చేయీ చేయీ కలిపారు.. రికార్డు కొట్టారు!

ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఏం చేయుగలరు? కుట్లు, అల్లికలు కడుపు నింపుతాయా? ఈ ప్రశ్నలకు గట్టి సమాధానం చెప్పాలనుకున్నారీ మహిళలు. 200 మంది కలిసి 4686 టోపీలను అల్లారు. గిన్నిస్‌ రికార్డుని

Updated : 23 Sep 2022 00:28 IST

ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఏం చేయుగలరు? కుట్లు, అల్లికలు కడుపు నింపుతాయా? ఈ ప్రశ్నలకు గట్టి సమాధానం చెప్పాలనుకున్నారీ మహిళలు. 200 మంది కలిసి 4686 టోపీలను అల్లారు. గిన్నిస్‌ రికార్డుని సృష్టించారు.

కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. గృహిణులకు శారీరక శ్రమకుతోడు మానసిక ఒత్తిడీ తోడైంది. ఇంకొందరికి ఉపాధి కరవైంది. అలాంటివారికి సాయపడాలనే ఉద్దేశంతో విశాఖపట్నానికి చెందిన మాధవీ సూరిభట్ల 2020లో తన ఎన్‌జీఓ మహిళా మనోవికాస్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. ఊలుతో బొమ్మలు, టోపీలు, స్కార్ఫ్‌లు.. వంటి వివిధ వస్తువుల తయారీ నేర్పించేవారు. దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లో తెలుగువారు, ఇతర రాష్ట్రాలవారూ దానిలో చేరారు. అలా నేర్చుకున్న వారిలో 200 మంది ఒకచోట చేరి నెలరోజుల్లో 4686 టోపీలను అల్లారు. ఇది గిన్నిస్‌ రికార్డుకెక్కింది.

‘మాది నంద్యాల. ఎంబీఏ చేసి, కొన్నిరోజులు ఉద్యోగం చేసి మానేశా. అనారోగ్య కారణాల రీత్యా యోగా నేర్చుకున్నా. నచ్చి శిక్షణ తీసుకొని ట్రైనర్‌గా మారా. లాక్‌డౌన్‌ సమయంలో ఫేస్‌బుక్‌లో ఉచితంగా అల్లికలు నేర్పిస్తామన్న ప్రకటన చూసి, చేరాలనిపించింది. ప్రారంభంలో నాకు రాలేదు. మానేస్తానని చెప్పా కూడా. మాధవి ఒప్పించడంతో మూడు నెలల్లో తేలిగ్గానే నేర్చుకున్నా. రెండేళ్లుగా సాధన చేస్తున్నా. ఊలుతో బొమ్మలు, దుస్తులు, స్కార్ఫ్‌, బ్యాగ్‌ అన్నీ చేయగలను. ఆర్డర్లు తీసుకుని వేరే వాళ్లకీ చేసిస్తున్నా. అయినా చాలామందిలో ఇదంటే చిన్న చూపే! మా గ్రూపులో చాలామంది గృహిణులే. ఇవేమైనా తిండి పెడతాయా అన్న మాటలు చాలాసార్లు విన్నాం. దీంతో ఇంట్లో ఉండే ఆడవాళ్లం ఏదైనా చేయగలం అని నిరూపించాలనుకున్నాం. ఏదైనా గుర్తింపు తెచ్చుకునే మార్గం చెప్పమని మాధవి గారిని అడిగాం. ఆవిడ ఇప్పటికే మూడుసార్లు గిన్నిస్‌ రికార్డు సాధించారు. అప్పుడు తను గిన్నిస్‌ వాళ్లని సంప్రదిస్తే నెలరోజుల్లో వెయ్యి టోపీలు చేయాలన్నారు. 200 మందిమి పాల్గొన్నాం. కేవలం రికార్డులానే ఉండొద్దని ఈ టోపీల్ని పేదలకు ఇవ్వాలనుకున్నాం. వీటిలో కొన్నింటిని క్యాన్సర్‌ కారణంగా జుట్టు కోల్పోయిన వాళ్లకోసం ప్రత్యేకంగా నలుపు రంగులోనే తయారు చేశాం. వెయ్యి అంటే 4686 రూపొందించాం. బృందాలుగా ఏర్పడి దీన్ని పూర్తిచేశాం. నాతోపాటు ఇంకో నలుగురు నాయకత్వం వహించాం. టోపీలు అల్లడం రాని వాళ్లకి మార్గనిర్దేశమూ చేశాం. అందుకు ప్రత్యేక మెడల్‌తోపాటు ధ్రువీకరణ పత్రం అందుకోవడం ఆనందంగా ఉంది. ఇది మా మహిళా సమైక్యతకు, బృందస్ఫూర్తికి చిహ్నం కూడా’  అని చెబుతారు ఈ రికార్డులో పాలుపంచుకున్న తనూజ.

- మల్లికార్జున, నంద్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్