చిన్నారుల ఆరోగ్యం గురించి ఆలోచించి..

ఓ చిన్నప్రాణి తమ మధ్యకు రాబోతోందని గర్భిణిగా ఎన్నో కలలు కంది ఆమె... అంతలోనే అది విషాదమయ్యేసరికి తట్టుకోలేకపోయింది. కారణం జీవనశైలి అని తెలిసి ఆవేదనకు గురైంది. పోషకాహారంపై అవగాహన పెంచుకొంది. అది తనకే కాదు వీలైనంత మందికి అందించాలని రసాయన రహిత ఆహారోత్పత్తులను చేస్తూ.. రూ.కోటికిపైగా వార్షికాదాయాన్నీ.. అందుకుంటున్న అషాల శ్రీదేవి స్ఫూర్తి కథనమిది.  

Published : 05 Oct 2022 00:34 IST

ఓ చిన్నప్రాణి తమ మధ్యకు రాబోతోందని గర్భిణిగా ఎన్నో కలలు కంది ఆమె... అంతలోనే అది విషాదమయ్యేసరికి తట్టుకోలేకపోయింది. కారణం జీవనశైలి అని తెలిసి ఆవేదనకు గురైంది. పోషకాహారంపై అవగాహన పెంచుకొంది. అది తనకే కాదు వీలైనంత మందికి అందించాలని రసాయన రహిత ఆహారోత్పత్తులను చేస్తూ.. రూ.కోటికిపైగా వార్షికాదాయాన్నీ.. అందుకుంటున్న అషాల శ్రీదేవి స్ఫూర్తి కథనమిది.    

ఇంజినీరింగ్‌ తర్వాత బెంగళూరులోని ఓ జర్మన్‌ సంస్థలో చేరింది శ్రీదేవి. భర్త చిదానందం. సంసారం సంతోషంగా సాగిపోతోంది. తల్లికాబోతున్న ఆనందాన్ని శ్రీదేవి అనుభవించేలోపే గర్భస్రావమైంది. ఆహార అలవాట్లు, జీవనశైలి కూడా దీనికి కారణమని వైద్యులు చెప్పారు.  

కళ్లు తెరచుకున్నాయి..

అదే మాకు వేకప్‌కాల్‌ అనిపించింది అంటుంది శ్రీదేవి. ‘తట్టి లేపినట్లుగా భావించా. అప్పటి వరకు ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చినవి తినేవాళ్లం. నాణ్యత, పోషకాలకు ప్రాధాన్యతనివ్వలేదు. రసాయనాల గురించి ఆలోచనలేదు. దీంతోపాటు జీవనశైలిని మార్చుకోవడానికి పోషకాహారం, యోగా వంటివి మొదలుపెట్టాం. తర్వాత ఇద్దరాడపిల్లలకు తల్లినయ్యా. వారికి  మంచి ఆహారాన్ని ఇవ్వాలనుకున్నా. మొదటి పాప కోసం ఒకసారి బయటి బేబీ ఫుడ్‌ తీసుకుంటే వాటిలో రసాయనాలుండటం చూశా. అప్పుడు అనిపించింది... గతంలో పిల్లలకు ఏం పెట్టేవారా అని. వెంటనే మా అమ్మనడిగి పాప కోసం స్వయంగా మొలకలతో రకరకాల పొడులు చేసి ఆహారంగా అందించేదాన్ని. రెండో పాప పుట్టినప్పుడు ఇద్దరికీ చేసిచ్చే దాన్ని. ఉద్యోగరీత్యా బయటికెళ్లాల్సి వచ్చేది. పిల్లల ఆలనాపాలన, వారికి ఫుడ్‌ అన్నీ కష్టమైంది. ఉద్యోగం మానేశా. నాలాగే ఆలోచించే తల్లులందరికీ ఈ ఆహారాన్ని పరిచయం చేయాలనుకున్నా. అలా 2019లో ‘టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్‌’ ప్రారంభించా’ అని వివరించింది 39 ఏళ్ల శ్రీదేవి.


అధ్యయనం..

హైదరాబాదులో ఈ స్టార్టప్‌ మొదలుపెట్టిన ఏడాది ఇంట్లోనే ప్రయోగాలు చేసేది శ్రీదేవి. పోషకవిలువలపై అధ్యయనం, పరిశోధనలు ప్రారంభించింది. ‘ప్రస్తుతం రసాయనాలతో కూడిన బేబీ ఫుడ్‌ బయట ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదమే. పిల్లల్లో వ్యర్థాలు పేరుకుపోయేలా చేస్తాయి. బాల్యం నుంచి మొలకలతో చేసే ఆహారాన్ని అందిస్తే, పోషకాలతోపాటు ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ‘టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్‌’ ఉత్పత్తులన్నీ ఇలాగే చేస్తున్నాం. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వువంటివన్నీ వీటిలో ఉంటాయి. ‘సత్తుమావు’లో గోధుమ, రాగులు, బాజ్రా, బ్రౌన్‌రైస్‌, పచ్చిపెసలు, శనగలు, మినుముల మొలకలు, ఓట్స్‌, బాదం, జీడిపప్పు వంటి వన్నీ పొడిరూపంలో ఉంటాయి. ఆరు నెలల పాపాయి నుంచి వీటిని అందించొచ్చు. మా ఉత్పత్తులకు ఇండియా - ఆర్గానిక్‌, యుఎస్‌డీఏ ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ ఉంది. రసాయనాలు, చక్కెర, ఉప్పు, పాలు వంటివేవీ వీటిలో కలపం. ఈ కామర్స్‌ సైట్ల ద్వారా వినియోగదారులను చేరుకుంటున్నాం. పెద్దవారి కోసం కూడా పలురకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. ప్రస్తుతం 20రకాలకు పైగా ఉత్పత్తులుండగా, త్వరలో మరిన్ని పరిచయం చేయనున్నాం’ అని చెబుతున్న శ్రీదేవి సంస్థలో పనిచేస్తున్న వారంతా తల్లులే కావడం విశేషం. 15 ఏళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉండటంకన్నా రేపటితరం కోసం పోషకవిలువలున్న ఆహారాన్ని అందించడం సంతృప్తిగా ఉంది అంటుందీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్