వయసై పోయిందా.. అంటే!

అరవై ఏళ్లొచ్చాక ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేస్తారు.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటారు... మనవలతో గడుపుతారు అంటారా! ఇదే ప్రశ్న పుష్పా భట్‌ని అడిగి చూడండి. వ్యాయామం చేస్తా, మారథాన్లలో పాల్గొంటా.. అంటూ ఇంకా బోలెడు చెప్పుకొస్తారు. ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకోవాలా.. చదివేయండి...

Published : 01 Oct 2022 00:26 IST

అరవై ఏళ్లొచ్చాక ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేస్తారు.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటారు... మనవలతో గడుపుతారు అంటారా! ఇదే ప్రశ్న పుష్పా భట్‌ని అడిగి చూడండి. వ్యాయామం చేస్తా, మారథాన్లలో పాల్గొంటా.. అంటూ ఇంకా బోలెడు చెప్పుకొస్తారు. ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకోవాలా.. చదివేయండి.

పుష్ప కేయా భట్‌.. పెళ్లైన కొన్నేళ్లకే భర్తతో విడిపోయారు. ఓ పసిపాప. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. ‘నేను ఆఫీసులో ఉంటే తను జాగ్రత్తగా ఉండగలదా?’ అన్న ఆలోచనే ఎప్పుడూ. తనో హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌. శారీరక శ్రమకు మానసిక ఒత్తిడీ తోడై ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. శరీరంపై శ్రద్ధ పెట్టడం లేదన్న విషయం అర్థమైందావిడకి. కానీ అప్పటికే 40 ఏళ్లు దాటాయి. సమయం మించిపోయిందే అని కూర్చోలేదావిడ. ఇప్పటికైనా ప్రారంభిద్దామనుకున్నారు. ఈవిడది ముంబయి. ఏటా నిర్వహించే 7 కిమీల ‘డ్రీమ్‌రన్‌ మారథాన్‌’ గురించి విని అందులో పాల్గొన్నారు. కానీ 15 నిమిషాలకే ఆగిపోయారు. మారథాన్లలో మొత్తం పరుగెడుతూనే ఉండాల్సిన పనిలేదు. సత్తువని బట్టి మార్పులు చేసుకోవచ్చు. ఈ విషయం తెలియక వేగంగా పరుగెట్టారు పుష్ప. కొద్దిసేపటికే ఆగిపోయారు. ఇది ఆవిడలో పట్టుదల రేపింది. కొద్దిరోజులు సాధన చేసి మళ్లీ మారథాన్‌లో పాల్గొన్నారు. ఈసారి గంటపాటు ఏకధాటిగా పరిగెత్తారు. అదిచ్చిన ఉత్సాహంతో తర్వాతా పరుగు సాగించారు. అంతేనా... ఇంకా చాలా ఉంది.

‘46 ఏళ్ల వయసులో జిమ్‌లో చేరా. 60 ఏళ్లకి సైకిల్‌, 64లో అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నుంచి న్యూట్రిషన్‌ కోర్సు, లాక్‌డౌన్‌లో పైలేట్స్‌, యోగాతోపాటు క్లినికల్‌ న్యూట్రిషన్‌ కోర్సులు చేశా. ‘ఇప్పుడు నేర్చుకోవడమా, ఈ వయసులో చేయడమా’ అని విన్న ప్రతిసారి తలచుకోవాలేగానీ ఏదైనా సాధ్యమే అని నిరూపించాలనిపించేది. అలా చేసుకుంటూ వెళ్లిపోయా. 9 అల్ట్రా, 11 ఫుల్‌ మారథాన్లలో గెలిచా. మరెన్నింట్లోనో పాల్గొన్నా. ఈ వయసులో ఇబ్బందేమీ అనిపించదా అని అందరూ ఆశ్చర్యతుంటారు. అందరికీ గెలుపే కనిపిస్తుంది కానీ.. దాని వెనక చాలా శ్రమ దాగుంటుంది. ఫిట్‌నెస్‌ కోసం రోజూ శ్రమపడతా. తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటా. వయసులో ఉన్నప్పుడు కాస్త బద్ధకించొచ్చేమో కానీ.. వయసు పెరిగేటప్పుడే ఇంకాస్త శ్రమపడాలని చెబుతా. ఇప్పుడు నాకు 66. దీన్ని విశ్రాంతి తీసుకునే సమయంగా భావించను. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నా’ అని నవ్వేస్తారు పుష్ప. ఇప్పుడు డిసెంబరులో జైసల్మేర్‌లో జరగనున్న 100 కిమీ మారథాన్‌, టాటా, దిల్లీ మారథాన్లకు సిద్ధమవుతున్నారు. నిద్ర, రోజూ ఎండలో నడక, కొద్దిపాటి వ్యాయామం, కాఫీ, చక్కెరలకు దూరంగా ఉండటం, మీ కోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవడం చేస్తే చాలు.. ఆరోగ్యంగా గడిపేయొచ్చంటారు. ఆడవాళ్లం అయినంత మాత్రాన ఒదిగి ఉండాలనేం లేదు.. నచ్చింది చేసుకుంటూ వెళ్లండి.. కలలు నిజం చేసుకోవడానికి వయసెప్పుడూ అడ్డం కాదని ఆవిడ ఘంటాపథంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్