ఆ తల్లి రుణం..ఇలా తీర్చుకుంటున్నా!

కూచిపూడి కళాకారిణిగా, గురువుగా ఈమెది అయిదున్నర దశాబ్దాల ప్రయాణం. ఈవిడ వేలాది శిష్యుల్లో వందలమంది  గురువులుగానూ స్థిరపడ్డారు. ఆ క్రమంలో ఎన్నో ప్రశంసలూ, సత్కారాలూ అందుకున్నారీమె. తనలానే ఈ కళను దేశ, విదేశాల్లో బతికిస్తున్న వారెందరో.. వాళ్లనీ గుర్తించి ఒక చోట చేర్చిన వేదికంటూ లేదని గమనించి.. ఆ పని తానే చేసి ఆ కళామతల్లి రుణం తీర్చుకుంటున్నారు అణుకుల బాల కొండలరావు.

Updated : 03 Oct 2022 07:45 IST

కూచిపూడి కళాకారిణిగా, గురువుగా ఈమెది అయిదున్నర దశాబ్దాల ప్రయాణం. ఈవిడ వేలాది శిష్యుల్లో వందలమంది  గురువులుగానూ స్థిరపడ్డారు. ఆ క్రమంలో ఎన్నో ప్రశంసలూ, సత్కారాలూ అందుకున్నారీమె. తనలానే ఈ కళను దేశ, విదేశాల్లో బతికిస్తున్న వారెందరో.. వాళ్లనీ గుర్తించి ఒక చోట చేర్చిన వేదికంటూ లేదని గమనించి.. ఆ పని తానే చేసి ఆ కళామతల్లి రుణం తీర్చుకుంటున్నారు అణుకుల బాల కొండలరావు. కళాప్రపంచానికి ‘బాలక్క’గా సుపరిచితమైన ఆవిడ తన ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

విశాఖలో మూడున్నర దశాబ్దాలుగా ఉంటున్నా.. మాది తూర్పుగోదావరి జిల్లా. నాన్న జి.రామబ్రహ్మం, అమ్మ గంగారత్నం. నాన్నకు వ్యవసాయమే జీవనాధారం. తొమ్మిదేళ్లప్పుడు నాకు నృత్యంపై అభిరుచి కలిగింది. అది గమనించిన నాన్న ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో కూచిపూడి నృత్యం అనగానే గుర్తొచ్చేది వెంపటి చిన సత్యం మాస్టారే. ఆయన దగ్గరే నాకు నృత్యం నేర్పించాలనుకుని.. చెన్నైలోని ఆయన నివాసంలోనే గురుకుల విధానంలో శిష్యురాలిగా చేర్పించారు. నేనైతే ఇంటి బెంగ లేకుండా కళామతల్లి ఒడిలోనే సేదతీరేదాన్ని. అయిదారేళ్లలోనే ఆయనకు ప్రియ శిష్యురాలిగా మారిపోయా. దీంతో కొత్తగా వచ్చేవాళ్లకు నేర్పించే బాధ్యత నాకప్పగించేవారు. అలా కె.ఆర్‌.విజయ, తులసి, విజయశాంతి తదితర సినీ నటీమణులకు నృత్యం నేర్పించా. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి. 1982లో గురువుగారితో కలిసి తొలిసారి అమెరికాలో ప్రదర్శన ఇచ్చా. అప్పట్నుంచి ఏటా విదేశాల్లో పర్యటిస్తూ అక్కడా శిక్షణ ఇస్తూనే ఉన్నా. నాట్యంలో ఏదైనా ప్రయోగం చేయాలని 1984లో నాటి మహారాష్ట్ర గవర్నరు కోన ప్రభాకరరావు మా గురువుని కోరారు. నాలుగు నృత్యరీతుల సమ్మేళనంగా ఓ కొత్త ప్రదర్శనకు రూపకల్పన చేశారాయన. నేను కూచిపూడిని.. కథక్‌ని కేయూ మహరాజ్‌, భరతనాట్యాన్ని వాణీ గణపతి ప్రదర్శించాం. అప్పట్లో అదో పెద్ద సంచలనం.

సాగర నగరిలో..

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఏ. చేశా. కొండలరావుతో వివాహానంతరం విశాఖకు చేరి కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపల్‌గా పదేళ్లు పనిచేశా. అనంతరం 1997లో సొంతంగా ‘కూచిపూడి కళా కేంద్రం’ నెలకొల్పా. ఈమధ్యే పూర్వ విద్యార్థుల సమక్షంలో సంస్థ రజతోత్సవం ఘనంగా జరిపాం. కోల్‌కతా, ముంబై, దిల్లీ, బెంగళూరులతోపాటు పిట్స్‌బర్గ్‌, పారిస్‌, రోమ్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి వేలమందికి శిక్షణ ఇచ్చా. నా శిష్యుల్లో వందలమంది నృత్యుకారులుగా, గురువులుగా ఈ రంగంలో రాణిస్తుండటం సంతృప్తినిస్తుంది. 2010లో సిలికానాంధ్ర వారు 2800 మంది కళాకారులతో గిన్నిస్‌ రికార్డు కోసం నిర్వహించిన మహాబృంద నాట్య ప్రదర్శనలో భాగమయ్యా. వాషింగ్టన్‌లోని కళా మండపంలో అతిథి అధ్యాపకురాలిని.
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కూచిపూడి కళని విశ్వవ్యాప్తం చేసిన వారి వివరాల కోసం చూస్తే ఎక్కడా దొరకలేదు. దీంతో నేనే చాలామందిని సంప్రదించి ‘కూచిపూడి అమృతం’ పేరుతో డాక్యుమెంటరీలు రూపొందించి వాటిని ‘కూచిపూడి కళా కేంద్రం’ యూట్యూబ్‌ ఛానెల్లో పెడుతున్నా. ఆ ఈ వివరాల్ని కేంద్ర ప్రభుత్వానికీ అందజేయనున్నా. నాకెంతో ఇచ్చిన కళామతల్లికీ, గురువుకూ ఇది నా గురు దక్షిణగా భావిస్తున్నా.

పిల్లలూ ఈ రంగంలోనే..

పెద్దబ్బాయి ఆనంద్‌ శ్రీహరి.. మృదంగ వాద్యకారుడు. చిన్నవాడు ఆదిత్య నృత్యకారుడు. నాతో పాటు కొన్ని రూపకాల్లో ఆదిత్య అభనయిస్తుంటే.. మృదంగ జతి ద్వారా సహకారం అందిస్తుంటాడు ఆనంద్‌. శిష్యురాలైన ఆముక్తమాల్యదని పెద్ద కోడలిగా చేసుకున్నా. తనూ నాకు చేదోడుగా ఉంటుంది. ఇలా కుటుంబమంతా కళారంగంలోనే తరించడం మా పూర్వజన్మ సుకృతమే. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’, 2016లో ఆంధ్రప్రదేశ్‌ ఉగాది పురస్కారం, కేంద్ర నాటక అకాడమీ పురస్కారం, తమిళనాడు కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ వారి నుంచి ‘నాట్య విశారద’ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నా.

- యద్దనపూడి ఛత్రపతి, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్