సైనికుల కోసం ఏఐ జాకెట్లు!

కాస్త చలిగా ఉంటే గజగజ వణికిపోతాం. మరి.. మైనస్‌ డిగ్రీల్లో ఎముకలు కొరికే చలిలో పహారా కాసే సైనికుల పరిస్థితేంటి? ఇదే ఆలోచించింది కుష్బూ. దీనికి స్నేహితునితో కలిసి ఏళ్ల తరబడి శ్రమించింది. పరిష్కారాన్నీ కనిపెట్టింది.

Published : 25 Sep 2022 02:22 IST

కాస్త చలిగా ఉంటే గజగజ వణికిపోతాం. మరి.. మైనస్‌ డిగ్రీల్లో ఎముకలు కొరికే చలిలో పహారా కాసే సైనికుల పరిస్థితేంటి? ఇదే ఆలోచించింది కుష్బూ. దీనికి స్నేహితునితో కలిసి ఏళ్ల తరబడి శ్రమించింది. పరిష్కారాన్నీ కనిపెట్టింది.

రిహద్దుల్లో పనిచేసే సైనికులు చలినుంచి తప్పించుకోవడానికి పది కేజీలకు పైగా బరువున్న జాకెట్‌ వేసుకుంటారని కుష్బూ పటేల్‌ ఓసారి విని ఆశ్చర్యపోయింది. పైగా ఆహారం, ఆయుధాలూ వెంట తీసుకెళ్లాలి. మనల్ని కాపాడే బాధ్యతలో వాళ్లింతింత బరువుల్ని మోస్తుండటం తనకు చాలా బాధనిపించింది. దీనికేదైనా పరిష్కారం చూపించాలనుకుంది. అందుకే బీఈ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేసిన తర్వాత పీజీలో డిజైనింగ్‌ తీసుకొంది. తనది గుజరాత్‌. ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌లో చదువుతూనే తన లక్ష్యంవైపు అడుగులు వేసింది. ప్రొఫెసర్‌ సాయంతో ఇండస్ట్రియల్‌ టెక్స్‌టైల్‌ ప్రాజెక్టులు చేసింది. విదేశాల్లోనూ దీనిపై ప్రాజెక్టులు చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపైనే పనిచేసే ఆలోచనలో ఉన్న నీల్‌ పంచల్‌ పరిచయమయ్యాడు. తనో స్టార్టప్‌ కోఫౌండర్‌ కూడా. ఇద్దరూ కలిసి పరిశోధనలు మొదలుపెట్టారు.

‘బరువు తక్కువ, గట్టిదనంతోపాటు సౌకర్యవంతంగా ఉండటం గ్రాఫీన్‌ ప్రత్యేకత. దీంతో వెయ్యి ప్రయోగాలు చేశాక మేమనుకున్న డిజైన్‌ రూపొందించగలిగాం. దీన్ని ఓ పోటీలో ప్రదర్శిస్తే, ప్రశంసలతోపాటు ఆర్మీ డేలో పాల్గొనే అవకాశమొచ్చింది. దానిలో సామాన్య పౌరులు ప్రదర్శించిన ఏకైక ప్రాజెక్టు మాది. అక్కడ ప్రధాని మోదీ ప్రశంసలూ అందుకున్నాం. గ్రాంటుతోపాటు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌, ఆర్మీ డిజైన్‌ బ్యూరోతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. దీనికోసం చలి ప్రాంతాలకు వెళ్లాం, సైనికులతో మాట్లాడాం. తుది రూపు రావడానికి 30 నెలలకుపైనే పట్టింది. తక్కువ నిర్వహణతో ఉండేలా కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి, జాకెట్‌ రూపొందించాం. ఇది వాతావరణ పరిస్థితులు, వేసుకున్న వారి సౌకర్యం ఆధారంగా తగిన వేడిని అందిస్తుంది. మైనస్‌ 50 డిగ్రీ సెల్సియస్‌ చలిలోనూ వెచ్చదనాన్ని అందించగలదు’ అంటోంది కుష్బూ. వీటిని ఈ చలికాలానికి లద్ధాఖ్‌, సియాచిన్‌ ప్రాంతాల్లో సైనికులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. కొన్నాళ్లు పరీక్షించాక పూర్తిస్థాయిలో సైనికులతోపాటు కొద్ది మార్పులతో సామాన్యులకూ అందుబాటులోకి తెస్తామంటున్నారీ ద్వయం. హ్యాట్సాఫ్‌ చెబుదామా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్