పరిధిలో ఫుడ్స్‌ తయారీ ప్రారంభించాలనుకున్నా. అలా కెమికల్‌ ఫ్రీ, ఆర్గానిక్‌గా 2019లో ‘మిన్నస్‌ ఫ్రెష్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌’ను ఇంట్లోనే మొదలు పెట్టా. చుట్టుపక్కలవాళ్లకు అందించి వారి నుంచి మంచి స్పందన వచ్చింది. తయారీ యూనిట్‌ను ప్రారంభించడానికి బ్యాంకు రుణం తీసుకొన్నా. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారాన్ని కూడా అందుకొని, పనస, కర్రపెండలం, అరటి కాయ పుట్టు మిక్స్‌, పనస రాగి మిక్స్‌తోపాటు పనస మిక్స్‌ వీట్‌ పౌడర్‌ తయారుచేస్తున్నా. రాగి మొలకలతో బేబీ ఫుడ్స్‌ సహా కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాలా వంటివీ చేస్తున్నాం. పనసతో చేసే మా పొడులకు మార్కెట్లో బాగా గిరాకీ ఉంది. ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే పనస మధుమేహాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్‌, హృద్రోగంవంటి ప్రాణాంతకమైనవాటిని దరిచేరనివ్వదు’ అంటోన్న ఫ్రాన్సీ దగ్గర ఇప్పుడు దాదాపు 20మందికిపైగా మహిళలు పని చేస్తున్నారు. స్థానిక రైతుల సహకారంతో సహజ సిద్ధంగా పండించే వాటితోనే ఈ ఉత్పత్తులన్నీ తయారు చేస్తోందావిడ. అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉందంటుంది ఫ్రాన్సీ. అంతే కాదు... ఇప్పుడు తనో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. నెలకు లక్షల రూపాయల ఆదాయాన్నీ సంపాదిస్తోంది. తన ఉత్పత్తులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ మార్కెట్స్‌, హైపర్‌ మార్కెట్స్‌లోనే కాకుండా ప్రభుత్వ అవుట్‌ లెట్స్‌లోనూ లభ్యమవుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ఇన్నోవేషన్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారమూ దక్కడం విశేషం. ఒక సాధారణ యువతి విజయగాథ అసాధారణంగా ఉంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్