దాయలేదు ఎదుర్కొన్నాం

ముఖంపై చిన్న మొటిమ వచ్చినా దాచేయాలని చూస్తాం. అదే సమస్య పెద్దదైతే.. బాధ, కుంగిపోవడం! తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం. కానీ వీళ్లను చూడండి.. వెండితెరను ఏలుతోన్న తారలు. వీళ్లకీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.

Updated : 02 Oct 2022 07:32 IST

ముఖంపై చిన్న మొటిమ వచ్చినా దాచేయాలని చూస్తాం. అదే సమస్య పెద్దదైతే.. బాధ, కుంగిపోవడం! తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం. కానీ వీళ్లను చూడండి.. వెండితెరను ఏలుతోన్న తారలు. వీళ్లకీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయినా వాటిని దాయాలనుకోలేదు. ధైర్యంగా అందరి ముందుకూ వచ్చి చెబుతున్నారు. వాటితో పోరాడుతూ... ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మేకప్‌తోనే సమస్య

లేడీ సూపర్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా పేరు నయనతారకి. చర్మ సమస్యతో ఏడాదికిపైగా ఇబ్బంది పడింది. దానికి కారణమూ తెలియదు. ఆ మిస్టరీ స్కిన్‌ డిజార్డర్‌ కారణంగా చాలా రోజులు కెరియర్‌నీ పక్కనపెట్టాల్సి వచ్చింది. షూటింగ్‌లంటే మేకప్‌ తప్పదు. కానీ అది వేస్తే ముఖమంతా దద్దుర్లు, విపరీతమైన మంట. కొన్ని ఆహారపదార్థాలూ పడేవి కాదు. అయినా నయన్‌ కుంగిపోలేదు. కేరళ ఆయుర్వేదంతోపాటు ఇతర చికిత్సల ద్వారా సమస్య నుంచి బయటపడింది. ఇప్పటికీ చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పెద్ద బ్రాండ్‌ల కంటే ఆయుర్వేద ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తుంది. తక్కువ మేకప్‌కే తన ఓటంటుంది.


శారీరకంగానూ.. మానసికంగానూ

అందం, ఫిట్‌నెస్‌లకు సమప్రాధాన్యమిస్తుంది సమంత. ఒకప్పుడు తనకు పీఎల్‌ఈ (పాలీమార్ఫస్‌ లైట్‌ ఎరప్షన్‌) అనే చర్మసమస్య ఉండేది. ఎండకి విపరీతమైన దురద, దద్దుర్లతోపాటు తీవ్రమైన నొప్పి. కెరియర్‌ తొలినాళ్లలో.. అదీ పెద్ద అవకాశాలు వస్తున్నప్పుడు ఈ సమస్య ఎదురైంది. రెండేళ్లు ఎన్నో ఇబ్బందులూ పడింది. కొన్ని సినిమాలూ చేజారాయి. చికిత్స తీసుకొని, ఆ సమస్య నుంచి బయటపడింది సామ్‌. ఈ ఏడాది ప్రారంభంలో మానసిక సమస్యకు గురైనట్టు చెప్పింది. ‘సమస్య ఏదైనా చికిత్స తప్పనిసరి. సమయమూ పడుతుంది. ఓపిక పట్టాలి. చికిత్స, చుట్టూ ఉన్నవాళ్ల ప్రోత్సాహంతో బయటపడటం తేలికే’ అంటుంది.


పీసీఓఎస్‌తో పోరాడింది

నెలసరి సరిగా రాకపోవడం, బరువు పెరగడం, ఆ సమయంలో విపరీతమైన నొప్పి, మొటిమలు.. పీసీఓఎస్‌ కారణంగా వచ్చే సమస్యలే ఇవి. వీటికి తాప్సీ పన్నూ కూడా బాధితురాలే. చికిత్సతో సైడ్‌ ఎఫెక్ట్‌లనూ ఎదుర్కొంది. దీంతో యోగా, శాస్త్రీయ పద్ధతిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది. ఇటీవల ‘వెరికోజ్‌ వెయిన్స్‌’కూ సర్జరీ చేయించుకొంది. కాళ్లు, పాదాల నరాల్లో సరిగా రక్తప్రసరణ జరగక అవి ఉబ్బుతాయి. దీంతో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో సంకోచం తగదనే తాప్సీ..  మెన్‌స్ట్రువల్‌, గైనిక్‌ విషయాల్లో అవగాహనా కల్పిస్తుంటుంది.


చనిపోయే పరిస్థితి నుంచి..

ఒక్కసారిగా నల్లబడటం, బరువు తగ్గడం, తీవ్ర అలసట.. కెరియర్‌ ముగియడానికి ఒక నటికి ఇంతకు మించిన కారణాలేముంటాయి. ఇవన్నీ ఎదుర్కొంది మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌. తనకు ‘అడిసన్స్‌ డిసీజ్‌’. అడ్రినల్‌ గ్రంథి నుంచి హార్మోన్లు సరిగా విడుదలవవు. రోగనిరోధకతపై ప్రభావం పడి, ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. నిలబడాలంటే స్టెరాయిడ్స్‌పై నిరంతరం ఆధారపడాల్సిందే. శారీరక అలసటకుతోడు మానసికంగానూ ఎంతో ఒత్తిడిని అనుభవించింది. ధ్యానం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొంది.


నిల్చున్నా.. నొప్పే!

విరాట్‌ కొహ్లీ భార్యగా కంటే ముందే అగ్ర కథానాయికగా, నిర్మాతగా అనుష్క శర్మ ప్రముఖురాలు. తనది ‘బల్గింగ్‌ డిస్క్‌’ సమస్య. వెన్నెముక వ్యాధి ఇది. కొద్దిసేపు నిల్చున్నా.. నడుము, మెడ మొదలైన ప్రదేశాల్లో తీవ్రమైన నొప్పి. దాన్ని పంటి బిగువున భరిస్తూ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. దీనికి మందులు చాలవు. ఫిజియోథెరపీ కూడా అవసరం. ఆ చికిత్సలు తీసుకోవడమే కాదు ఫిట్‌నెస్‌పై అవగాహనా కల్పిస్తోంది. తనకు ‘యాంగ్జైటీ’ సమస్య కూడా ఉంది. దీనికీ చికిత్స తీసుకోవడమే కాదు.. మానసిక సమస్యలను దాచిపెట్టక ధైర్యంగా ముందుకొచ్చి చర్చించమంటోంది. అవసరమైతే చికిత్స తీసుకోమని సలహానిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్