వాళ్ల ఉపాధి కోసం.. ఉద్యోగం మానేశా!

మాది తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా, ములుగుపల్లి. నాన్న పరుచూరి లక్ష్మీ నారాయణ, అమ్మ లక్ష్మీ కుమారి. వ్యవసాయ కుటుంబం. అక్క, నేనూ ఇద్దరమే పిల్లలం. చెన్నైలోని ఎంజీఆర్‌ కాలేజీలో బీఫార్మసీ చేశా. ఇంటర్న్‌షిప్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్లో ఉండేదాన్ని. దగ్గర్లోనే అంధుల స్కూల్‌, హాస్టల్‌ ఉండేవి. వాళ్లతో మాట కలిపినపుడు టెక్స్ట్‌ బుక్స్‌, నోట్సులు బ్రెయిలీలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు....

Updated : 18 Jul 2022 08:04 IST

డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన జ్యోతి... తన కంటే అంధుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేది. ‘మనం ఏదో ఒక పనిచేసుకుంటాం.. అంధులకు సరైన ఉపాధి లేకపోతే వారి జీవితం ఏమవుతుందో’ అనుకునేది. అంతటితో ఆగిపోలేదు, ఓ ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటుచేసి వారి ఉన్నత చదువులూ, ఉద్యోగ సాధన కోసం చేయూతనందిస్తోంది. అలా ఎందరో ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయపడింది. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

మాది తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా, ములుగుపల్లి. నాన్న పరుచూరి లక్ష్మీ నారాయణ, అమ్మ లక్ష్మీ కుమారి. వ్యవసాయ కుటుంబం. అక్క, నేనూ ఇద్దరమే పిల్లలం. చెన్నైలోని ఎంజీఆర్‌ కాలేజీలో బీఫార్మసీ చేశా. ఇంటర్న్‌షిప్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్లో ఉండేదాన్ని. దగ్గర్లోనే అంధుల స్కూల్‌, హాస్టల్‌ ఉండేవి. వాళ్లతో మాట కలిపినపుడు టెక్స్ట్‌ బుక్స్‌, నోట్సులు బ్రెయిలీలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. దాంతో స్నేహితుల్లో కొందరం వాళ్లకి పాఠాల్ని రికార్డ్‌ చేసి వినిపించేవాళ్లం. పరీక్షలకి స్క్రైబ్‌లుగానూ వెళ్లేవాళ్లం. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌లోనే ఫార్మసిస్ట్‌గా ఉద్యోగంలో చేరా.

స్నేహితురాలి సాయంతో..

అంధులకు 18 ఏళ్లు వచ్చే వరకే ప్రభుత్వ వసతి ఉంటుంది. తర్వాత సొంతంగా ఉండాలి. నిజానికి అప్పటికి వాళ్లింకా చదువుతుంటారు. అప్పుడే వారికి చేయూత కావాలి. అమ్మాయిలకైతే ఆ కష్టాలు ఇంకా ఎక్కువ. వాళ్ల పరిస్థితి చూసి ఏదైనా చేయాలనిపించి.. స్నేహితురాలితో కలిసి 2007లో ‘స్ఫూర్తిజ్యోతి’ ఫౌండేషన్‌ ప్రారంభించా. సరూర్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఏడుగురు అమ్మాయిలు ఉండేందుకు ఏర్పాట్లు చేశాం. వాళ్లు ఇంటర్‌, డిగ్రీ చదివేవాళ్లు. కొందరిది దాదాపు మా వయసే. ఇంట్లో విషయం తెలిసి ‘ఎందుకీ కష్టాలు. ఉద్యోగంలో స్థిరపడు. చేతనైన ఆర్థిక సాయం చెయ్యు’ అనేవారు. కానీ వాళ్లకి ఇలా సాయపడటంలోనే సంతృప్తి అని చెప్పా. ఓసారి హైదరాబాద్‌ వచ్చి ఇంటిని చూసి చివరకు అంగీకరించారు. సరూర్‌నగర్‌లోని ఆ ఇంట్లోనే నాలుగేళ్లపాటు ఉన్నాం. ఆశ్రయం కోరేవాళ్ల సంఖ్య పెరుగుతుండేది. అలాంటప్పుడు స్వాతంత్ర సమరయోధుడు చిన్న రంగారెడ్డిగారి గురించి తెలిసింది. మా పరిస్థితి వివరించాం. అప్పటికే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర్లో ‘మాతాపితరుల సేవా సదన్‌’ ఆశ్రమం ఏర్పాటుచేసి వృద్ధులకు సేవలు అందిస్తున్నారాయన. ఆ పక్కనే చిన్న రేకుల ఇల్లు ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఇక్కడకు వచ్చాక మగవాళ్లనీ చేర్చుకుని వేరే ఇంట్లో ఉంచేవాళ్లం. తర్వాత ఉద్యోగం వదిలి పూర్తిగా ఆశ్రమం మీదే దృష్టిపెట్టా.

