చదువెందుకంటే.. సాధించి చూపెడుతోంది

అమ్మాయిలకు పెద్ద చదువులెందుకు? ఇల్లు చూసుకోవడం, పిల్లలకు నేర్పించుకునేంత జ్ఞానం ఉంటే సరిపోతుందన్నది ఇంట్లో వాళ్ల అభిప్రాయం. తనకేమో పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలని కోరిక. పెళ్లి, పిల్లల బాధ్యతల్లోకి వెళ్లినా..

Updated : 31 Jul 2022 09:28 IST

అమ్మాయిలకు పెద్ద చదువులెందుకు? ఇల్లు చూసుకోవడం, పిల్లలకు నేర్పించుకునేంత జ్ఞానం ఉంటే సరిపోతుందన్నది ఇంట్లో వాళ్ల అభిప్రాయం. తనకేమో పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలని కోరిక. పెళ్లి, పిల్లల బాధ్యతల్లోకి వెళ్లినా.. ఆమె కోరుకున్న మార్గాన్ని చేరుకున్నారు లక్ష్మీ శంకర్‌ అయ్యర్‌. ఆ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మీరూ చదవండి...

చదువు కోసం పోరాటం లక్ష్మికి చిన్న తరగతుల్లోనే మొదలైంది. అబ్బాయిలు సంపాదించాలి, అమ్మాయిలు ఇల్లు చూసుకోవాలన్న ఇంట్లో వాళ్ల ధోరణికి తను వ్యతిరేకం. బాగా చదివి నిరూపిస్తే కాదనలేరనుకున్నారావిడ. వీళ్లది బెంగళూరు. పదిలో టాపర్‌గా నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఫిజిక్స్‌లో డిగ్రీ చేసిన ఆమె అక్కడా గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఇంట్లోవాళ్ల సాయం లేకుండానే కొనసాగిస్తూ వచ్చా కదా.. ఇక ముందూ అంతే అనుకున్నారు. కానీ పైచదువులకు ఇంట్లో ఒప్పుకోలేదు. పెళ్లి చేసేశారు. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఇద్దరు మగపిల్లలు. ఇల్లు, పిల్లల పనే లోకమని కూర్చోలేదామె. ఆ బాధ్యతలు నెరవేరుస్తూనే టెక్నాలజీ సాయం తీసుకొని ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ వగైరా నేర్చుకుంటూ వచ్చారు. 11 ఏళ్ల తర్వాత వీళ్ల కుటుంబం భారత్‌కి తిరిగొచ్చింది. మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి కలిగి ఎంబీఏ, విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లలో కోర్సులతో పాటు పీహెచ్‌డీ కూడా చేశారు. బిజినెస్‌ అనలిటిక్స్‌కి ఆదరణ పెరుగుతోందని తెలిసి 40 ఏళ్ల వయసులో దాన్నీ నేర్చుకున్నారు.

‘అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు నన్నెప్పుడూ నిరాశలోకి నెట్టలేదు. ఇంకా నేర్చుకోవాలన్న తపనని పెంచాయి. ‘స్కిల్లింగ్‌’పై దృష్టిపెట్టా. ఎప్పటికప్పుడు విద్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని, నాకు నచ్చిన వాటిని నేర్చుకునేదాన్ని. అలా పీహెచ్‌డీ వరకూ పూర్తి చేయగలిగా. సంస్థల తీరు తెలుసుకోవడానికి మేనేజ్‌మెంట్‌ కోర్సులూ చేశా. ఒకప్పుడు పెళ్లి అడ్డు అనుకున్నా కానీ.. మావారు నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఉద్యోగంలోనూ చేరా. ఇక్కడా ఎన్నో సవాళ్లు. ‘చేయగలదా?’ అని సందేహించిన వారే. నేను మాత్రం వాటన్నింటినీ తప్పని నిరూపిస్తూ వెళ్లా. పైవాళ్లూ నా పట్టుదలను గమనించి, నాయకత్వ హోదా అప్పగించారు. ఇప్పుడు నేను బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విభాగానికి హెడ్‌ని. వందల మంది విద్యార్థులకు మెంటర్‌గా, అధ్యాపకురాలిగా దిశానిర్దేశం చేస్తున్నా. అసాధ్యం అనేది ఉండదని నా నమ్మకం. ఎవరి తల రాత వాళ్ల చేతుల్లోనే ఉందన్న దాన్ని నమ్మి పాటిస్తా. నా విద్యార్థులకీ అదే చెబుతా. సాధించడానికి వయసు అడ్డంకి అనుకోను. అందుకే ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా’ అంటున్నారు 50 ఏళ్ల లక్ష్మి. ఆధునిక ధోరణులను అందిపుచ్చుకుంటూ ఈ తరానికి దిశానిర్దేశం చేస్తున్న ఆవిడ జీవితం స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్