తన ‘పవర్‌’ ప్రపంచానికి చాటింది!

సంప్రదాయ నృత్యాన్ని పిల్లలకు నేర్పుతూ, భర్త సంపాదనకు తనూ కాస్త జోడిస్తున్నాననుకునే సగటు గృహిణి జయలక్ష్మి. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారినప్పుడు చక్కదిద్దడానికి ధైర్యంగా తనే రంగంలోకి దిగింది. వ్యాపారవేత్తగా మారింది. యూపీఎస్‌, బ్యాటరీలు, స్టెబిలైజర్లు, డీజిల్‌ జనరేటర్లు పంపిణీ చేస్తూ ఎన్నో బహుళ జాతి సంస్థలకు డీలర్‌గా ఎదిగింది. పాతికేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మంది ఖాతాదారులకు సేవలందించే స్థాయికి సంస్థను చేర్చిన జయలక్ష్మి ప్రస్థానాన్ని మీరూ చదవండి...

Published : 30 Jul 2022 00:33 IST

సంప్రదాయ నృత్యాన్ని పిల్లలకు నేర్పుతూ, భర్త సంపాదనకు తనూ కాస్త జోడిస్తున్నాననుకునే సగటు గృహిణి జయలక్ష్మి. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారినప్పుడు చక్కదిద్దడానికి ధైర్యంగా తనే రంగంలోకి దిగింది. వ్యాపారవేత్తగా మారింది. యూపీఎస్‌, బ్యాటరీలు, స్టెబిలైజర్లు, డీజిల్‌ జనరేటర్లు పంపిణీ చేస్తూ ఎన్నో బహుళ జాతి సంస్థలకు డీలర్‌గా ఎదిగింది. పాతికేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మంది ఖాతాదారులకు సేవలందించే స్థాయికి సంస్థను చేర్చిన జయలక్ష్మి ప్రస్థానాన్ని మీరూ చదవండి...

శాస్త్రీయ నృత్యంలో చిన్నప్పటి నుంచి శిక్షణ తీసుకున్న జయలక్ష్మి దాన్నే పిల్లలకు నేర్పుతూ ఉండేది. అదో ఆదాయ మార్గం కూడా తనకు. వీళ్లది బెంగళూరు. భర్త వెంకట నారాయణన్‌ ఓ గ్రానైటు సంస్థలో ఉద్యోగి. ఐఐటీలో చదవాలన్న తన కల ఎలాగూ తీరలేదు. కనీసం పిల్లలనైనా బాగా చదివించాలని అనుకునేది తను. ఇంటి అవసరాలతోపాటు ఇద్దరమ్మాయిల చదువులకు, ఇతరత్రా ఖర్చులు పెరగడం సంసారాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. తమిళనాడులోని సొంతూరు వెళ్లిపోదామన్నాడు భర్త. ఉన్న చోటే ఏదైనా సాధించాలి అనుకుందామె. ఇక తనే రంగంలోకి దిగాలనుకుంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌లో ఇంజినీరింగ్‌ చదివింది ఆవిడ. అంతకు ముందు ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్న సమయంలో ఇక ఆ అభ్యంతరాలేవీ లెక్కపెట్ట దలచుకోలేదు ఆవిడ. తను చదివిన ఎలక్ట్రికల్‌ రంగాన్నే ఎంచుకుంది. వ్యాపారంలో ఓనమాలు తెలియకపోయినా, మొండి ధైర్యంతో 1997లో ‘యూనివర్స్‌ పవర్‌ సిస్టమ్స్‌’ ప్రారంభించింది. యూపీఎస్‌ బ్యాటరీల పంపిణీతో మొదలుపెట్టింది. ప్రయత్నిస్తే తప్పేముంది అనుకుంటూ.. భారీ సంస్థల డీలర్‌షిప్‌ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ధైర్యంగానే..

