పేద పిల్లల ఆశలకు రెక్కలు తొడగాలని..!

తన పుట్టినరోజున చాక్లెట్లు, పుస్తకాలు వగైరా పంచేవారు చారు షా. వాటి ప్రయోజనం కొంత కాలమే కదా అని అర్థమైందామెకు!  రోజుకో, ఏడాదికో కాక ఆ సాయం అందుకున్నవారి జీవితాల్ని మలిచేలా, ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా ఉండాలనుకున్నారు. దీంతో ఉడాన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి

Updated : 10 Aug 2022 08:58 IST

తన పుట్టినరోజున చాక్లెట్లు, పుస్తకాలు వగైరా పంచేవారు చారు షా. వాటి ప్రయోజనం కొంత కాలమే కదా అని అర్థమైందామెకు!  రోజుకో, ఏడాదికో కాక ఆ సాయం అందుకున్నవారి జీవితాల్ని మలిచేలా, ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా ఉండాలనుకున్నారు. దీంతో ఉడాన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద పిల్లలకు నైపుణ్యాలు బోధిస్తున్నారు. వందల గొంతులు, వేల చేతులు ఆమెకు తోడయ్యాయి. వారితో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆశలకు రెక్కలు తొడుగుతున్నారు. తనని వసుంధర పలకరించగా.. ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

మాది హైదరాబాద్‌. రెండేళ్లు భాషానైపుణ్యాలపై కార్పొరేట్‌ ట్రైనర్‌గా పనిచేశా. చిన్నతనంలో ప్రతి పుట్టినరోజుకూ మా అమ్మ అనాథాశ్రమాలకి తీసుకెళ్లేది. పండ్లు, వస్తువులను నా చేత ఇప్పించేది. ‘మన ఆనందం నలుగురికీ ఉపయోగపడాలి’ అనేది. ఆ మాటలు నాపై ప్రభావం చూపాయి. దీంతో కొనసాగిస్తూ వచ్చా. 2011లో ఓసారిలాగే పిల్లలకు పుస్తకాలు, బొమ్మలు పంచడానికి సికింద్రాబాద్‌ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లా. అక్కడి ప్రధానోపాధ్యాయురాలు ‘మా పిల్లలకు పుస్తకాలు, బొమ్మలు కాదు.. ఆంగ్ల నైపుణ్యాలు కావాలి. వాళ్లూ మీలా మంచి ఉచ్ఛారణతో మాట్లాడాలి. నేర్పించగలరా..’ అని అడిగారు. రెండు నెలలు ఉపాధ్యాయులకూ తర్వాత రోజూ సాయంత్రం పిల్లలకూ నేర్పడం మొదలుపెట్టా. గట్టిగా అరిచి చెప్పాలి కదా.. గొంతు పాడైంది. అదీకాక అన్ని తరగతులకూ నేనొక్కదాన్నే బోధించడం కష్టమని అర్థమైంది. స్నేహితులు, తెలిసినవారి సాయమడిగా. ఆరుగురు మహిళలు ముందుకొచ్చారు. వారంతా వేర్వేరు ప్రాంతాలవాళ్లు. సికింద్రాబాద్‌ రావడానికి ఇబ్బంది పడేవారు. వారి వారి ప్రదేశాల్లోని ప్రభుత్వ పాఠశాలలైతే ఈ ఇబ్బంది ఉండదనుకున్నా. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు తిరిగి ఆంగ్ల బోధన అవసరమున్న పాఠశాలలు గుర్తించా. తీరా వెళితే పాఠశాల పూర్తయ్యాక బోధించమనేవారు. రోజంతా పాఠాలు వినున్న పిల్లలకి అప్పుడిక ఆసక్తేం ఉంటుంది? ఇదే చెప్పి స్కూలు వేళల్లోనే కొంత సమయమివ్వమని కోరాం. ప్రతిఫలం ఆశించకుండా.. చేస్తున్నామని నచ్చజెప్పాక ఒప్పుకొన్నారు. తర్వాత్తర్వాత ‘ఏ సంస్థ తరఫున చేస్తున్నార’నడిగేవారు. అప్పుడే మాకంటూ ఓ సంస్థ ఉండాలనుకున్నా. పక్షుల్లో ఎక్కువ ఎత్తు ఎగిరే గద్ద గురించి చదివిన కథ స్ఫూర్తి కలిగించింది. ఈ పక్షిలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్నీ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2011 ఆగస్టు 2న ‘ఉడాన్‌’ ప్రారంభించా. అది అమ్మ పుట్టినరోజు కూడా!

