ఆమె అతని సైన్యం

వ్యక్తిని ప్రేమించడమంటే వాళ్ల బాధ్యతనీ ప్రేమించడమని నమ్మారు. భర్త మధ్యలోనే వదిలిన దేశభద్రత బాధ్యతను భుజాన వేసుకొన్న వీరనారీమణుల్లో కొందరు వీళ్లు..

Updated : 15 Aug 2022 08:56 IST

వ్యక్తిని ప్రేమించడమంటే వాళ్ల బాధ్యతనీ ప్రేమించడమని నమ్మారు. భర్త మధ్యలోనే వదిలిన దేశభద్రత బాధ్యతను భుజాన వేసుకొన్న వీరనారీమణుల్లో కొందరు వీళ్లు..


మొదటి వ్యక్తి తనే..

‘ఆర్మీ ఓ అద్భుత ప్రదేశం. మన పిల్లలు ఆ వాతావరణంలోనే పెరగా’లన్న భర్త మేజర్‌ సుఖ్విందర్‌ జీత్‌ రాంధ్వా కోరికే తనను నడిపించిందంటారు రవీందర్‌. పెళ్లయ్యే వరకు ఆర్మీ గురించే తెలీదు. పంజాబ్‌లోని చౌటాలా అనే గ్రామం తనది. సుఖ్విందర్‌తో వివాహమయ్యాక ఫరీద్‌కోట్‌ మిలిటరీ స్టేషన్‌లో కాపురం పెట్టారు. అక్కడ ఉపాధ్యాయురాలిగా చేరిన రవీందర్‌ పాప పుట్టాక మానేశారు. 1997 జూన్‌.. జమ్మూకశ్మీర్‌లో సుఖ్విందర్‌ సారథ్యం వహిస్తోన్న బెటాలియన్లపై తీవ్రవాదులు దాడి చేశారు. ఒక సైనికుడు మృతి చెందగా ఆయన గాయపడ్డారు. అయినా పోరాటం ఆపలేదు. చివరికి తీవ్ర రక్తస్రావమై చనిపోయారు. ‘ఆయన్ని వైద్యం కోసం తరలించబోతుంటే.. ‘ముందు ఉగ్రవాదుల పని పట్టండి. నా గురించి వదిలేయండి’ అన్నారట. ఆయనిచ్చిన ధైర్యంతో మన సైనికులు వాళ్లందరినీ మట్టుపెట్టగలిగారు. చనిపోయే సమయంలోనూ ఇంకా ఏదో చేయలేకపోయానన్న బాధే ఆయనలో’ అంటారు రవీందర్‌. అప్పటికి వాళ్ల పెళ్లై మూడేళ్లే. నెలల పాప. పాపకి ఏడాది వయసొచ్చాక, భర్త చనిపోయిన 8 నెలలకు మిలిటరీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికి ఆమెకు 27 ఏళ్లు. దీంతో కష్టమన్నారు. కానీ తను రక్షణ మంత్రిత్వ శాఖను ఒప్పించి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్ష రాసి, అర్హత సాధించారు. చెన్నైలో శిక్షణ తర్వాత 1999లో విధుల్లో చేరారు. లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ స్థాయికి ఎదిగారు. చనిపోయిన సైనికుడి భార్య సైన్యంలో చేరడం ఆమెతోనే ప్రారంభమైంది. ‘ఈ ప్రయాణం కష్టమని తెలుసు. కానీ నా భర్త కలల్ని నిజం చేస్తున్నానన్న సంతృప్తి ముందు మిగతావన్నీ చిన్నవనిపించాయి’ అంటారీ 51 ఏళ్ల వీరనారి.


అతనితోపాటే చనిపోవాలనుకుని...

