వేల మంది గృహిణులను వ్యాపారవేత్తలను చేస్తున్నా

గృహిణులంటే చాలామందికి చిన్నచూపే! కానీ ఇంటిని నడిపించాలంటే ఎన్ని నైపుణ్యాలుండాలో తెలిసిన వాళ్లు అలా అనుకోరు. మరి అలాంటి గృహిణులకు అవకాశాలిస్తే కదా వాళ్లేంటో తెలిసేది! ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టారు నిష్ఠా యోగేష్‌. శిక్షణనిచ్చి వేలమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు!

Updated : 23 Jul 2022 07:42 IST

గృహిణులంటే చాలామందికి చిన్నచూపే! కానీ ఇంటిని నడిపించాలంటే ఎన్ని నైపుణ్యాలుండాలో తెలిసిన వాళ్లు అలా అనుకోరు. మరి అలాంటి గృహిణులకు అవకాశాలిస్తే కదా వాళ్లేంటో తెలిసేది! ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టారు నిష్ఠా యోగేష్‌. శిక్షణనిచ్చి వేలమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు! తను ఎంచుకున్న మార్గం, దాని ఫలితాలను వసుంధరతో పంచుకున్నారు...


* సంధ్య దాట్ల.. గృహిణి. రైతుతో వివాహమైంది. తనకేమో వ్యవసాయమంటే ఆసక్తి లేదు. సొంతంగా ఏదైనా చేయాలనుకున్న ఆమె మాతో కలిసింది. ఇప్పుడు ఇకత్‌తో వస్త్రాలు, నగలు డిజైన్‌ చేసి, ఆదాయం పొందుతోంది.


* నమ్రత వైద్యురాలు. చిన్నతనం నుంచీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలని కోరిక. వైద్య విద్య చదవడం పూర్తవగానే ప్రాక్టీస్‌.. వెళ్లి నేర్చుకునే సమయమేది? మా గురించి తెలిసి సంప్రదించింది. సొంత వ్యాపారం ‘ఎత్నిక్‌ క్లోసెట్‌’ను ప్రారంభించి తన కలలు నెరవేర్చుకోవడమే కాదు మరికొందరికి ఉపాధినీ కల్పిస్తోంది.


‘హునర్‌’ ద్వారా మేం సాధిస్తున్న ఇలాంటి విజయాలెన్నో!


‘మేం చేయగలం’ అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం గృహిణుల్లో తక్కువ. కానీ మహిళలు ఒకే సమయంలో ఎన్నో పనులను చక్కబెట్టేయగలరు. మానవ వనరుల నిర్వహణ, సమయపాలన, సృజనాత్మకత, బడ్జెట్‌ నిర్వహణ వంటి ఎన్నో నైపుణ్యాలు మన సొంతం. కొరవడుతోందల్లా మనపై మనకు నమ్మకమే. దాన్నీ దాటి అడుగు ముందుకు వేయండి.. అవకాశాలు బోలెడు.


మాది హైదరాబాద్‌. నాన్న పంజాబీ, అమ్మది ఆంధ్రా. ఇద్దరూ వ్యాపారులే. ఒకచోట చేరామంటే వ్యాపార చర్చలే. నా చిన్నతనంలో అమ్మ చుట్టుపక్కల ఆడవాళ్లకి దుస్తుల డిజైనింగ్‌ నేర్పించేది. తర్వాత వాళ్లు ఇంటి నుంచే సంపాదించుకోవడం, బొటిక్‌లు నిర్వహించుకోవడం చేసేవారు. అది చూసినప్పుడు గర్వంగా ఉండేది. ఈ అవకాశం దేశవ్యాప్తంగా మహిళలందరికీ అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించేది. నేను సీఏ చదివా. మూడేళ్లు ఉద్యోగమూ చేశా. తర్వాత అమెరికాలోని బోస్టన్‌ కాలేజ్‌ నుంచి ఎంబీఏ- ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ పూర్తిచేశా. మన దేశానికి తిరిగొచ్చాక ఏం చేయాలి అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఒక్కటే! ‘మహిళలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహించడం’. ఎంతో ప్రతిభ, నైపుణ్యాలు ఉండీ వంట గదికే పరిమితమవుతున్న వాళ్లెందరో. వాళ్లకి తగిన నైపుణ్యాలు అందించాలనుకున్నా.

