500 మంది సైన్యం... రూ.2 కోట్ల సాయం!

పెద్దల నుంచి ఆస్తుల్ని కాకుండా... వ్యక్తిత్వాన్ని వారసత్వంగా అందుకోవాలని ఎంతమంది అనుకుంటారు? శర్వాణి మాత్రం ఇలానే ఆలోచించింది. అందుకే తెలుగు నేల మీద బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పసిపిల్లల కోసం అమెరికాలో ‘హోప్‌4స్పందన’ ట్రస్టుని స్థాపించింది. తన సేవా యజ్ఞంలో ఐదువందల మందిని భాగస్వాములుగా చేసి.

Updated : 17 Aug 2022 07:53 IST

పెద్దల నుంచి ఆస్తుల్ని కాకుండా... వ్యక్తిత్వాన్ని వారసత్వంగా అందుకోవాలని ఎంతమంది అనుకుంటారు? శర్వాణి మాత్రం ఇలానే ఆలోచించింది. అందుకే తెలుగు నేల మీద బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పసిపిల్లల కోసం అమెరికాలో ‘హోప్‌4స్పందన’ ట్రస్టుని స్థాపించింది. తన సేవా యజ్ఞంలో ఐదువందల మందిని భాగస్వాములుగా చేసి.. కోట్ల విరాళాలు సేకరించి అందిస్తోన్న కోట శర్వాణితో వసుంధర మాట్లాడింది.. 

బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న చిన్నారులని అక్కున చేర్చుకున్న హోమ్‌ అది. పేరు స్పందన. అమెరికా నుంచి తాతగారి ఊరైన అనంతపురం వచ్చినప్పుడు శర్వాణి ఆ పిల్లలని చూసి చలించిపోయింది. ‘వాళ్లకు సాయం చేస్తా!’ అంది. అమ్మానాన్న సరే అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతోంది. అయినా ఆ తల్లితండ్రులు ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ అమ్మానాన్నలు అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌ వాసులు కోట లక్ష్మీ నర్సింహ, మాధురిలు. ఇండియా నుంచి తిరిగి వెళ్లగానే తన అనుభవాన్ని స్నేహితురాలు అంజలితో పంచుకుంది శర్వాణి. ఆ అమ్మాయీ కదిలిపోయి, చెయ్యి కలిపింది. తర్వాత మరో ఇద్దరు తోడయ్యారు. ‘హోప్‌4స్పందన’ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటుచేసి విరాళాలు సేకరించాలనుకున్నారు. వారుండేది న్యూజెర్సీలో. అక్కడ ఓ గుడిలో హోమం జరుగుతుంటే నిర్వాహకుల అనుమతితో ఒక బూత్‌ ఏర్పాటుచేసి కరపత్రాలు పంచారు. చాలామంది దాతలు ముందుకొచ్చారు. వారంలోనే 15 మంది వాలంటీర్లూ చేరారు. వీరంతా చదువుకునే పిల్లలే. అందరూ ఉత్సాహంగా ట్రస్టు గురించి ప్రచారం చేశారు. కమ్యూనిటీ సెంటర్లూ, సీనియర్‌ సిటిజెన్‌ కేంద్రాలకు వెళ్లి వీణ, డ్యాన్స్‌, పాటలు పాడటం వంటివి చేస్తూ, మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహిస్తూ విరాళాలు సేకరించారు. స్పందన స్కూల్‌ అవసరాలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా విరాళాలు అందించే వారు. మంచి దుస్తులూ, ఆహార ధాన్యాలూ, ఫిజియోథెరపీ సామాగ్రి, సిబ్బంది, మందులు... ఇలా వీటికి అవసరమైన మొత్తాన్ని ఏటా అందిస్తూ వచ్చారు. ఈ స్కూల్‌ ఓ అద్దె భవనంలో ఉండేది. దాంతో వసతులు పెంచడానికీ, మరింత మందిని చేర్చుకోవడానికీ ఇబ్బంది అయ్యేది. ఈ విషయాన్ని గ్రహించి రూ.50 లక్షలతో ఒక భవనాన్ని కొనిచ్చారు. ప్రస్తుతం అక్కడ 70 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.

