పరీక్షలు.. గట్టెక్కిస్తోంది!

‘సమాజానికి తిరిగిచ్చేయాలి..’ ఒక హిట్‌ సినిమా డైలాగ్‌ ఇది! దాన్ని నిజ జీవితంలో తు.చ. తప్పకుండా పాటిస్తోంది పుష్ప ప్రీయ. కష్టాల్లో ఉన్నప్పుడు ఓ స్నేహితుడి నుంచి అందిన సాయం.. ఆమెకు ప్రేరణ గా నిలిచింది. అదే ఇప్పుడామెను వేల మందికి కళ్లు, చేతులు అయ్యేలా చేసింది. ఎలా అంటారా....

Updated : 17 Jul 2022 09:03 IST

‘సమాజానికి తిరిగిచ్చేయాలి..’ ఒక హిట్‌ సినిమా డైలాగ్‌ ఇది! దాన్ని నిజ జీవితంలో తు.చ. తప్పకుండా పాటిస్తోంది పుష్ప ప్రీయ. కష్టాల్లో ఉన్నప్పుడు ఓ స్నేహితుడి నుంచి అందిన సాయం.. ఆమెకు ప్రేరణ గా నిలిచింది. అదే ఇప్పుడామెను వేల మందికి కళ్లు, చేతులు అయ్యేలా చేసింది. ఎలా అంటారా....

పరీక్ష హాలులోకి అడుగుపెట్టాలంటే తెలియని భయం, ఆందోళన, ఒళ్లంతా ముచ్చెమటలు.. పుష్ప ప్రీయకు ఇది ఏటా అనుభవమే. అయితే ఆమె రాసేది తన కోసం కాదు.. చూపులేని వారి కోసం. తనది కర్ణాటకలోని బెంగళూరు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. నాన్న కూలీ. తను ఏడో తరగతిలో ఉండగా ఆయన పక్షవాతంతో మంచాన పడ్డాడు. అమ్మ నాలుగిళ్లలో పనిచేసి ఇల్లు గడిపేది. తిండికే కష్టమంటే నాన్నకి మందులూ కావాలి. ఇక ఫీజులేం కడతారు? అన్నయ్యతో పాటు తనూ చదువు మానేసింది. ఓ ఏడాది ఇంట్లోనే నాన్నను కనిపెట్టుకొని ఉంది. వాళ్లనలా చూడలేక ఓ స్నేహితుడు సాయానికి ముందుకొచ్చాడు. అతనికి పోలియో. అప్పుడే నిశ్చయించుకుంది ప్రీయ పెద్దయ్యాక ఇతరులకు సాయపడాలని.
పదో తరగతి తర్వాత పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది. కంప్యూటర్స్‌లో డిప్లొమా, దూరవిద్య ద్వారా పీజీ చేసింది. 2007.. అప్పటికి తన వయసు 19. వాళ్లింటికి దగ్గర్లోనే అంధుల కోసం పనిచేసే ఓ ఎన్‌జీఓ ఉంది. ఓ పదో తరగతి అమ్మాయికి పరీక్ష రాసేవాళ్లు లేరని ఆ సంస్థలో పనిచేసే అతను సాయం అడిగాడు. ‘నిస్సహాయత అంటే ఏంటో నాకు తెలుసు. అంధులను, వృద్ధులను రోడ్డు దాటించడం, ఉన్నదాంట్లో సాయం చేయడం లాంటివి నాకలవాటే. పరీక్షల విషయంలోనూ చేయొచ్చని అప్పుడే విన్నా. ఆ అమ్మాయి చెప్పేది అర్థం చేసుకొని రాయడం ఇబ్బంది అయ్యింది. కానీ పూర్తయ్యాక ఆమె సంతోషం ముందు అదేమీ కష్టమనిపించలేదు. తర్వాత వాళ్లకి చదువుపరంగా సాయమందించడం మొదలుపెట్టా. వాళ్లు చదివే, రాసుకునే విధానం గమనించడం.. నోట్స్‌ సిద్ధం చేసివ్వడం వంటివి చేసేదాన్ని. తర్వాత మరెవరికో పరీక్ష రాసి పెట్టింది. అలా అలా కొనసాగుతూ ఏటా 50-60 పరీక్షలు రాస్తున్నా’ అని చెప్పే ప్రీయ ఇలా 1000కిపైగా పరీక్షలు రాసింది.

వికలాంగులు, బధిరులు, డౌన్‌ సిండ్రోమ్‌ ఉన్నవారికీ సాయం చేస్తోంది. సైగల భాషా నేర్చుకొంది. యాసిడ్‌ బాధితుల కోసం కూడా పని చేస్తున్న తను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఉద్యోగానికి సెలవు పెట్టిమరీ ఈ సాయం కొనసాగిస్తోంది. ఈమె సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులూ దక్కాయి. కేంద్రప్రభుత్వం 2018లో నారీశక్తి పురస్కారం అందించింది. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్న 73 మందిని ఎంపిక చేసి వారి జీవితాల్ని డాక్యుమెంటరీగా తీసింది. వారిలో ప్రీయ ఒకరు. తను వారంలో మూడు గంటల చొప్పున మురికి వాడలు, కొండ ప్రాంతాల్లోని తెగల పిల్లలకు పాఠాలు బోధిస్తుంది. రక్తం అవసరమైన వారికోసం సామాజిక మాధ్యమాల్లో ఒక పేజీనీ నిర్వహిస్తోంది. టెడెక్స్‌ స్పీకర్‌ కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్