త్రువులతో పోరాడుతూ చనిపోయిన భర్తతోపాటే చితికి చేరాలనుకుంది శాలినీ సింగ్‌. తనది ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మధ్యతరగతి కుటుంబం. 18 ఏళ్ల వయసులో మేజర్‌ అవినాష్‌ భదురియాని పెళ్లాడింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌.. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పోస్టింగ్‌. అన్యోన్య దాంపత్యం. అందుకు గుర్తుగా రెండేళ్లకు ధ్రువ్‌ పుట్టాడు. అప్పుడే అవినాష్‌ని జమ్మూకశ్మీర్‌కి బదిలీ చేశారు. దీంతో కుటుంబాన్ని సొంతూరికి పంపారు అవినాష్‌. ‘రోజుకో ఉత్తరం, పదిరోజులకో ఫోన్‌.. ఏడాదిన్నరపాటు ఇలానే గడిపాం. తను ఇంటికొచ్చిందీ ఒక్కసారే. అక్టోబరు 2001లో ఇంటికొస్తానన్నప్పుడు ఆనందం పట్టలేకపోయా. కానీ సెప్టెంబరు 28న ఉగ్రదాడిలో మాకు దూరమయ్యారు. చనిపోయే ముందు నలుగురు తీవ్రవాదుల్ని మట్టుపెట్టిన ఆయన ధైర్యాన్ని అందరూ పొగుడుతోంటే.. నాకేమో ప్రపంచమే తల్లకిందులైన భావన. నేనూ తనతోపాటే జీవితం చాలించాలనుకున్నా. బాబుని చూసి ఆగిపోయా. ఆయన ప్రాణమంతా సైన్యంపైనే. అందుకే ఆయన బాటలోనే నడవాలనుకున్నా’నంటారు శాలినీ. అవినాష్‌ చనిపోయిన 3 నెలలకే ప్రవేశపరీక్ష రాసి, చెన్నైలోని ఆర్మీ ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరారు. సిజేరియన్‌ జరిగిన ఆవిడ శరీరం సహకరించకపోయినా భర్త ఆశయం కోసం పంటి బిగువన శిక్షణ పూర్తిచేశారు. సైనిక దుస్తుల్లోనే భర్త సాహసానికి గుర్తుగా ఇచ్చిన కీర్తిచక్రను అందుకున్నారు.


41 ఏళ్ల వయసులో..

తండ్రిని కోల్పోయిన చిన్నారులు.. భర్త మధ్యలోనే వదిలెళ్లిన బాధ్యత. రెండూ ముఖ్యమే అనుకున్నారు సంధ్య. నాన్న నేవీ అధికారి. అదే నేపథ్యమున్న లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ కుంతల్‌ వాద్వాని పెళ్లాడి ముంబయికి మకాం మార్చారు. అక్కడే నేవీ పాఠశాలలో టీచర్‌గా చేరారు. తర్వాత వైజాగ్‌, పుణె చివరగా కోల్‌కతాలో మిసైల్‌ డెస్ట్రాయర్‌.. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతాకు ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలు చేపట్టారు కుంతల్‌. వీళ్లకిద్దరు పిల్లలు. ‘2017 మార్చి.. యథావిధిగా పిల్లల్ని స్కూల్లో దింపి, ఉద్యోగానికెళ్లా. మావారి స్నేహితుడి నుంచి ఫోన్‌. కుంతల్‌ చనిపోయారని! ఆరోజు ఆయన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఫైర్‌ఫైటింగ్‌ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నారు. ఇంతలో ఏదో లోపం తలెత్తింది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అందరికీ ముప్పని వారిని బయటకు పంపి, ఆయన ఒక్కరే సమస్యను పరిష్కరించాలనుకున్నారు. ఆయన ఊహించినట్టుగానే పేలుడు జరిగి తలకు దెబ్బతగలడం, కార్బన్‌డై ఆక్సైడ్‌ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో చనిపోయారు. ఆ ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేయడం ఆయన కల. దాన్ని మధ్యలోనే ఎలా వదిలేయగలను? మూడో రోజే ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా కమాండింగ్‌ ఆఫీసర్‌ని కలిసి మావారి బాధ్యతను నేను కొనసాగిస్తానన్నా. స్పెషల్‌ కేస్‌ కింద అనుమతించారు. అప్పటికి నా వయసు 41. నాకంటే సగం వయసున్న వారితో పోటీపడి శిక్షణ పూర్తిచేశా’ అంటారు సంధ్య. 2015 గణతంత్ర దినోత్సవాల్లో 144 మంది మహిళలతో కూడిన పెరేడ్‌ను ముందుండి నడిపారీ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌.


వీళ్ల స్ఫూర్తితో ఇలా సైన్యంలో చేరుతున్న సైనిక వితంతువుల సంఖ్య పెరుగుతోంది. వీళ్లందరి త్యాగాల ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్