‘హోప్‌ 4 స్పందన ప్రారంభించి పదేళ్లైంది. ఇప్పుడు నేను మెడిసిన్‌ చేస్తున్నా. చదువుకీ ప్రాధాన్యం ఇవ్వాలి కదా. పైగా పనులన్నీ నేను మాత్రమే చేయకుండా సేవాభావం ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుంటూ వచ్చా. మాకిప్పుడు అమెరికాతోపాటు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లోనూ విభాగాలు ఉన్నాయి. అమెరికాలో 100 కాలేజీలూ, పాఠశాలల్లో ట్రస్టుకోసం పనిచేస్తున్న 500 మంది వాలంటీర్లు ఉన్నారు. ట్రస్టు కోసం అందరూ స్వచ్ఛందంగా పని చేస్తారు. నెలకు 5-7 వేల డాలర్లు ఇచ్చే దాతలూ ఉన్నారు. వీళ్లలో చాలామంది గత పదేళ్లుగా మాతో కలిసి నడుస్తున్నారు. ప్రతి పెన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నామన్న విషయాన్ని వెబ్‌సైట్‌లో పెడతాం’ అని వివరించింది శర్వాణి. తనే ఈ ట్రస్టుకు వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు. చెల్లి సాత్విక మానస కూడా చేదోడుగా ఉంటోంది. 2019లో మానసిక వికలాంగుల కోసం పనిచేసే మరో మూడు స్కూళ్లకూ ఆర్థిక సాయాన్ని విస్తరించారు. వాటిలో రెండు అనంతపురంలో, ఒకటి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉన్నాయి.

ఎందరికో ఆపన్న హస్తం

ఈ నాలుగింటికీ నిధులు అందిస్తూనే తెలుగు రాష్ట్రాల్లో మరింత మందికి సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది శర్వాణి. ఈ సంస్థ సభ్యులు కొవిడ్‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్‌ సేవలు అందించారు. 80 గ్రామాల్లో 10 వేల మంది పేదలకు వివిధ పరీక్షలు చేశారు. పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి 5 వేల మందుల కిట్లు, 15వేల పీపీఈ కిట్లు ఇచ్చారు. వెయ్యి పేద కుటుంబాలకు నిత్యావసరాలూ అందించారు. భారత్‌తో అనుబంధాన్ని కోరుకునే ఎందరో ప్రవాసులు వీరికి ఆర్థికంగా అండగా నిలవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్‌ బాధితులూ, వికలాంగులూ, రైతులూ.. ఇలా తమ దృష్టికి వచ్చిన అవసరార్థులకు సాయం చేస్తూ వస్తున్నారు. వ్యవసాయ పనులకు ఇబ్బంది పడటం చూసి 15 మంది పేద రైతులకి ఎద్దుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేశారు. 30 మంది ఫ్లోరోసిస్‌ బాధితులకు ఎలక్ట్రిక్‌ వీల్‌ ఛైర్లు అందించారు. వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమైన 50 మందికి అవసరమైన కిట్లను ప్రతి నెలా అందిస్తున్నారు. వికలాంగులు కుటుంబానికి ఆర్థికంగా భారం కాకూడదని వాళ్లు కిరాణా, ఫ్యాన్సీ స్టోర్లు నిర్వహించుకునేందుకు సాయపడుతున్నారు. రూ.1.2 లక్షలు చొప్పున ఆర్థిక సహకారం అందించి సుమారు 50 మందికి ఇలా తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాల్ని సంస్థ కోఆర్డినేటర్‌ అరికపూడి రఘు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వైద్యవిద్య చదువుతుండటం వల్ల శర్వాణి తరచూ రాలేకపోతోంది. వాళ్ల నాన్న మాత్రం ఏడాదిలో రెండు సార్లు వచ్చి పర్యవేక్షిస్తుంటారు.


అమ్మానాన్నల నుంచి నలుగురికీ సాయపడే లక్షణం వచ్చింది. ఎప్పుడూ వాళ్లనుంచి అభ్యంతరం రాలేదు. ఆస్తులు కాదు, మంచి వ్యక్తిత్వమే అసలైన వారసత్వం అంటారు వాళ్లు. నేను వైద్య రంగంలోకి రావడానికి ఒక రకంగా ఈ సేవా కార్యక్రమాలే కారణం. ట్రస్ట్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.2 కోట్లకుపైనే విరాళాలు సేకరించి సాయం అందించాం. అమాయక పిల్లలూ, నిరుపేదల పెదాలపై చిరునవ్వు చూస్తున్నకొద్దీ ఈ సేవల్ని మరింత విస్తరించాలనిపిస్తోంది

- బొంత పరంజ్యోతి, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్