అందమైన బాల్యం చెక్కాలని!

నిషా రామస్వామి మూడు నెలల పాపకి చర్మం మీద దద్దుర్లు కనిపించేవి. డాక్టర్‌కి చూపిస్తే అదో రకం అలర్జీ అన్నారు. ప్లాస్టిక్‌ బొమ్మలతో ఆడుకోవడంవల్ల అలా వస్తున్నట్టు గమనించింది నిషా. దాంతో పాపకు అవసరమైన ఆట వస్తువుల్ని చెక్కతోనే చేయించింది. అదే తర్వాత ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది....

Published : 06 Aug 2022 01:06 IST

నిషా రామస్వామి మూడు నెలల పాపకి చర్మం మీద దద్దుర్లు కనిపించేవి. డాక్టర్‌కి చూపిస్తే అదో రకం అలర్జీ అన్నారు. ప్లాస్టిక్‌ బొమ్మలతో ఆడుకోవడంవల్ల అలా వస్తున్నట్టు గమనించింది నిషా. దాంతో పాపకు అవసరమైన ఆట వస్తువుల్ని చెక్కతోనే చేయించింది. అదే తర్వాత ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది.

ఇంజినీరింగ్‌ చేసిన నిషా.. టీచర్‌గా మారాలనుకుని మాంటెసరీ విద్యా విధానంలో శిక్షణ తీసుకుంది. ఆపైన కొన్నాళ్లు టీచర్‌గా పనిచేసింది కూడా. పిల్లల ఎదుగుదలలో బొమ్మల పాత్ర ఆమెకు తెలుసు. కానీ ప్లాస్టిక్‌ వస్తువులతో పాపకి అలర్జీ రావడం చూసి.. పాకడం, వస్తువుల్ని పట్టుకోవడం మొదలుపెట్టేసరికి వడ్రంగి సాయంతో ఆడుకోవడానికి చెక్క బొమ్మలు చేయించింది. ‘పిల్లల ఎదుగుదలకు సంబంధించి నెల నుంచి మూడేళ్ల వరకూ చాలా కీలకం. శారీరకంగా ఎంతో మార్పు ఉంటుంది. కొన్నాళ్లు మాటలు రాక, వచ్చాక వివరంగా చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వారిని గమనిస్తూ మనమే అవసరాల్ని తెలుసుకోవాలి’ అంటుంది నిషా. ఆ వయసు పిల్లలు ఆడుకోవడానికి మార్కెట్‌లో చెక్కతో చేసిన బొమ్మలు ఏం ఉన్నాయో చూద్దామని వెతగ్గా ఎక్కువగా కనిపించలేదు. మొదట పాప కోసం వేపతో టీతర్స్‌, రేటల్స్‌ని చేయించింది. అవి చూసిన స్నేహితులూ, సహోద్యోగులు తమ పిల్లల కోసమూ అలాంటివి కావాలనే వారు. అప్పుడే చెక్క బొమ్మల తయారీ సంస్థని ప్రారంభించాలనుకుంది నిషా. భర్త సహకారంతో 2018లో ‘అరిరో’ని మొదలుపెట్టింది. అంటే తమిళంలో జోలపాటని అర్థం.

దానికి ముందు చెక్క బొమ్మలూ, అందుకు వాడే రంగుల గురించి తెలుసుకోవడానికి ఫ్రాన్స్‌, స్వీడన్‌, ఇండోనేషియా, చైనా మొదలైన దేశాలకు వెళ్లి అవగాహన తెచ్చుకుంది. ‘పిల్లల అవసరాలు, వారు వస్తువులు పట్టుకునే తీరు.. ఇవన్నీ గమనించి ఓ జాబితా రాసుకున్నాం. తర్వాత మన కళాకారులకి అలా తయారు చేయడంలో మార్గనిర్దేశం చేసేవాళ్ల’మంటారు నిషా. ప్రస్తుతం 200 మంది హస్తకళా నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. రూ.200-19000 మధ్య ధర ఉండే 80 రకాల ఉత్పత్తులు తెస్తున్నారు. ఇప్పటివరకూ లక్షకుపైగా బొమ్మలు అమ్మారు. కంపెనీ టర్నోవర్‌ రూ.3.5 కోట్లను దాటింది. షార్క్స్‌ అమన్‌ గుప్తా, పియూష్‌ బన్సాల్‌ పది శాతం వాటాకు రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. ‘మా దగ్గర చాలా రకాల బొమ్మల ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిని ఆచరణలోకి తేవడానికి ఎన్నో సవాళ్లు ఎదురవున్నాయి. అయినా అధిగమిస్తామని నమ్ముతున్నాం’ అని చెబుతోంది నిషా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్