యువతకు శిక్షణ..

18 నుంచి 25 ఏళ్ల మధ్యవారినే ఆశ్రమంలో చేర్చుకుంటాం. ఇంటర్‌ డిగ్రీ, పీజీ చదువుకీ, స్వయం ఉపాధికీ, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవ్వడంలో సాయపడతాం. దేశంలో ఎక్కడివారైనా చేరొచ్చు. ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఝార్ఖండ్‌ నుంచి వచ్చినవాళ్లూ ఉన్నారు. సేవలు పూర్తిగా ఉచితం కావడం, పోటీ పరీక్షలూ, స్వయం ఉపాధిలో శిక్షణ ఉండటంవల్ల ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. విద్యార్థులను ఇక్కడి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చేర్చుతాం. బ్రెయిలీలో టైపింగ్‌, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, కంప్యూటర్‌ కోర్సులు, బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు శిక్షణనీ ఇప్పిస్తాం. ఇంకా కాగితం ప్లేట్లూ, సుద్దముక్కల తయారీతోపాటు వారి సామర్థ్యాలను అనుసరించి మిమిక్రీ, సంగీతం, పాటలు.. వీటిలోనూ శిక్షణ ఇస్తాం. వీరిలో పలువురు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చూపుతూ రవీంద్రభారతితో సహా పలు వేదికలమీద ప్రదర్శనలు ఇచ్చారు. ఇక్కడ చదువుకున్నవాళ్లలో 50 మంది వరకూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్వయం ఉపాధి, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు 100 మందికిపైనే. ముగ్గురు బోధన సిబ్బంది సహా ఆరుగురు పనిచేస్తారు. ఫౌండేషన్‌ నిర్వహణకు నెలకు దాదాపు రెండు లక్షలు ఖర్చవుతోంది. దాతల సాయంతో నడిపిస్తున్నాం. కొండవీటి రాధాకృష్ణ, హనుమంతరావు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఉమాపతి, రామకృష్ణ మఠం ఇన్‌ఛార్జి శీతకంఠనందా, మనోహర్‌, సీఏ శ్రీనివాస్‌.. ఇలా ఎందరో అండగా నిలిచారు.  ఒక్కోసారి ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితులూ ఎదురవుతాయి. అయినా విద్యార్థులకు ఏలోటూ లేకుండా చూస్తా. మావారు రాజు, కాంట్రాక్టర్‌. మాకో నాలుగేళ్ల పాప. మావారూ ఆర్థికంగా ఫౌండేషన్‌కు సాయపడతారు. మరింత మంది అంధులకు చేయూతనివ్వడంతోపాటు  వారికి అవసరమయ్యే కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, బ్రెయిలీ ప్రెస్‌ ఏర్పాటులాంటి లక్ష్యాలున్నాయి.  

- నర్సింగ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఇబ్రహీంపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్