షర్బత్‌తో కోట్ల వ్యాపారం!

ఇంట్లోవాళ్లంతా ఉద్యోగం చేయమంటే వ్యాపారవేత్తవుతానని చెప్పింది. లక్షల పెట్టుబడి పొం, ఏడాదిలోపే ఆస్తీ అమ్మాల్సివచ్చింది. విమర్శలు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొంటూనే ఇంట్లో శీతలపానీయాల తయారీ ప్రారంభించి, ఏడేళ్లలో

Updated : 10 Aug 2022 11:09 IST

ఇంట్లోవాళ్లంతా ఉద్యోగం చేయమంటే వ్యాపారవేత్తవుతానని చెప్పింది. అయితే ముందు నష్టాలే వెక్కిరించాయి. ఏడాదిలోపే ఆస్తీ అమ్మాల్సివచ్చింది. విమర్శలు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొంటూనే ఇంట్లో శీతలపానీయాల తయారీ ప్రారంభించి, ఏడేళ్లలో కోట్ల రూపాయల వార్షికాదాయాన్ని అందుకునే స్థాయికెదిగింది. ఆసక్తి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అంటున్న లలిత సంజయ్‌ ఖెయిరే స్ఫూర్తి కథనమిది.

దువు పూర్తయిన తర్వాత సంజయ్‌ ఖెయిరేతో లలితకు వివాహమైంది. పుణెకు చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలనే కల. అత్తింటిలో పరిస్థితేమో ఇందుకు విరుద్ధం. ఉద్యోగం చేసి నెల పూర్తయ్యేసరికి జీతం తీసుకుంటే చాలనేది అత్తామామల అభిప్రాయం. తనేమో సొంతంగా వ్యాపారమే చేస్తానని పట్టుబట్టింది. రెండేళ్ల తర్వాత భర్త ప్రోత్సాహంతో పుట్టగొడుగుల పెంపకంలోకి అడుగుపెట్టింది. లాభాలమాట అటుంచి, కనీసం పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఇక తనకు తెలిసిందేదైనా చేయాలనుకొని టొమాటో కెచప్‌ టూటీ-ఫ్రూటీ తయారీ మొదలుపెట్టింది. దీనికోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టింది. తిరిగి నష్టమొచ్చింది. అప్పులు తీర్చడానికి ఉంటున్న ఇంటినే అమ్మాల్సి వచ్చింది. ఎలాగో అప్పులన్నీ తీర్చి, అద్దె ఇంటికి చేరుకుందామె కుటుంబం.

సాధిస్తానని..

ఓవైపు వ్యాపార నష్టం.. ఏదైనా ఉద్యోగం చూసుకో అంటూ ఇంట్లోవాళ్ల ఒత్తిడి తనను బాధపెట్టేవి అంటుంది లలిత. ‘నీకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంది. అనుకున్నది సాధిస్తావు. అయితే సమయం కలిసి రావడం లేదు’ అని మావారు ఓదార్చేవారు. ఈసారి ఏదైనా శీతలపానీయం తయారీ ప్రారంభించాలని ఆలోచించా. రకరకాల ప్రయోగాల తర్వాత 1995లో ‘కోకమ్‌ షర్బత్‌’ మొదలుపెట్టాం. అదే ఏడాది నేను రెండోసారి గర్భందాల్చా. నేను ప్రసవించేసరికి ఈ వ్యాపారం కూడా అటకెక్కింది. ఈ పానీయానికి చాలా ఆర్డర్లు వచ్చేవి. దీంతోపాటు టొమాటో కెచప్‌ తయారీ  కూడా మొదలుపెట్టాం. అంతా బాగానే ఉందనుకున్నాం. వ్యాపారానికి కొత్తకావడంతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయలేకపోయాం. ఈసారి నష్టం మాకు కొత్త పాఠాలను నేర్పింది. అయితే కోకమ్‌ పానీయం వల్ల చాలా ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. అసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు దీన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనాన్ని పొందొచ్చు. ఈ ఉత్పత్తిని వినియోగదారుడికి చేర్చడమే కాదు, నగదు వసూళ్ల విషయంలో ఎక్కడ తడబడుతున్నామో గుర్తించడానికి ప్రయత్నించాం’ అని చెబుతుంది లలిత.

పడిలేచి..

మొదటి ఏడాది నష్టం వచ్చినా, రెండో ఏడాది తిరిగి తయారీ ప్రారంభించింది లలిత. మరోసారి ప్రయత్నించి చూద్దాం అనుకుంటూ, తయారుచేసిన ఈ ఉత్పత్తికి ఈసారి కూడా సేల్స్‌ వచ్చాయి. గత పాఠాలతో వినియోగదారుల నుంచి నగదు తీసుకున్న తర్వాతే ఉత్పత్తులను అందించేవారు. మొదటిసారి రూ.20వేలు ఆదాయం వచ్చింది. మూడో ఏడాదిలో లాభాలు మొదలయ్యాయి. అలా ఈ ఏడేళ్లలో రోజుకి 12 టన్నులకు పైగా కోకమ్‌ పానీయం విక్రయం అవుతుండగా, వార్షికాదాయం రూ.2.5 కోట్లకు చేరింది. ఈ శీతలపానీయ తయారీ కేవలం ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మే వరకు మాత్రమే ఉంటుంది. ఈ నాలుగునెలలు తయారైన ఉత్పత్తి వెంటనే విక్రయమవుతుంది. దీన్ని ఏడాదంతా కొనసాగించాలనుకుంటోంది లలిత. ‘ఈ తయారీలో మొత్తం మహిళలే పనిచేస్తున్నారు. మా దగ్గర ప్రస్తుతం 40మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా మాకు డిస్ట్రిబ్యూటర్స్‌తోపాటు బిగ్‌బాస్కెట్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌, డి-మార్ట్‌, స్టార్‌ బజార్‌ ద్వారానూ మా ఉత్పత్తి విక్రయమవుతోంది’ అని అంటున్న ‘క్వీన్‌ ఆఫ్‌ కోకమ్‌’ 50 ఏళ్ల లలిత వ్యాపార ప్రయాణం స్ఫూర్తిదాయకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్