ఆమెకు వెయ్యిమంది చెల్లెళ్లు!

చిరు ధాన్యాల సాగు మహిళలకి ఆహారభద్రతనీ, ఆర్థిక భద్రతని ఇస్తుందని నమ్మారామె! ‘సబల స్వచ్ఛంద సంస్థ’ను స్థాపించి 1000 మంది మహిళా రైతులకు ఏకం చేసి, లక్షల్లో వ్యాపారం చేసేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నారు

Updated : 30 Sep 2022 07:42 IST

చిరు ధాన్యాల సాగు మహిళలకి ఆహారభద్రతనీ, ఆర్థిక భద్రతని ఇస్తుందని నమ్మారామె! ‘సబల స్వచ్ఛంద సంస్థ’ను స్థాపించి 1000 మంది మహిళా రైతులకు ఏకం చేసి, లక్షల్లో వ్యాపారం చేసేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నారు విశాఖపట్నానికి చెందిన కొమ్మోజుల సరస్వతి. తన ప్రయాణాన్ని వసుంధరకి వివరించారిలా...

డిగ్రీ తర్వాత... మహిళా సాధికారతకోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరాను. ఆ కార్యక్రమాల్లో భాగంగా.. గృహహింసపై మహిళల్లో అవగాహన తీసుకురావడానికి విజయనగరం వెళ్లా. కొన్ని ఊళ్లలో వృద్ధులు, చిన్నపిల్లలు తప్ప నడివయసు వాళ్లు లేరు. అడిగితే.. ఉపాధి కోసం వలస వెళ్లారన్నారు. ఇంకా ఆరా తీస్తే... అక్కడ సరుగుడు, నీలగిరి చెట్లు పెంచుతున్నారే తప్ప ఆహార పంటలు వేయడం లేదు. ఉపాధి అవకాశాలు కరవవ్వడం, వ్యవసాయం లేకపోవడం, పోషకాహారలోపం వంటివి కూడా మహిళలపై కనిపించని హింసకి కారణమవుతున్నాయని గ్రహించాను. ఇక్కడి ప్రజలని ముఖ్యంగా మహిళలని తిరిగి సాగు బాట పట్టించాలనిపించింది. అలా 2002లో సబల స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది.

పంటమార్చి...

ఇంటి వంటలో మార్పు రావాలంటే.. పంటలో మార్పు తేవాలి. చిరుధాన్యాల సాగు భిన్నంగా ఉంటుంది. మనకు తెలియకుండానే పొలం గట్లపై రకరకాల ఆకుకూరలు పండుతాయి. అవన్నీ వంటింట్లోకి వస్తే పోషకాహార లేమికి తేలిగ్గా చెక్‌పెట్టొచ్చు. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తే నేలా సారవంతం అవుతుంది. ఈ లక్ష్యంతోనే చిరుధాన్యాలని పండిద్దామని గ్రామస్తులని అడిగా. మొదట్లో ఎవరూ ఒప్పుకోలేదు. రుణాలు రావన్నారు. లాభం ఉండదన్నారు. ఇలా కాదని... డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీతో కలిసి రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నా. చిరుధాన్యాల సాగుకు ముందుకొచ్చిన రైతులకు ఆర్థిక సాయం చేస్తాం. అయితే సేంద్రియ ఎరువులనే వాడాలి. తీసుకున్న డబ్బుని ఏడాదికి రూ.వెయ్యి చొప్పున తిరిగి విత్తనాల రూపంలో చెల్లించాలనే నిబంధనలను పెట్టాం. చాలా కష్టమ్మీద గొల్లలపాలెం, సుంకరపాలెం వంటి ఐదూళ్ల వాళ్లు ముందుకొచ్చారు. 200 ఎకరాల్లో సాగును ప్రారంభించారు. వీళ్లలో ఎక్కువమంది మహిళలు! ఇది మా తొలి విజయం. నెమ్మదిగా మిగతా రైతులు తోడయ్యారు. కానీ అందరికీ ఆర్థిక సహకారం అందించలేని పరిస్థితి. అందుకే విత్తనాలు మాత్రం సమకూరుస్తామని భరోసా ఇచ్చా. పంట చేతికొచ్చాక ఒక వంతుకి రెండొంతుల విత్తనాలు మాకివ్వాలి. ఇలా విత్తన బ్యాంకుల్ని బలపరిచా. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి.. ‘పాత పంటలు- సరికొత్త వంటలు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాం. చిరుధాన్యాలతో ఏమేం చేయచ్చో అవగాహన కల్పించా. నాబార్డ్‌ సాయంతో రైతు క్లబ్బులు ఏర్పాటు చేశాం. బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు రుణాలు ఇప్పించాం.

లడ్డూలు... కిచిడీతో

నాబార్డ్‌, వ్యవసాయ పరిశోధన కేంద్రం సహకారంతో రైతులు ప్రగతి బాటపట్టారు. దిగుబడులు బాగా పెరిగాయి. సొంతానికి వాడుకోగా ఇంకా ఉత్పత్తులు మిగిలేవి. కానీ ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయదు. మరేం చేయాలి? అందుకే మేమే కొర్రలు, చోళ్లను కొనుగోలు చేసి... పేదలకు తక్కువ ధరకే విక్రయించాం. తర్వాత చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసి... వాళ్లలో వాళ్లే కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, మార్కెటింగ్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. 90 మంది మహిళలకి చిరు ధాన్యాలతో బిస్కెట్లు, కిచిడీ, లడ్డూలు, ఇడ్లీలు వంటి 30 రకాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చాం. వీళ్లంతా యూనిట్లు ఏర్పాటు చేసుకుని వారి ఉత్పత్తుల్ని విక్రయించుకుంటున్నారు. వీరంతా ఏటా రూ.60 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు 50 గ్రామాల్లో విస్తరించాయి. ఇప్పుడు 900 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. వెయ్యి మంది మహిళా రైతులతో... 35 గ్రామాల్లో మా రైతు క్లబ్బులున్నాయి. ఎవరికి విత్తనాలు కావాలన్నా ఇవ్వడానికి మా సంఘం సిద్ధంగా ఉంటుంది. మా చిరుధాన్యాల చెల్లెళ్లతో కలిసి మెగా ప్రాసెసింగ్‌ యూనిట్‌ని స్థాపించి... వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రతి ఒక్కరికీ  అందించాలనేది నా కల.

- కొమురవెళ్లి మునీందర్‌, జి.రామారావు, విజయనగరం 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్