మా సంస్థ సేవల గురించి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు ధైర్యంగా ఫోన్‌ చేసే దాన్ని అని గుర్తు చేసుకుంటారు జయలక్ష్మి. ‘కేబుల్స్‌, వైర్లు ఇన్‌స్టాల్‌ చేస్తామని, బ్యాటరీలు అందిస్తామని అడిగే దాన్ని. వాళ్లు ఓకే అంటే నేను కూడా వెళ్లేదాన్ని. పని అయ్యాక మా సేవలు నచ్చితే వారి అభిప్రాయాన్ని రాసి ఇవ్వమనే దాన్ని. వాటిని మరో సంస్థకు వెళ్లినప్పుడు చూపించే దాన్ని. అలా మా సంస్థపై నమ్మకాన్ని పెంపొందించుకుని, మరిన్ని ఆర్డర్లు సంపాదించడానికి ఆ ప్రశంసా పత్రాలు పనికొచ్చేవి. నాకు రతన్‌ టాటా అంటే చాలా ఇష్టం. చాలా పెద్దది అని తెలిసి కూడా టాటా గ్రూపు సంస్థ ‘వెర్టివ్‌’కు వెళ్లా. అక్కడ చాలా ప్రశ్నలెదుర్కొన్నా. మీకు పెద్దగా వ్యాపార అనుభవం లేదు, దేన్ని చూసి అవకాశాన్నివ్వాలని ప్రశ్నించారు. నా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం, వేరే సంస్థలిచ్చిన ప్రశంసాపత్రాలు మాత్రమే. వాటినే చూపించి మాకు ఒక్క అవకాశం ఇమ్మన్నా. ఆ సంస్థ అంగీకరించదనే అనుకున్నా. ఊహించని విధంగా మమ్మల్ని డీలర్‌గా ఆ సంస్థ ఎంచుకుంది. అదే ఏడాది ఎల్జీ నుంచి కూడా ఆర్డర్లు అందుకోగలిగాం. అలా ఒక్కొక్క సంస్థకు వెళ్లి వాళ్లకు పవర్‌ సొల్యూషన్స్‌ సేవలను అందించడానికి ఆర్డర్ల కోసం ప్రయత్నించే దాన్ని. బ్యాటరీలతో ప్రారంభమైన మా సేవలు ఆన్‌లైన్‌ యూపీఎస్‌, స్టెబిలైజర్లు, హోం ఇన్‌వెర్టర్లు, డీజిల్‌ జనరేటర్లు, సర్వర్‌ ర్యాక్స్‌, డేటా సెంటర్‌ ప్రాజెక్ట్స్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్స్‌ వరకు విస్తరించుకోగలిగాం. ఎలక్ట్రానిక్‌ సంస్థల నుంచి మొదలై, ఆసుపత్రులు, హోటళ్లు, కార్పొరేట్‌ సంస్థలు, అపార్టుమెంట్స్‌ వరకు సేవలు అందించే స్థాయికెదిగాం. ఇప్పుడు కమ్మిన్స్‌, కిర్లోస్కర్‌, అమరాన్‌, ల్యూమినస్‌ ప్రాడక్ట్స్‌ వంటి బహుళ జాతి సంస్థలకూ డీలర్‌గా ఉన్నాం. టాటా గ్రూపులోని అంతర్జాతీయ సంస్థ వెర్టివ్‌తో బిజినెస్‌ పార్టనర్‌గా దేశంలో మేం మాత్రమే ఉన్నాం. బీఎఫ్‌ఎస్‌ఐ, ప్రభుత్వ ఆసుపత్రులు, పలు ప్రభుత్వ విభాగాలకూ డీలర్‌గా ఉన్నాం’ అని చెప్పుకొచ్చిందామె.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రస్తుతం ‘యూనివర్స్‌’ పేరుతో వైఫై రౌటర్లకు యూపీఎస్‌ను విడుదల చేయడానికి ‘యూనివర్స్‌ పవర్‌ సిస్టమ్స్‌’ సిద్ధంగా ఉంది. ఈ తరహా యూపీఎస్‌ అందిస్తున్న తొలి సంస్థగా ఇది పేటెంట్‌ తీసుకుంది. దీన్ని అమర్చుకుంటే విద్యుత్‌కు అంతరాయం కలిగినా దీని బ్యాక్‌అప్‌తో మరో మూడు గంటలు వైఫై పనిచేస్తుంది. అలాగే ఒక బటన్‌తోనే ఇంట్లో నీళ్లు లేదా కరెంట్‌ వినియోగాన్ని తెలిపే ఐఓటీ పరికరాన్ని జయలక్ష్మి రూపొందించింది. త్వరలోనే ఇదీ మార్కెట్‌లోకి రానుంది. ‘సంస్థ అభివృద్ధిలో ఎన్నో అడ్డంకులు, ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నాం. వాటినే అవకాశాలుగా మలచుకుని పెద్దస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం’ అనే జయలక్ష్మి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నృత్యాన్ని వదల్లేదు. ఎన్నో నృత్య కార్యక్రమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాదు, ‘యూనివర్స్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌’ పేరుతో కళాకారులకు చేయూతనూ అందిస్తోంది. ‘యూనివర్స్‌ పవర్‌ సిస్టమ్స్‌’ను విదేశాలకు విస్తరించడమే లక్ష్యమంటున్న 62 ఏళ్ల జయలక్ష్మి తనలాంటి మరెందరికో స్ఫూర్తిదాయకం కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్