30 రకాలు..

ఆలోచన సరే! ఏమివ్వాలి? కొనసాగించేలా ఎలా చేయాలి.. ఇలా ఎన్నో ప్రశ్నలు. దీనికి ఆన్‌లైనే సరైన వేదికనిపించింది. నా ఆలోచనను స్నేహితులతో, ఇతర మాధ్యమాల్లో పంచుకున్నా. చాలామంది చేయి కలిపారు. వాళ్లలో బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, సేల్స్‌, టెక్నాలజీ.. ఇలా వివిధ విభాగాల నిపుణులు ఉన్నారు. 80% మంది మహిళలే. దేశంలోని ప్రధాన నగరాలను ఎంచుకొని పదింటికి వెళ్లాం. అక్కడి మహిళలతో మాట్లాడాం. 2000కుపైగా గ్రామీణ మహిళలతో సర్వే నిర్వహించాం. వాళ్లేం కోరుకుంటున్నారు? ఆసక్తులు.. ఇలా బోలెడు అంశాల్లో పరిశోధన చేశాక ఆ సమాచారమంతా క్రోడీకరించాం. తర్వాత నిపుణులను కలిసి కోర్సులు, బోధన విధానం, బోధనా నిపుణుల ఎంపిక వంటివన్నీ చేసి, 2018లో ‘హునర్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌’ ప్రారంభించా. ఇక్కడ అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా సహా ఎంతోమంది నిపుణులు సూచనలిస్తారు. మా ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను మహిళలు తమకు నచ్చిన వేళల్లో నేర్చుకునేలా రూపొందించాం. ఫ్యాషన్‌, బ్యూటీ, ఆహారం, స్టైలింగ్‌, ఎంబ్రాయిడరీ, జ్యువెల్లరీ డిజైనింగ్‌.. మొత్తం 30 రకాల కోర్సులున్నాయి. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, బెంగాలీ.. పలు భాషల్లోనూ, యాప్‌ రూపంలోనూ అందుబాటులోకి తెచ్చాం. కనీస చదువు, ఎంచుకున్న భాషలో మాట్లాడగల వారెవరైనా చేరొచ్చు. అయితే నేర్చుకోవాలనుకునే వారు కొద్ది మొత్తం చెల్లించాలి. పూర్తయ్యాక సర్టిఫికెట్‌నీ అందిస్తాం.

మార్కెటింగ్‌, మెంటార్‌షిప్‌..

ఆన్‌లైన్‌లో అయితే ఎంతమందికి చేరుతుందో, ఎంతమంది ఉపయోగించుకోగలరో అన్న సందేహమూ ఉండేది. కానీ అనూహ్య స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచీ కూడా గృహిణులు సంప్రదించడం మొదలు పెట్టారు. దీనికితోడు కొవిడ్‌ మాకు కలిసొచ్చింది. బోధించడంపైనే దృష్టిపెట్టం. వారు నేర్చుకున్నవి తయారు చేసి అప్పుడప్పుడూ మాకు చూపెట్టాలి. లైవ్‌ లెర్నింగ్‌ ఉంటుంది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సెలబ్రిటీ మెంటార్లకు చూపించే అవకాశం ఉంటుంది. ఇవి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. 24 గంటలూ శిక్షకులు అందుబాటులో ఉంటారు. దీంతో ఏ సమయంలోనైనా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరమైన మెటీరియల్‌నూ ఇస్తాం. నేర్చుకున్న వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేలా మార్కెటింగ్‌ అవకాశాలు, మెంటార్‌షిప్‌ వంటి విషయాల్లోనూ సాయం అందిస్తున్నాం. దీనికోసం ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌నీ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ మూడు వేల మందికిపైగా తమ కాళ్లపై తాము నిలబడ్డారు. ‘ఫ్రీ ట్రయల్స్‌’నీ ప్రయత్నిస్తున్నవారు వేలల్లోనే. హునర్‌ని దేశంలోని ప్రతి గడపకూ తీసుకెళ్లడమే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్