విదేశీ రైతులూ అడుగుతున్నారు

విత్తనాల మీద మొలకెత్తిన మక్కువ పెరటితోటకి పరిమితం కాలేదు. అది మొక్కై వందల రకాల దేశవాళీ కూరగాయల్ని పండించే స్థాయికి విస్తరించింది. ఆ ప్రేమ మహావృక్షమై... విత్తనాలను దేశ, విదేశీ రైతులకూ అందిస్తూ ఉద్యమ స్థాయికి చేరింది. విత్తన మ్యూజియం ఏర్పాటు చేసే దిశగా సాగుతోన్న ప్రియ గాథ ఇదీ...

Updated : 24 Sep 2022 00:45 IST

విత్తనాల మీద మొలకెత్తిన మక్కువ పెరటితోటకి పరిమితం కాలేదు. అది మొక్కై వందల రకాల దేశవాళీ కూరగాయల్ని పండించే స్థాయికి విస్తరించింది. ఆ ప్రేమ మహావృక్షమై... విత్తనాలను దేశ, విదేశీ రైతులకూ అందిస్తూ ఉద్యమ స్థాయికి చేరింది. విత్తన మ్యూజియం ఏర్పాటు చేసే దిశగా సాగుతోన్న ప్రియ గాథ ఇదీ...

ప్రియది తమిళనాడు, దిండిగల్‌. ఎంబీఏ చదివింది. పెళ్లి తర్వాత తిరుపూరులోని నల్లూరుకు వచ్చింది. అక్కడా తన తల్లిలా కాయగూరలూ, ఆకుకూరల్ని పెరట్లోనే పండించడం మొదలు పెట్టింది. ఉద్యోగం చేస్తూనే పెరటితోటనీ కొనసాగించింది. ఆ క్రమంలో అధిక పోషకాలూ, మన వాతావరణాన్ని తట్టుకునే లక్షణాలూ ఉండే దేశీ విత్తనాలపై ఆసక్తి పెరిగింది తనకు. ‘పెళ్లిళ్లకు కేరళ వెళ్లినప్పుడు అక్కడ కాందారి పచ్చిమిర్చి, వెంగేరి వంకాయతోపాటు కొన్ని దేశీ బెండ, ఆకుకూరల విత్తనాలను సేకరించా. 2008లో సొంతింటికి మారాక మిద్దెతోట ఏర్పాటు చేసుకున్నా. అక్కడే అనేక రకాల దేశీ కూరగాయల్ని పెంచుతూ విత్తనాలు భద్రపరిచి, ఆసక్తి ఉన్న వారికి ఇచ్చేదాన్ని. అధ్యయనం చేసే కొద్దీ నాకు వాటిపట్ల మమకారం పెరిగిపోయింది. అందుకే దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.. రాష్ట్రాల్లో తిరిగి వందలాది దేశీ విత్తన రకాలను సేకరించి, నాటేదాన్ని. వాటి నాణ్యత, నిల్వ పరిజ్ఞానాల్లోనూ పట్టుసాధించా’ అని సంబరంగా చెబుతారు ప్రియ. రెండేళ్ల క్రితం ఉద్యోగమూ వదిలేసి తన శమ్ర, సమయం విత్తన సేకరణ, అభివృద్ధికే వినియోగిస్తోందామె. 100 రకాల వంకాయలు, 60 రకాల మిర్చి, 50 రకాల దుంపలు, 38 రకాల బెండ, 30 రకాల సొర.. ఇలా మొత్తం 500 రకాల దేశీ వంగడాలు సేకరించింది. ‘ఆ నోటా ఈనోటా నా గురించి తెలిసి... అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా రైతులూ సంప్రదించడం మొదలుపెట్టారు. వారికీ మన విత్తనాలు పంపుతున్నా. వారి నుంచీ కొత్తరకాల్ని సేకరిస్తా. మెక్సికో నుంచి వచ్చిన మాయన్‌ ఆకుకూర విత్తనాల్ని మనదేశంలో అయిదువేల మందికి ఇచ్చా’ అంటున్న ప్రియ.. మూడెకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సహా రకరకాల పండ్లు పండిస్తోంది. త్వరలో ‘విత్తన బ్యాంకు’ ఏర్పాటు చేస్తానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్