30 పాఠశాలల దత్తత

ఉడాన్‌ తరఫున 30 పాఠశాలలు దత్తత తీసుకున్నాం. 8500 మంది విద్యార్థులకు సేవలందించాం. సంస్థ ఉద్దేశం పిల్లల్లో నైపుణ్యాలు పెంచడమే. ఇందుకోసం ఆంగ్లంతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలనీ అందిస్తున్నాం. తొలుత అబిడ్స్‌, రాంకోఠి ప్రభుత్వ పాఠశాలలకు, తర్వాత బండిమెట్‌, నల్లగుట్ట, కొంపల్లి, కొండాపూర్‌ పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేశాం. ఆంగ్లం, కంప్యూటర్‌ బోధనకు ప్రత్యేకంగా పుస్తకాలనూ రూపొందించాం. మా సంస్థలో మహిళా వలంటీర్లే ఎక్కువ. వారానికోరోజు ప్రతి పాఠశాలకు 8-10 మంది వెళ్లి ఉచితంగా ఈ నైపుణ్యాలను బోధిస్తుంటారు. ఆరుగురు సభ్యులతో మొదలైన ఉడాన్‌లో.. 135 మంది వరకూ శాశ్వత వలంటీర్లున్నారు. మరో వేయి మంది విద్యార్థులు మద్దతిస్తున్నారు. 14 నుంచి 70ఏళ్ల వారి వరకు.. ఎవరైనా వలంటీర్లుగా చేరొచ్చు. మా సేవలు, పారదర్శకత మెచ్చి దాతలు ముందుకొస్తున్నారు.ఉడాన్‌కు ఎక్కడా బ్యాంకు అకౌంట్లు లేవు. దాతలు, ప్రభుత్వ పాఠశాలల మధ్య మేం వారధులం మాత్రమే. గత ఆరేళ్లుగా ఏటా రూ.6 లక్షల విలువైన నోటు పుస్తకాల్ని 25 పాఠశాలల్లో అందిస్తున్నాం. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 35 మందికి ఉపకారవేతనాలు, కంప్యూటర్‌ శిక్షణ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, సంగీతం నేర్పించడం, క్రీడా దుస్తులు, సామగ్రి అందించడం.. లాంటివి చేస్తున్నాం. లాక్‌డౌన్‌లో పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులకు సాయపడేలా 200 సెల్‌ఫోన్స్‌, 14 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్స్‌ అందించాం. కంప్యూటర్‌ శిక్షకులకు దాతల సాయంతో వేతనాలిస్తున్నాం.

ఇతర రాష్ట్రాలకు..

మావారు రాజేష్‌ వ్యాపారవేత్త. పిల్లలూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. దీంతో నా పూర్తి సమయం సేవకే. ఇతర రాష్ట్రాలు, నగరాలకూ విస్తరించాలనుకుంటున్నా. సేవకు సమయం కేటాయించాలనుకునే వారికి వేదికగా నిలవాలనుకుంటున్నా. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరో ఒకరు పలకరించి.. ‘మీరు నేర్పిన నైపుణ్యాలు మేం జీవితంలో స్థిరపడటానికీ, ఎదగడానికీ తోడ్పడుతున్నాయి’ అంటుంటారు. కొందరు ఇంకొందరికీ సాయపడుతున్నారు. ఇలాంటివి వింటున్నప్పుడు నా కృషికి సార్థకత చేకూరిందన్న తృప్తి కలుగుతుంది. మరింత సేవ చేయాలన్న స్ఫూర్తీ రగులుతుంది.


స్వతంత్ర అమృత మహోత్సవాల వేళ మహిళా విద్యకు ప్రాధాన్యం పెరగాలి. దానికి తగిన తోడ్పాటు అందరూ అందించాలి. వివిధ హోదాల్లో ఉన్న మహిళలమంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తే అట్టడుగు స్థాయిలో ఉన్న ఆడవాళ్లకు సాయమందించడమే కాదు సానుకూల సమాజానికీ, దేశాభివృద్ధికీ కారకులమవుతాం’

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్